కుట్ర జరిగే వుండొచ్చా?

 

 

 

హిందూ మతానికి పునాదిలాంటి కంచి ఆశ్రమ ఆచార్యులు హత్య కేసు నుంచి ఏ మచ్చ లేకుండా బయటపడ్డారు. ఇది హిందూ లోకానికి ఎంతో ఊరట కలిగించిన అంశం. ఎక్కడో ఎవరో చేసిన హత్యని కంచి ఆశ్రమంలో జరిగినట్టు, ఆ హత్యను కంచి ఆచార్యులే చేసినట్టు పోలీసులు కహానీ అల్లారు. ఆధ్యాత్మిక జీవితమే తప్ప అన్నెం పున్నెం ఎరుగని కంచి స్వాముల మీద నిందారోపణ చేసి వారిని కారాగారానికి కూడా తరలించి మనోవేదనకు గురిచేశారు.

 

ఈ కేసు విషయంలో తీర్పు ఇచ్చిన సమయంలో కోర్టు కూడా పోలీసులను ఘాటుగా విమర్శించింది. సాక్షులను ప్రభావితం చేసేంతగా ముదిరిపోయిన పోలీసుల అత్యుత్సాహాన్ని ఆక్షేపించి అక్షింతలు వేసింది. పోలీసుల అతి కారణంగా నిర్దోషులు అవమానాల పాలయ్యారు. సందట్లో సడేమియా అన్నట్టు అసలు నిందితులు తప్పించుకునిపోయారు. కంచి స్వాముల మీదే టార్గెట్ చేసి వారిని ఇబ్బందిపెట్టడంలో బిజీగా వున్న పోలీసులు అసలు హంతకులు తప్పించుకుపోవడానికి రాజమార్గం వేశారు. ఇదిలా వుంటే బీజేపీ నాయకులు చేసిన ఆరోపణలు సరికొత్త సంచలనానికి, ఆలోచనలకు తెరతీశాయి.



హిందూ మతాన్ని దెబ్బ తీసే క్రమంలో భాగంగా సోనియాగాంధీ, వైఎస్ రాజశేఖరరెడ్డి కుట్రపన్ని కంచి స్వాములను కేసులో ఇరికించారని ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలు నిరాధారమైనవే అయిన్పటికీ కొట్టిపారేయాల్సినవి కూడా కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తన అల్లుడు అనిల్‌ని క్రైస్తవ ప్రచార రంగంలో పైకి తేవడం కోసం ఆ రంగంలో అప్పటికే టాప్‌లో వున్న కేఎ పాల్‌ని బజారుకీడ్చిన చరిత్ర వైఎస్సార్‌కి వుంది. అలాగే హిందూ మతానికి, హిందూ పుణ్యక్షేత్రాలకు వ్యతిరేకంగా గతంలో జరిగిన అనేక ప్రయత్నాలను పరిశీలించినట్టయితే కంచి స్వాములను వ్యతిరేకంగా కుట్ర జరిగిందేమోనన్న అనుమానాలు కూడా బలపడుతున్నాయి. అయితే ఆ కుట్ర పన్నింది సోనియా, వైఎస్సారేనా అన్నది మాత్రం ఎవరూ చెప్పలేని విషయం. చూద్దాం.. ముందుముందు ఏదైనా బయటపడొచ్చేమో!