చిరంజీవికి అన్యాయం చేసిన పవన్ కళ్యాణ్

 

తెలంగాణలో ఉన్న ఆంధ్రులపై దాడులు జరుగుతున్నాయని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలను పోసాని కృష్ణమురళి ఖండించారు. రాజకీయ లబ్ధి కోసం ఆంధ్ర, తెలంగాణ ప్రజల మధ్య చిచ్చు పెట్టొద్దని మండిపడ్డారు. తెలంగాణలో తాము ఏ భయం లేకుండా జీవిస్తున్నామని అన్నారు.

అదేవిధంగా గతంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో పనిచేసిన పోసాని.. ప్రజారాజ్యం గురించి, పవన్ గురించి పలు సంచలన విషయాలను బయటపెట్టారు. ప్రజారాజ్యం పార్టీ విషయంలో అన్న చిరంజీవికి పవన్ అన్యాయం చేశాడని పోసాని ఆరోపించారు. ప్రజారాజ్యం రాజకీయాల్లో విఫలమయ్యాక.. ఆ పార్టీ కాడిని మధ్యలో వదిలేసిన వ్యక్తుల్లో పవన్ ఒకడని.. యువరాజ్యం బాధ్యతల నుంచి తప్పుకున్నాడని విమర్శించారు. చిరంజీవి మరో సోదరుడు నాగబాబు సైతం చిరును వదిలేశాడని పోసాని మండిపడ్డారు. కానీ ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం అయ్యే వరకు తాను మాత్రమే ప్రజారాజ్యంలో కొనసాగానన్నారు. చిరు పార్టీ మూసేసే వరకు తాను ఆయనతోనే కలిసి సాగానని పోసాని తెలిపారు. ప్రజారాజ్యం ఫెయిల్ అవ్వడంతో చిరంజీవి ఎంతో మథన పడ్డాడని.. తనను, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం తట్టుకోలేక చిరంజీవి తనకు ఫోన్ చేసి ఏడ్చాడని.. ఇందుకు సాక్ష్యం మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అంటూ పోసాని సంచలన విషయాన్ని బయటపెట్టారు.