కోదండరామ్‌ని కేసీఆర్ లైట్ తీసుకున్నారా?

 

తెలంగాణ జేఏసీ... ఒకప్పుడు ఈ పేరు చెప్పగానే ముఖ్యమంత్రి నుంచీ డీజీపీ దాకా అందరూ అలెర్ట్ అయ్యేవారు. ఉద్యమ సమయంలో జేఏసీ కలకలం అంతా ఇంతా కాదు. ప్రత్యేక తెలంగాణ సాధనలో తెలంగాణ జాక్ పాత్ర ఎవ్వరూ కాదనలేనిది. సమైక్యాంధ్ర వున్నప్పుడు ఒక వెలుగు వెలిగింది కోదండరామ్ నేతృత్వంలోని ఐకాస! మరి ఇప్పుడు?

 

బంగారు తెలంగాణ అంటున్న కేసీఆర్ తెలంగాణ ఉద్యమ మూల కారణాల్లో ఒకటైన నిరుద్యోగ సమస్యను పట్టించుకోవటం లేదని జేఏసీ ఆరోపిస్తోంది. ముఖ్యమంత్రిని ఎదుర్కోవటం ప్రతిపక్ష నేతలకే సవాల్ గా మారిన తరుణంలో కోదండరామ్ కొదమ సింహంలా బరిలోకి దూకారు. సమైక్య పాలకులపై ప్రయోగించిన ప్రజా ఉద్యమాల అస్త్రమే స్వంత సీఎం పై కూడా ప్రయోగించారు. ఒకప్పుడు కుతకుత ఉడికిపోయిన ఉస్మానియాను మరోసారి వేడెక్కించి విద్యార్థుల్ని వీధుల్లోకి తీసుకొచ్చారు. ఉద్యోగాలు కావాలంటూ ధర్నాలకు పిలుపునిచ్చారు. కాని, ఉద్యమ సమయంలో ఇదే కోదండరామ్ తో భుజం భుజం కలిపిన కేసీఆర్ ఇప్పుడు ఆయన్ని అసలు పట్టించుకుంటున్నారా? పరిస్థితి చూస్తుంటే తెలంగాణ సీఎం లైట్ తీసుకుంటున్నట్టే కనిపిస్తోంది...

 

బంగారు తెలంగాణ సాధన ఎంత వరకూ వచ్చిందో మనకు తెలియదుగాని... కేసీఆర్ మాత్రం కోదండరామ్ అండ్ కో పిలుపునిచ్చిన నిరసనల్ని పట్టించుకోకుండా బంగారు కానుకలు తీసుకుని తిరుమల వెళ్లిపోయారు! ప్రత్యేక రాష్ట్రం వస్తే మొక్కలు చెల్లిస్తానని ఆయన గతంలోనే మొక్కారు. అదే ఉద్ధేశంతో తొలి సారి తిరుమల వెళ్లారు. ఘన స్వాగతం లబించింది.కాని, విచిత్రంగా తెలంగాణ సాధనకు సహకరించిన పోరాట యోధులు మాత్రం మొక్కులు చెల్లిస్తున్న వేళ మళ్లీ రోడ్లపైనే వున్నారు. ఉద్యోగాలు కావాలంటూ ఉద్యమాలు మొదలు పెట్టారు!

 

తెలంగాణ రాక ముందు తిరుపతిలో చాలా సార్లు కేసీఆర్ కి వ్యతిరేకంగా నిరసనలు జరిగేవి. ఇప్పుడు అక్కడ ఘన స్వాగతాలు లభించాయి. కాని, కట్టలు తెంచుకున్న మద్దతు లభించిన ఉస్మానియా యూనివర్సిటీలో కేసీఆర్ వ్యతిరేక నినాదాలు మిన్నుముట్టాయి! కాని, స్వరాష్ట్రంలో జరుగుతోన్న గొడవనంతా రావుగారు లైట్ తీసుకున్నట్టే కనిపిస్తోంది! చూడాలి మరి... ముందు ముందు కోదండరామ్ కోపానికి గులాబీ వాడిపోతుందా... లేక తనకు కానుకలు సమర్పించిన కేసీఆర్ పక్షానే వెంకన్న నిలుస్తాడా?