ప్రజావేదిక నిర్మాణం ఖర్చు కోటీ తొంబై లక్షలు...మరి 9 కోట్లు ఎలా అబ్బా ?

ప్రజావేదిక కూల్చివేతతో మొదలయిన రగడ ఇప్పట్లో చల్లారేలా కనపడడం లేదు. గత తెలుగు దేశం ప్రభుత్వం ఉండగా చంద్రబాబు ఉండవల్లి కరకట్ట మీద నదిని ఆనుకుని లింగమనేని ఎస్టేట్స్ ఓనర్ కట్టుకున్న ఇంటిలో అద్దెకు ఉండేవారు. అయితే బాబుని కలిసేందుకు ప్రజలు వస్తే వారిని కలిసేందుకు, వినతులు స్వీకరించేందుకు ఒక వేదికని నిర్మించింది అప్పటి బాబు సర్కార్. అయితే దానిని అక్రమ నిర్మాణంగా పేర్కొన్న జగన్ సర్కార్ దానిని కూల్చివేసేందుకు నిర్ణయించి నిన్నటితో ఆ ఘట్టాన్ని పూర్తి చేశారు. అయితే ఇది మామూలుగా జరగలేదు. 

అమరావతి సెక్రటేరియట్ నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రజావేదికలో కావాలనే జగన్ కలెక్టర్ ల సమావేశం ఏర్పాటు చేశారు. అయితే అంతకు ముందే పార్టీ నేతలు, ప్రజలు తనను కలవడానికి వస్తే వీలుగా ఉండేదుకు ఈ సముదాయాన్ని తనకి కేటాయించమని బాబు జగన్ సర్కార్ ని కోరారు. అప్పటి దాకా దాని మీద పెద్దగా అవగాహన లేని జగన్ మాజీ సీఎం లేఖతో అలెర్ట్ అయ్యి వెంటనే దాని మీద నివేదిక తెప్పించుకున్నారు. అయితే ఆ నివేదికలో ఆ కట్టడం అక్రమం అని, దానితో పాటు బాబు నివాసం కూడా అక్రమం అని తేలడంతో వ్యూహాత్మకంగా ప్రజా వేదికలో సదస్సులు ఏర్పాటు చేసి కూల్చి వేస్తున్నట్టు ప్రకటించారు. 

అంతే కాక పర్యావరణ నిబంధనలు సహా అన్నింటినీ బేఖాతరు చేస్తూ ఈ ప్రజావేదికను నిర్మించిందని ముఖ్యమంత్రి స్థాయిలోనే ఇలా చేయడం అంటే సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టని ప్రశ్నిస్తూ ఎవరూ కాదనలేని విధంగా కూల్చివెత ఆదేశాలు జారీ చేశారు. అంటే ఒకరంగా బాబు ఉంటున్న ఇల్లు కూలగొట్టేందుకు వీలుగా విమర్శలు రాకుండా ప్రజావేదిక కూల గొట్టారు. అయితే ఈ విషయం మీద చాలా విమర్శలు ఎదురయ్యాయి. అయితే ప్రజావేదిక విషయంలో సీఆర్డీఏ ఇప్పటికే ప్రభుత్వానికి రిపోర్ట్ కూడా ఇచ్చినట్టు వైసీపీ, మంత్రులు కూడా ప్రచారం చేస్తున్నారు. 5 కోట్లతో పూర్తి చేయాల్సిన భవనం కోసం 8 కోట్లు ఖర్చు చేశారని, అది కూడా ఓపెన్ బీడ్ వేయకుండా మంత్రి నారాయణ మౌఖిక ఆదేశాలతో అంచనాలు పెంచి ఖర్చు చేసినట్టు వైసీపీ ప్రచారం చేసింది. 

 

అలా అని సీఆర్డీఏ నివేదిక ఇచ్చింది. ఇక ప్రజావేదిక నిర్మాణానికయిన ఖర్చును బాధ్యుల నుండి వసూలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. వేదికను కూల్చివేతను నిలిపివేయాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం మీద నిన్న తెల్లవారు జాము 3.30 గంటలకు హైకోర్టు విచారణ జరిపింది. ప్రజావేదిక అక్రమ కట్టడమేనని పిటిషనర్‌ ఒప్పుకోవడంతో స్టే ఇవ్వడానికి ధర్మాసనం నిరాకరిచింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున వాదించిన అడ్వకేట్‌ జనరల్‌ అక్రమ కట్టడానికి భారీ మొత్తంలో ఖర్చు చేశారని, ఆ మొత్తాన్ని బాధితుల నుండి రాబట్టడంతో పాటు, ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామని చెప్పారు. 

ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును, అప్పటి పురపాలకశాఖ మంత్రి నారాయణను ప్రతివాదులుగా చేర్చాలని ఆదేశించిన ధర్మాసనం కేసు విచారణను జులై 10వ తేదికి వాయిదా వేసింది. అయితే తాజాగా ఈ విషయం మీద మాట్లాడిన మంత్రి పేర్ని నాని ప్రజావేదికను కూల్చడం లేదని, తరలిస్తున్నామని, దీనికి వినియోగించిన వస్తువులన్నీ ప్రభుత్వ స్థలంలో వేరేచోట అనుమతి తీసుకుని నిర్మించేందుకు ఉపయోగిస్తామని చెప్పారు. ఇక్కడే తాజాగా తెలుగుదేశం గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రజావేదిక నిర్మాణం కోసం ఎంత అయ్యిందనే విషయం బయట పెట్టింది. 

2017వ సంవత్సరం ఏప్రిల్ నాలుగున జారీ అయిన జీవో ప్రకారం ఆర్ అండ్ బీ నుండి ఈ వేదిక నిర్మాణానికి 90 లక్షల రూపాయల నిధులు జారీ అయ్యాయి. ఆ నిధులు కేవలం నిర్మాణానికి ఉపయోగించారు. ఇక అక్కడే పార్కింగ్ స్థలాలను పూడ్చి రెడీ చేసేందుకు 47 లక్షల రూపాయలు, అలా మిగతా పార్కింగ్, సెక్యూరిటీ మొత్తం అన్నీ కలిపి కోటీ తొంబై లక్షలు ఖర్చు అయ్యాయి. సీఆర్డీఏ చెబుతున్న లెక్క ప్రకారం తొమ్మిది కోట్లు, అంటే మిగిలిన ఏడూ కోట్లతో ఏసీలు, ఫర్నీచర్, ప్రొజెక్టర్ లు లాంటివి ఖరీదు చేసి ఉండవచ్చు, మంత్రి చెబుతున్న దాని ప్రకారం వాటిని మళ్ళీ ఉపయోగిస్తారు, సో ప్రజల సొమ్ము వృధా అయ్యింది సుమారుగా రెండు కోట్ల రూపాయలన్న మాట. కానీ రాజకీయ లబ్దిని ఆశించి వైసీపే మాత్రం తొమ్మిది కోట్ల అవినీతి జరిగింది అంటూ విమర్శలు చేస్తోంది.