ఇదేం విడ్దూరం?!

 

 

 

కృష్ణానది మిగులు జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల మీద పిడుగులా పడిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంతమాత్రం కదిలించడం లేదు. ఈ తీర్పు ద్వారా తెలుగు వారికి అన్యాయం జరిగిందని దేశమంతటా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ, రాష్ట్రంలోని చాలా పార్టీలు, ప్రజలు ఈ తీర్పు పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నప్పటికి ఇటు రాష్ట్ర ప్రభుత్వం గానీ, అటు కేంద్ర ప్రభుత్వం గానీ ఎంటర్‌టైన్‌మెంట్ చూస్తున్నాయే తప్ప ఇది అన్యాయం అనే సాహసం చేయలేకపోతున్నాయి.

 

రాష్ట్రంలోని పార్టీలలో కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, టీఆర్‌ఎస్ మినహా మిగిలిన పార్టీలన్నీ ఇది దారుణమని బాధపడుతున్నాయి. టీఆర్ఎస్ ఈ తీర్పు విషయంలో పెద్దగా స్పందించలేదు. ఇది పెద్దగా పట్టిచుకోవాల్సిన అంశం కాదని లైట్‌గా తీసుకోవడం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపరుస్తోంది. ఇక వైఎస్సార్సీపీ అయితే నేరమంతా చంద్రబాబు మీద వేయడానికి ప్రయత్నం చేసింది. చంద్రబాబు హయాంలో ప్రాజెక్టులు కట్టకపోవడం వల్లే ఈ సమస్య వచ్చిపడిందని చెబుతూ మోకాలికి, బోడిగుండుకి ముడి వేసే ప్రయత్నం చేయడం మరో ఆశ్చర్యకరమని విశ్లేషకులు అంటున్నారు.



మిగులు జలాలు అడగం అని వైఎస్సార్ లేఖ రాసిన విషయం వైఎస్సార్సీపీ మరచిపోయినట్టు నటిస్తోందని అనుకుంటున్నారు. ఇక అధికార కాంగ్రెస్ అయితే ఇది అసలే సమస్యే కాదన్నట్టు వ్యవహరించడం ఆ పార్టీకి తెలుగు వారి పట్ల వున్న చులకన భావానికి మరో తార్కాణంగా నిలుస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ఈ విషయం మీద తీవ్రంగా ప్రతిస్పందించిన తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వాదనను కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తూ వుండటం ఊహించిన పరిణామమేని వారు అంటున్నారు. అన్ని విషయాలలోనూ తెలుగువారు అన్యాయానికి గురవుతూ, అనాథలుగా మిగిలిపోవడం దారుణమని భావిస్తున్నారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు విషయంలో రాష్ట్రపతి జోక్యం ద్వారానే తెలుగువారికి న్యాయం జరిగే అవకాశం వుంది కాబట్టి అన్ని పార్టీలూ విభేదాలు పక్కన పెట్టే ఈ విషయంలో సరైన రీతిలో కృషి చేస్తేనే ఫలితం వుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.