జర్నలిస్టు పై తమిళనాడు గవర్నర్ అనుచిత ప్రవర్తన....

 

అధికారం ఉంది కదా అని కొంత మంది నేతలు అనుచితంగా ప్రవర్తించి వివాదాల్లో చిక్కుకుంటారు. అలా ఈసారి చిక్కుల్లో చిక్కుకుంది... తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్. ఓ మహిళా జర్నలిస్టు చెంపను ఆయన తాకి వివాదంలో చిక్కుకున్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవి, ఓ విద్యార్థినిని లైంగిక కార్యకలాపాలకు ప్రోత్సహిస్తూ, ఫోన్ లో మాట్లాడుతున్న వేళ, తనకు గవర్నర్ తెలుసునని చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, దాన్ని ఖండించేందుకు గవర్నర్ మీడియా సమావేశాన్ని పెట్టారు. ఆమెతో తనకు సంబంధం లేదని చెప్పిన గవర్నర్, పలు ప్రశ్నలకు సమాధానాలను దాటవేశారు. ఆయన తిరిగి వెళుతున్న సమయంలో ఓ యువ జర్నలిస్టు మరో ప్రశ్నను సంధించగా, ఆయన సమాధానం ఇవ్వకుండా, ఆమె చెంపపై నిమరడంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు.

 

దీంతో "విలేకరుల సమావేశంలో భాగంగా తమిళనాడు గవర్నర్‌ బన్వరిలాల్‌ను ప్రశ్న అడిగాను. అందుకు బదులుగా ఆయన నా చెంపను తాకారు" అని సదరు జర్నలిస్టు తన ట్విట్టర్ ఖాతాలో వాపోయింది. ఇక ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి దీనికి గవర్నర్ గారు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం...