ఆపరేషన్‌ శశికళ.. 1000 కోట్ల పన్ను ఎగవేత..

 

అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి వీకే శశికళ, ఆమె కుటుంబీకులు, బంధువుల ఇంట్లో ఒక్కసారిగా ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సోదాల్లో దిమ్మతిరిగే నిజాలు వెలుగుచూస్తున్నాయి. ఆమె కుటుంబీకులు, బంధువులు వెయ్యికోట్ల రూపాయలకు పైగా పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఐటీ అధికారుల సోదాల్లో వెల్లడైంది. శశి కుటుంబం బినామీ పేర్లతో 10 బోగస్‌ సంస్థలను ప్రారంభించి, పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడినట్లు ఐటీ వర్గాలు తెలిపాయి. ఈ బోగస్‌ కంపెనీలు, సొంత వ్యాపారాలు, పార్టీ సంస్థలు, కార్యాలయాల ద్వారా రూ.1,000 కోట్లకు పైగా ఆదాయపు పన్ను ఎగవేసినట్లు గుర్తించాయి. ఏడాది క్రితం పెద్ద నోట్ల రద్దు సమయంలో ఈ బోగస్‌ సంస్థల ద్వారా పెద్దఎత్తున నగదు మార్పిడి జరిపినట్టు ఐటీ వర్గాలు కనుగొన్నాయి. మన్నార్‌గుడిలో శశికళ సోదరుడు దివాకరన్‌ నిర్వహిస్తున్న సెంగమళతాయార్‌ మహిళా కళాశాల విడిది గృహంలో రూ.25 లక్షల నగదు, 6 రోలెక్స్‌ గడియారాలు, బంగారం, తదితరాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అంతేగాక 315 బ్యాంకు ఖాతాలనూ స్తంభింపజేసినట్లు సమాచారం.