ఆంజనేయరెడ్డికి సెల్యూట్!

 

 

 

రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ శాంతి భద్రతల గురించి చర్చించడానికి కేంద్ర హోంశాఖ సీనియర్ ఐపీఎస్ అధికారి విజయ్‌కుమార్ నేతృత్వంలో ఒక టాస్క్‌ఫోర్స్‌ని ఏర్పాటు చేసిన విషయం, ఆ టాస్క్‌ఫోర్స్‌ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. శాంతిభద్రతల విషయం గురించి చర్చించడానికి టాస్క్‌ఫోర్స్‌ విశ్రాంత డీజీపీలతో మంగళవారం నాడు సమావేశం నిర్వహించింది. విశ్రాంత డీజీపీ ఆంజనేయరెడ్డికి కూడా టాస్క్‌ఫోర్స్‌ ఆహ్వానం పంపింది.

 

అయితే ప్రస్తుతం టీఆర్ఎస్‌లో వున్న మాజీ డీజీపీ పేర్వారం రాములుని ఆహ్వానించలేదు. దాంతో టీఆర్ఎస్ నానాయాగీ చేసింది. ఇదంతా సీమాంధ్రుల కుట్రేనని తన సహజశైలిలో నోటికొచ్చిన ఆరోపణలు చేసింది. సమైక్యాంధ్ర ఉద్యమంలో వున్న ఆంజనేయరెడ్డిని ఆహ్వానించి, విభజన ఉద్యమంలో వున్న పేర్వారం రాముల్ని ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించింది. దాంతో ఈ తలనొప్పి ఎందుకనుకున్నారో ఏమోగానీ, హోంశాఖ అధికారులు పేర్వారం రాములుకి ఫోన్ చేసి ఈ విషయంలో మీ అమూల్యమైన సలహాలు ఇవ్వండని కోరారు.



సరే, ఈ విషయం ఇలా వుంటే... మంగళవారం జరిగిన సమావేశానికి ఆహ్వానం అందినప్పటికీ విశ్రాంత డీజీపీ ఆంజనేయరెడ్డి హాజరు కాలేదు. ఎందుకు హాజరు కాలేదన్నదానికి ఆయన ఇచ్చిన వివరణ ఆయన మీద గౌరవం పెంచేలా వుంది.  ‘‘నేను సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉన్నాను. రాష్ట్రం విడిపోకూడదని కోరుకుంటున్నాను. అలాంటి నేను రాష్ట్రం విడిపోతే ఏం చేయాలని ఆలోచించే సభకు ఎందుకు వెళ్తాను? పైగా ఆ సభకు నేను వెళ్ళకపోవడానికి మరో కారణం ఏమిటంటే, రాష్ట్రం ఎప్పటికీ విడిపోదు.. సమైక్యంగానే ఉంటుందన్న నమ్మకం నాకుంది’’ అన్నారు.



ఆంజనేయరెడ్డి లాంటి నిజాయితీపరులైన వ్యక్తుల నమ్మకమే తెలుగుజాతిని ఎప్పటికీ విడిపోకుండా కాపాడుతుందని సమైక్యవాదులు అంటున్నారు.  సమైక్య ఉద్యమానికి నైతిక బలాన్నిచ్చేలా వ్యవహరించిన ఆంజనేయరెడ్డికి సెల్యూట్ చేస్తున్నారు.