మీడియా 4త్ ఎస్టేట్... సోషల్ మీడియా 5త్ ఎస్టేట్!


ప్రభుత్వం, చట్ట సభలు, న్యాయ వ్యవస్థ, అధికార గణం... ఇవన్నీ  దేశం చక్కగ నడవటానికి మూల కారణాలు. అయితే, వీటికి ఎప్పుడూ తోడుగా వుంటూ వస్తోంది మీడియా. ఒకప్పుడు పత్రికలు, తరువాత ఛానల్స్, ఇంకా తరువాత వెబ్ మీడియా ఎప్పటికప్పుడు తమ సత్తా చాటుతూనే వున్నాయి. కాని,ఇప్పుడు ఫోర్ట్ ఎస్టేట్ అయిన మీడియాకి తోడుగా, జోడుగా ఫిఫ్త్ ఎస్టేట్ తయారైంది! అదే సోషల్ మీడియా!

 

ఆ మధ్య ఈజీప్ట్ లో తమ నియంతకి వ్యతిరేకంగా జోరుగా నిరసనలు జరిగాయి. తరువాత అనేక దేశాల్లో అమాంతం ఉద్యమాలు చోటు చేసుకున్నాయి. అమెరికాలో వాల్ స్ట్రీట్ మొదలు మన ఢిల్లీ వీధుల్లో నిర్భయ నిరసనల దాకా ప్రపంచం అంతా అట్టుడికింది. వీటికంతటికీ సోషల్ మీడియానే కారణం అనేది ఒక వాదన! పైకి ఎవరికి వారు సరదాగానో, కాలక్షేపంగానో ఫేస్బుక్ , ట్విట్టర్ లలో తచ్చాడుతున్నట్టు కనిపిస్తున్నా సోషల్ మీడియా ఇప్పుడు మనిషి జీవితంలో అతి కీలకం అయిపోయింది. దాని ప్రభావం మనకు తెలియకుండానే మనపై తిరుగులేనంత పడుతోంది. ఇంతకు ముందులా ఇప్పుడు ఉద్యమాలు ఎవరి వల్ల వస్తాయి, ఎటు నుంచీ మొదలవుతాయి అని అర్థం కావటం లేదు. అసలు ఒక్కోసారి కొన్ని చారిత్రక ఉద్యమాలు కూడా ఎవ్వరూ ప్రత్యేకంగా పిలుపునివ్వకుండానే మొదలైపోతున్నాయి. మొత్తం వ్యవస్థని స్థంభింపజేసే వరకూ వెళుతున్నాయి.

 

ప్రస్తుతం చెన్నై మెరీనా బీచ్ లో జల్లికట్టు కోసం జనం మొండిపట్టుతో కూర్చున్నారు. దీనికి ఎవరు పిలుపునిచ్చారు? అన్నాడీఎంకే అధికారంలో వుంది కాబట్టి ప్రతిపక్ష డీఎంకే జనాల్ని రోడ్లపైకి రమ్మన్నదా? అలాంటిదేం జరగలేదు! రజినీకాంత్,కమల్ హసన్ లాంటి సెలబ్రిటీలు జల్లికట్టుకు తమ మద్దతు తెలిపారు. నిషేధం తప్పన్నారు. అయినా వారు కూడా ఎవ్వర్నీ మెరీనా బీచ్ కి రమ్మని చెప్పలేదు. కాని, రాత్రికి రాత్రి మెరీనా బీచ్ లో సముద్రంతో పోటీపడేలా జన  సముద్రం ఉప్పొంగింది! అదీ కాక ఇక్కడ మనం గుర్తించాల్సిన మరో విషయం వుంది.

 

వచ్చిన వారిలో అధిక భాగం స్మార్ట్ ఫోన్లు వాడే ప్రజెంట్ జెనరేషనే! సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుండే యూత్, స్టూడెంట్స్, ఎంప్లాయిస్ వరదలా వచ్చేశారు. వీర్ని ఏకం చేసింది నిస్సందేహంగా సోషల్ మీడియానే! కేవలం కొన్ని గంటల వ్యవధిలో ఫేస్బుక్ స్టేటస్ లు, ట్విట్టర్ పోస్టులు అసాధ్యం సుసాధ్యం చేశాయి. ఎన్నికల ర్యాలీలకు కోట్లు కుమ్మరించినా రాని జనం క్షణాల్లో జల్లికట్టు కోసం వాలిపోయారు!
ఒక్కసారి మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ మధ్య జరిగిన నిర్భయ నిరసనల్లో కూడా సోషల్ మీడియా యూజర్సే ఎక్కువగా కనిపించారు. పైగా ఢిల్లీ కావటంతో నెటిజన్స్ నడివీధుల్లోకి అవలీలగా వచ్చేశారు. కొన్ని రోజుల పాటూ కేంద్రాన్ని కల్లోల పరిచారు. చాప కింద సునామీలా ఉప్పొంగుతున్నా సోషల్ మీడియా సత్తా అది!

 

సెల్ఫీలు తీసుకుని తమ టైం లైన్ పై పెట్టి లైక్ లు, కామెంట్స్ కోరుకునే యూజర్సే సోషల్ మీడియాలో చాలా మంది కనిపించవచ్చు. కాని, పైకి ప్రశాంతంగా కనిపించే సరస్సులా వున్నా లోలోపల బడబాగ్నితో రగిలిపోయే సముద్రం లాంటిది సోషల్ మీడియా. దాని వల్ల జల్లికట్టు ఉద్యమాల లాంటి శాంతియుత పరిణామాలు రావచ్చు... లేదంటే కాశ్మీర్ అల్లర్ల మాదిరి హింసాత్మక ధోరణులు కూడా చోటు చేసుకోవచ్చు. అందుకే, ప్రభుత్వాలు, జనం సోషల్ మీడియాను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. అది రెండు వైపుల పదునున్న కత్తిలా మారిపోయిందిప్పుడు!