చేతులు కాలాకయినా ఆకులు పట్టుకున్నారు....థాంక్స్ లోకేష్ గారూ !

 

టీడీపీ కార్యకర్తలు, మద్దతుదారులకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని టీడీపీ నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్ తెలిపారు. వైసీపీ నేతలు బెదిరించినా, దాడిచేసినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ కేసులు పెట్టి వేధించినా టీడీపీ ప్రత్యేక విభాగం నంబర్ 7306299999కు సమాచారం అందించాలని సూచించారు. ఎల్లవేళలా పార్టీకి అండగా ఉన్న కార్యకర్తలు, అభిమానులను రక్షించుకోవడం తమ బాధ్యత అని వ్యాఖ్యానించారు. అలాగే టీడీపీ కార్యకర్తలు, మద్దతుదారులను ఆదుకునేందుకు ప్రతీ జిల్లాకు లీగల్ సెల్ ఏర్పాటు చేశామని లోకేశ్ పేర్కొన్నారు. 

టీడీపీ కార్యకర్తలు, మద్దతుదారులు తమపై ఎదురైన వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు https://www.facebook.com/tdpsocialmedialegalcell  అనే ఫేస్ బుక్ పేజీని ప్రారంభించామని తెలిపారు. సోషల్ మీడియాలో ఎలాంటి అభ్యంతరకరమైన పోస్టులు కార్యకర్తల దృష్టికి వస్తే, ఈ పేజీ వేదికగా పంచుకోవాలని కోరారు. అలాంటి వ్యక్తులపై చట్టపరమైన పోరాటం చేస్తామనీ, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పార్టీపై దుష్ప్రచారం చేస్తూ, పార్టీ నేతలపై అసభ్యకరమైన రీతిలో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. 

దీని కోసం ప్రతి జిల్లాలో తెదేపా లీగల్ సెల్ ను ఏర్పాటు చేస్తున్నాం. ఎల్లవేళలా పార్టీకి అండగా ఉన్న కార్యకర్తలను, అభిమానులను రక్షించుకోవడం మా బాధ్యత అని లోకేష్ పేర్కొన్నారు.  అయితే ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సిందనే వాదన ఇప్పుడు వినిపిస్తోంది. దానికి కారణం మనం చేసిన మంచి పనులు జనాలకు తెలిస్తే జనానికి మనం నచ్చొచ్చు నచ్చకపోవచ్చు కానీ కానీ మనపై జరుగుతున్న దుష్ర్పచారాన్ని అడ్డుకోకపోతే ప్రతి ఒక్కరికి దూరమైపోతామని చాన్నాళ్ళగా తెలుగుదేశం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారు ఎప్పటి నుండో మొత్తుకున్నా వారి మాట చెవిన పడేసుకున్న పాపాన పోలేదు పార్టీ. 

కానీ అంతా అయిపోయి జరగాల్సిన నష్టం జరిగాక ఇప్పుడు ఆ విషయాన్ని గొప్పగా చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తనకున్నంత మీడియా బలం వైకాపాకు లేదనే భ్రమలో ఉండింది కానీ అత్యంత ప్రభావవంతమైన సోషల్ మీడియాని వైకాపా ఆక్రమించింది అనే విషయాన్ని పార్టీ గ్రహించలేకపోయింది, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వైకాపా, టీఆర్ఎస్ కార్యకర్తలు చంద్రబాబును తిట్టని తిట్టు లేదు. బోల్లిబాబు అంటూ మొదలు పెట్టి రకరకాల పేర్లతో, ఫోటో మార్ఫింగ్ లతో చంద్రబాబు గురించి చేయని ప్రచారం, చెప్పని అబద్ధమూ లేదు. 

కానీ అధికారంలో ఉన్న పార్టీని ఇంత ధైర్యంగా తిడుతున్నా, వ్యక్తిగత పరువుకు భంగం కలిగిస్తున్నా తెలుగుదేశం ప్రముఖులు అస్సలు పట్టించుకోలేదు. నవ్విన నాపచేను పండుతుంది అనుకున్నారో ఏమో అసలు ఖండన కూడా ఉండేది కాదు. ఏకంగా విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు వైకాపా అనఫీశియాల్ పెయిడ్ పేజెస్ లో లోకేష్, చంద్రబాబుల మార్ఫింగ్ ఫోటోలు పెట్టినా ఎవరూ పట్టించుకోలేదు. విజయసాయిరెడ్డి మొదట తన ట్విట్టరులో ఏదో ఒక ఆరోపణ చేస్తారు. ఆ ఆరోపణ చేసే విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. 

పార్టీలో ఆ స్థాయి వ్యక్తి రాతపూర్వకంగా చెప్పారు అంటే అది నిజమై ఉంటుంది కదా అని ఆ పార్టీ కార్యకర్తలు విస్తృత ప్రచారం చేసేవారు. కానీ ఏ ఒక్క ఆరోపణ మీద కూడా టీడీపీ పరువు నష్టం దావా వేయలేదు. కోర్టుకు వెళ్లలేదు, దీంతో ఆయన మళ్లీ మళ్లీ ఎప్పుడూ ఎవరూ చేయని ఆరోపణలు కూడా చేయడం మొదలుపెట్టారు. అలా రాష్ట్ర ప్రజల్లో చంద్రబాబు పనులను, అభివృద్ధిని అబద్ధమని నమ్మించడంలో వైసీపీ వంద శాతం సక్సెస్ అయ్యింది. దీనిని మొగ్గలోనే అడ్డుకుని ఉంటే టీడీపీకి ఇంత డ్యామేజ్ కచ్చితంగా జరిగేది కాదు. చివరకు ఈరోజు కృష్ణా జిల్లాకు తొలకరి కంటే ముందే నీరు అందిస్తున్న పట్టిసీమ కూడా చంద్రబాబు కట్టి తప్పు చేశాడు, అవసరం అయితే ఆ పట్టిసీమని కూడా కూలగొట్టాలి అని ఆ పార్టీ నేతలు అంటున్నారంటే బాబు చేసిన అభివృద్ధిని వైసీపీ ఎలా ప్రచారం చేసిందో అర్ధం అవుతోంది. మొత్తానికి చేతులు కాలాక అయినా ఆకులు పట్టుకుంటూ మంచి పనే చేస్తున్నారని ఆ పార్టీ శ్రేణులు లోకేష్ కి థాంక్స్ కూడా చెబుతున్నారు.