ఏపీ అసెంబ్లీ నుండి వాకౌట్ చేసిన టీడీపీ

 

ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. శాసనసభ సమావేశాల్లో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వక పోవడమే కాక తమ సభ్యులను కావాలనే సస్పెండ్ చెసారంటూ టీడీపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేసి వెళ్లారు. ఏపీ అసెంబ్లీలో ముందుగా ముగ్గురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. సమావేశాలు ముగిసే వరకూ వీరి సస్పెన్షన్ కొనసాగనుంది. సస్పెన్షన్‌కు గురైన వారిలో అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు అడ్డుపడుతున్నారనే కారణంతో ముగ్గురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌ను మంత్రి బుగ్గన ప్రతిపాదించారు. దీంతో ముగ్గురు టిడిపి సభ్యులను సస్పెండ్‌ చేశారు. ఈ  సందర్భంగా డిప్యూటీ స్పీకర్‌ ఎదుట టీడీపీ ఎమ్మెల్యేలు మూడు ఆప్షన్లను ఉంచారు. క్వశ్చన్‌ అవర్‌లో తమ నాయకుడికి అవకాశం ఇవ్వాలని, తమ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ను ఈ రోజుకే పరిమితం చేయాలని, సెషన్‌ మొత్తం సస్పెండ్‌ చేస్తే టీడీపీ సభ్యులందరినీ చేయాలని స్పీకర్ ను కోరారు. సభ నిర్వహణకు సహకరించేందుకు టీడీపీ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.