రాయపాటి ముష్టితెలివి!

 

 

కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన నిర్ణయం ప్రకటించే వరకూ చెవిలో పూలు పెట్టుకుని, నోట్లో వేలు వేసుకుని కాంగ్రెస్ అధిష్ఠానం కాళ్ళదగ్గర కూర్చున్న సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులకు విభజన నిర్ణయం తర్వాత తెలివితేటలు బాగాపెరిగిపోయాయి. అంతా సర్వనాశనం అయిపోయిన తర్వాత ఎవరికివారే నన్నుచూడు.. నా తెలివి చూడు అని ప్రజల ముందుకు వస్తున్నారు.

 

ఆమధ్య సొంత పార్టీ పెట్టేస్తానని హడావిడి చేసిన ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆ తర్వాత సౌండ్ లేకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. కొంతకాలం ఎవరికీ కనిపించకుండా దాక్కుని, ఇప్పుడు బోర్ కొట్టి బయటికొచ్చాడు. వచ్చీ రావడంతోనే తాను గతంలో ప్రదర్శించిన ముష్టి తెలివితేటల్ని ప్రజల ముందు ఏకరవు పెడుతున్నాడు. ఆ తెలివితేటలేంటంటే, తాను గతంలో పార్టీ పెడతానని హడావిడిచేసింది నిజంగా పార్టీ పెట్టడానికి కాదంట! అలా తాను కొత్త పార్టీ పెడతానని బెదిరిస్తే, కాంగ్రెస్ అధిష్ఠానం బెదిరిపోయి తెలంగాణ ఇవ్వడం ఆపేస్తుందనుకుని అలా బెదిరించాడట. నిజానికి తనకి కొత్త పార్టీ పెట్టే ఆలోచన ఎంతమాత్రం లేదంట! రాయపాటి ఇలాంటి పనికిరాని తెలివితేటలేవో ప్రదర్శించి వుంటాడని అర్థం చేసుకునే కాంగ్రెస్ అధిష్ఠానం బెదిరిపోయినట్టు లేదు.


అయినా రాయపాటి పార్టీ పెడితే పట్టించుకునేదెవరంట? రాయపాటి పార్టీ పెట్టడం కాదు.. అసలు రాజకీయాల్లోంచి తప్పుకుంటే రాష్ట్రానికి నష్టం ఏమిటంట? అసలే సీమాంధ్ర ప్రజలు కడుపు మండిపోయి ఆందోళనలు చేస్తుంటే ఇలాంటి ఎందుకూ పనికిరాని తెలివితేటల్ని ప్రదర్శించిన రాయపాటిని ఏమనాలి? ప్రస్తుతం రాయపాటి తెలివితేటలు పార్టీ పెట్టేవైపు నుంచి పార్టీ మారేవైపు మళ్ళినట్టు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పదవి లేకుండా పావుగంట కూడా వుండలేని రాయపాటి వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తే డిపాజిట్లు గల్లంతేనని అర్థం చేసుకున్నాడు. అందుకే తెలుగుదేశం పార్టీలో చేరడానికి పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.  మరి ఇంత భారీ స్థాయిలో తెలివితేటలు పొంగి ప్రవహిస్తున్న రాయపాటిని తెలుగుదేశం పార్టీ భరించగలదా?