జగన్ పై పవన్ కౌంటర్... ముఖ్యమంత్రి అవుతా అంటే ఎలా?

 

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం విశాఖ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే కదా. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలుపడానికి ఆయన అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన అన్నీ పార్టీలపై కౌంటర్ల మీద కౌంటర్లు వేశారు. ముఖ్యంగా జగన్ ను ఉద్దేశించి పరోక్షంగా ఆయన పలు సెటైర్లు విసిరారు. త‌న‌ తండ్రి ముఖ్యమంత్రి అయితే తాను కూడా ముఖ్యమంత్రి అవుతాననడం తప్పు అని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో కొంతమంది వేలకోట్ల రూపాయ‌ల‌ డబ్బును వెనకేసుకున్నారని, తాను అందుకే వైఎస్సార్సీపీని వ్యతిరేకించాన‌ని తెలిపారు. నా తండ్రి చనిపోయాడు కాబట్టి నేనే ముఖ్యమంత్రి అవుతా అంటే ఎలా? అని ప్రశ్నించాడు. అంతేకాదు.. జగన్ అంటే త‌న‌కు వ్యక్తిగతంగా వ్యతిరేకత లేదని చెప్పుకొచ్చారు. కొంత‌మందికి వేల కోట్లు సంపాదించాల‌న్న పిచ్చి ఉందని, కొంత‌మందికి ఎప్పుడూ అధికారంలో ఉండాల‌నే పిచ్చి ఉంద‌ని, త‌న‌కు మాత్రం స‌మాజం బాగుండాల‌నే పిచ్చి ఉంద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్‌ వ్యాఖ్యానించారు.