టిడిపి లో ‘మోడి’ కలవరం !

 

 

 

 

సినీ నటుడు బాలకృష్ణ తన గుజరాత్ పర్యటనను విరమించుకొని ఉండవచ్చు. అయితే, నరేంద్ర మోడి తన ప్రమాణ స్వీకారోత్సవానికి బాలకృష్ణను ఆహ్వానించిన సంఘటన మాత్రం తెలుగు దేశం పార్టీలో చిచ్చు రేపినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో పార్టీలోను, బయటా కూడా కాస్త అలజడి చెలరేగడంతో బాలకృష్ణ తన పర్యటనను విరమించుకొన్నారు.

 

ఈ ఆహ్వానంపై తెలుగు దేశం పార్టీలో పెద్ద చర్చే జరిగింది. బాలకృష్ణ గుజరాత్ వెళ్ళినట్లయితే అది పార్టీ అధినేత చంద్ర బాబును ఇబ్బందిల్లోకి నెట్టినట్లే అవుతుందని పార్టీ నేతలు భావించారు. అయితే, బాలకృష్ణ గుజరాత్ పర్యటనకు వెళ్తే నష్టమేమీలేదని కొంత మంది నేతలు అన్నట్లు తెలిసింది. అందరి అభిప్రాయాలు తెలుసుకొన్న తర్వాత గుజరాత్ పర్యటనకు వెళ్ళవద్దని చంద్ర బాబు, బాలయ్యకు చెప్పినట్లు తెలిసింది.

 

బాలయ్య ప్రస్తుతం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నందున ఓ బిజెపి ముఖ్య మంత్రి ఆహ్వానానికి వెళ్లడం సరికాదని పార్టీ నేతలు తమ అభిప్రాయంగా బాబుకు చెప్పినట్లు తెలిసింది. దీనితో, బాలకృష్ణ చంద్ర బాబు నిర్ణయానికి కట్టుబడి తన గుజరాత్ పర్యటనను విరమించుకున్నారు. ఈ పర్యటనకు బాలయ్య వెళ్తే, అది చంద్ర బాబుకు మచ్చేనని సిపిఐ కార్యదర్శి నారాయణ కూడా అభిప్రాయపడ్డారు.

 

అయితే, ఎన్టిఆర్ కుటుంబం అభిప్రాయం మాత్రం మరోలా ఉంది. ఎన్టిఆర్ ఫై ఉన్న అభిమానంతో మోడి ఈ కార్యక్రమానికి ఆహ్వానం పంపితే, దీనిని తిరస్కరించడం ఎన్టిఆర్ ను కించపరచడమే అవుతుందని వారంటున్నారు.