మా అబ్బాయికి తొందరెక్కువ..(చదివి నవ్వుకోండి)

 

Jagan Chief Minister,  ys vijayamma, jagan cm chair, ysr congress, political comedy, ap politics

 

 

అమ్మా! అందరూ నాకు కొంచెం దూకుడు ఎక్కువయింది అంటున్నారు. ఇంతకీ ఈ దూకుడంటే ఏమిటమ్మా?


అదేరా కన్నా...నువ్వు నాన్నగారు అంత్యక్రియలు కూడా పూర్తవక మునుపే, ఆయన కుర్చీలో కూర్చోవాలనుకొన్నావే... దానినే దూకుడంటారురా.



అదేమిటమ్మా.. నాన్నకుర్చీలో నేను గాకపోతే ఇంకెవరు కూర్చోంటారు. అది అందరూ చేసేదే..నువ్వు కూడా  దానిని దూకుడంటే ఎలా అమ్మా?



నీకు కేంద్రమంత్రి పదవి ఇస్తామని చెపుతున్నా వినకుండా నాన్నకుర్చీ కోసమే మారం చేస్తూ సోనియమ్మ మంచిమాటను కూడా కాదని కాంగ్రెస్ లోనుండి బయటకి వచ్చేసి ఈ పార్టీ పెట్టావే దానినే దూకుడు అంటారనుకో పోనీ...



ఏంటమ్మా నువ్వు మరీను... నాన్నగారి రాజ్యంలో బాగా సుఖం మరిగిన ప్రజలు కాంగ్రెస్ పాలనలో నానా ఇబ్బందులు పడిపోతుంటే, ఏదో పోనీ వారిని ఆదుకొందామని కదాని పార్టీ పెట్టేను. అటువంటప్పుడు నాన్నగారి కుర్చీలో కూర్చోకుండా వాళ్ళని పాలించడం ఎలా వీలవుతుంది? దానిని నువ్వు దూకుడు అంటే నేను ఒప్పుకోను. ఇంకేదయినా మంచి ఉదాహరణ చెప్పు



ఏమిటోరా నీ జీవితమే పెద్ద దూకుడు...మళ్ళీ వాటిలోంచి ప్రత్యేకంగా ఉదాహరణలు వెతికి చెప్పాలంటే ఇదేమయినా రచ్చబండ కబుర్లా?



ప్లీజ్ అమ్మా! పోనీ అందులోంచి ఒకే ఒక ఉదారణ చెప్పు పోనీ..



అదేరా నేను ఎంత వారిస్తున్నావినకుండా జనాలని ఓదార్చడానికి బయలుదేరావే దానినేరా దూకుడు అంటారు. ఫలితంగా ఏమయింది నువ్వే చూసావు గదా? నువ్వు ఒదార్చకపోతే జనాలేమయినా చచ్చిపోతారా చెప్పు? ఆ దూకుడే వద్దంటున్నా...కానీ నువ్వు వింటే కదా? నీ దూకుడువల్ల ఏనాడు ఎండ కన్నెరుగని నేను, చెల్లి ఎండనక, వాననక, రోడ్ల మీద తిరగాల్సి వచ్చింది. ఇకనయినా ణా మాట విని ఆ దూకుడు కొంచెం తగ్గించుకోరా బాబు.



అదేమిటమ్మా...బోడి గుండుకి మోకాలుకీ ముడిపెడుతూ ప్రతీ దానిని దూకుడు అంటావు. అసలు దూకుడు అంటే నీకు తెలియకనే నీకు తోచినవన్నీ చెపుతున్నావు.



మరటువంటప్పుడు నన్నెందుకు అడగడం ఎందుకు? పోయి ఆ కొండా సురేఖనో, లేక సబ్బం హరినో లేక ఆ తెలంగాణా ప్రజలనో అడుగు వాళ్ళే చెపుతారు నీ దూకుడు గురించి..



