బలిదేవత సోనియా!

Publish Date:Nov 15, 2013

Advertisement

 

 

 

సోనియా భజన చేయడంలో మితిమీరిపోతున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులను చూసి తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారు. పదవుల కోసం ఇంతలా దిగజారుతున్న టీ కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ప్రజల్లో చులకనైపోతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నట్టు ప్రకటించిన సోనియాగాంధీ మీద టీ కాంగ్రెస్ నాయకులకు అభిమానం, గౌరవం పొంగి పొర్లిపోతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేసులో వున్నవాళ్ళందరూ సోనియాగాంధీని ఆకాశానికెత్తేస్తూ కీర్తిస్తున్నారు.

 

సోనియాని దేవత అంటున్నారు. కొంతమంది మరీ టూమచ్‌గా సోనియాకి తెలంగాణ వ్యాప్తంగా గుడులు కట్టాలని తీర్మానించేస్తున్నారు. సోనియా గుడుల నిర్మాణానికి స్థలాలను కూడా మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిజంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు గుడులు కట్టదలుచుకుంటే కట్టాల్సింది సోనియా గుడులు కాదు.. నిజాం చెర నుంచి తెలంగాణకు విముక్తి కల్పించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గుడులు కట్టాలి. తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుంటూ చనిపోయిన యువకుల గుడులు కట్టాలి. అంతేగాని, తెలంగాణ ప్రజల్ని అమాయకుల్ని చేసి ఆడిస్తున్న, తెలుగుజాతిని నడి రోడ్డమీద నిలబెట్టిన సోనియాగాంధీకి గుడులు కట్టాలని కోరుకోవడమేంటి?
ఇది టీ కాంగ్రెస్ నాయకుల లోలోపల జీర్ణించుకుపోయిన బానిసత్వానికి నిదర్శనంగా కనిపిస్తోంది. ఇలాంటి వాళ్ళకు వాత పెట్టాలంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకుడు రేవంత్‌రెడ్డే కరెక్ట్. గత కొంతకాలంగా సోనియాగాంధీ గుడుల డిమాండ్‌ను పరిశీలిస్తున్న ఆయన ఒక్కసారిగా గళం విప్పారు. వందలాదిమంది తెలంగాణ యువకులు ప్రాణాలు తీసుకోవడానికి కారణమైన సోనియాగాంధీని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు దేవత అని కీర్తిస్తున్నారని, ఆమె దేవత కాదని.. బలులు కోరే బలిదేవత అని విమర్శించారు.

By
en-us Political News