ఏంటీ బెదిరింపులు?

 

 

 

తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత తెలంగాణ ఉద్యోగుల మీద వుంది. తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు చేసే కామెంట్లు తెలంగాణ ఉద్యోగులకు తలవంపులుగా మారే ప్రమాదం వుంది. శ్రీనివాస్‌గౌడ్, విఠల్ లాంటి వారు ఉద్యోగ సంఘాల నాయకుల ముసుగులో ఎలాంటి కామెంట్లు పడితే అలాంటి కామెంట్లు చేస్తున్నారు.

 

తెలంగాణ ఉద్యోగుల తరఫున ఉద్యమం చేస్తున్నామంటూ సొంత ఎజెండాలతో ముందుకు వెళ్తున్నారు. ఎప్పుడెప్పుడు ఎమ్మెల్యేనో ఎంపీనో అయిపోవాలని కలలు కంటున్న శ్రీనివాస్ గౌడ్ సీమాంధ్రులను కించపరుస్తూ నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడుతున్నారు. తాము కోరుకున్న తెలంగాణ రాకపోతే ఏదేదో జరిగిపోతుందంటూ తెలంగాణలో వున్న సీమాంధ్రులను భయపెట్టే విధంగా మాట్లాడుతున్నారు. రెండు రోజులకోసారి  శ్రీనివాస్ గౌడ్ తన బెదిరింపు కామెంట్లు చేస్తూనే వున్నారు. ఈయన సహచరుడు విఠల్ కూడా మాటల తూటాలు వదలడంలో తాను కూడా ఎంతమాత్రం తీసిపోనని నిరూపించుకుంటున్నారు. 



ఏపీ ఎన్జీవోలు ఏవైనా సమ్మెలు, నిరసనలు లాంటివి చేయదలుచుకుంటే సీమాంధ్రలోనే చేసుకోవాలట. హైదరాబాద్‌లో చేయకూడదట. అసలు ఏపీ ఎన్జీవోలకు తెలంగాణలో సమ్మె చేసే హక్కే లేదట. సమ్మె చేయాలనుకోవడం చిల్లర ప్రయత్నమట. ఒకవేళ అలా సమ్మె చేస్తే తెలంగాణలో వున్న సీమాంధ్ర ఉద్యోగులకు భద్రత వుండదట. అంటే సమ్మె చేస్తే ఏదో జరిగిపోతుందన్న బెదిరింపులు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు ఇలాంటి బెదిరింపులకు దిగడం మంచిది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీళ్ళు బెదిరిపోతే బెదిరిపోయే వాళ్ళు ఎవరూ లేరనీ, తాము చేయదలుచుకున్నది చేసి తీరతామని తెలంగాణలోని సీమాంధ్ర ఉద్యోగులు అంటున్నారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకుల నోళ్ళకు తాళం వేయాల్సిన బాధ్యత తెలంగాణ ఉద్యోగుల మీద వుందని గుర్తు చేస్తున్నారు.