అంటే నేను ముఖ్యమంత్రినవడానికే వాళ్ళని అందరినీ వదిలించుకొన్నానని నీ ఉద్దేశ్యమా? గల్లీ నుండి డిల్లీ దాక నిన్ను తిప్పుతున్నాకూడా నీకు ఇంకా రాజకీయాలు సరిగ్గా వంటబట్టలేదమ్మా! మనల్నిసీమాంధ్రలో, కేసీఆర్ ని తెలంగాణాలో చూసుకోమని మన హైకమాండ్ చెప్పిన తరువాతనే కదా మనం తెలంగాణాలో నుండి జంప్ అయిపోయి, సమైక్యరాగం అందుకొన్నది. అటువంటప్పుడు ఈ కొండలు, సబ్బాలు మనకెందుకమ్మా?



అంటే అకస్మాత్తుగా తెలంగాణా నుండి జంప్ అయిపోవడం దూకుడు కాదంటావు.
సరే! హైకమాండ్ ఆదేశంతోనే జంప్ అయిపోయావనే అనుకొంటాను. కానీ, నిన్ను అష్టకష్టాలు పడి మూడో కంటికి తెలియకుండా ఆ సోనియమ్మ కాళ్ళు పట్టుకొని బెయిలు మీద జైల్లోంచి విడిపించి తీసుకు వస్తే నువ్వు చేసిన పనేమిటి? పోయి ఆ నరేంద్ర మోడీని పొగుడుతావా? ఆయన మతం పక్కన బెడితే ఆయన పార్టీతో జత కడతానని అంటావా? నీ మాటలు మన హైకమాండ్ చెవిన పడితే మళ్ళీ నువ్వు అత్తారింటికి దారేది అని వెనక్కివెళ్లిపోక తప్పదు తెలుసా? దీనిని దూకుడు అనక ఏమంటారు? దూకుడు గురించి నువ్వు నాకు పాఠాలు చెపుతున్నావా? మీ నాన్నగారి కంటే నీ దూకుడు బాగా ఎక్కువయిపోయిందిరా అబ్బాయ్.. కొంచెం తగ్గించుకో...లేకపోతే మళ్ళీ చిక్కుల్లో పడతావు.



అమ్మా... అసలు రాజకీయాలు తెలియని నీతో ఈ దూకుడు గురించి మాట్లాడటం నాదే బుద్ది తక్కువ. నీకు అన్ని విడమరిచి చెపితే తప్ప ఏదీ అర్ధం కాదు. అవతల పార్టీల వాళ్ళు అందరూ మనకీ, మన హైకామాండ్ కీ మధ్య ఏవో రహస్య ఒప్పందాలు జరిగాయని, అందుకే నన్ను జైలులోంచి బయటకు వదిలేసారని, ఎన్నికల ముందో, తరువాతో మన పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేస్తామని, లేకపోతే దానికి మద్దతు ఇస్తామని ఒకటే ప్రచారం చేస్తుంటే, అదంతా నిజమేనని మన పేపర్లో, టీవీలో ప్రకటన వేసేసుకోమంటావా? నేను మోడీని పొగిడితేనే కదా... కాంగ్రెస్ పార్టీకి మనకి అసలు పొసగదని, అది మన బద్ధ శత్రువని జనాలను నమ్మించగలుగుతాము. లేకుంటే వాళ్ళ ప్రచారంతో జనం కూడా మన ప్లాన్లు అన్నీ పసిగట్టేస్తే ఇక ఎవరియినా ఒటేస్తారంటావా? అప్పుడు ఇక జీవితంలో నేను నాన్న కుర్చీలో కూర్చోగలనా? నువ్వే చెప్పు.



అయ్యో! దీనివెనుక ఇంత రాజకీయం ఉందా? నిజమేరా ఎంత ప్రయత్నించినా నాకు రాజకీయాలు అబ్బటం లేదు. నువ్వు ఇక్కడ మీ నాన్నగారి కుర్చీలో, అక్కడ మన రాహుల్ బాబు మన్మోహన్ కుర్చీలో కూర్చొంటే చూడాలని మా తల్లి మనసులు ఒకటే ఉవ్విళ్ళురుతున్నాయిరా.. నువ్వు ఇలాగే కంటిన్యూ అయిపో.
అయితే ఇప్పుడు దూకుడుకి సరయిన డెఫినెషన్ చెప్పమంటావా?



చెప్పమ్మా.



అదేరా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడానికి చేసే ఏ పనినయినా దూకుడు అంటారురా.



హ హ హా...