విజయానికి సరిహద్దు


అతనో సాధారణ మధ్యతరగతి మనిషి. కానీ జీవితంలో ఎలాగైనా ఉన్నత స్థానానికి చేరుకోవాలనే కసి ఉన్నవాడు. అందుకనే నిరంతరం ఒళ్లు వంచి పనిచేసేవాడు. యజమాని ఏ పని చెప్పినా కిమ్మనకుండా పూర్తిచేసి, తనేమిటో నిరూపించుకునేవాడు. కానీ ఆ పని ఒత్తిడిలో పడి తన కుటుంబసభ్యులతో ఎక్కువ సమయాన్ని గడపలేకపోయేవాడు. ఒక్క ఆదివారం మాత్రమే ఇంటిల్లపాదీ కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసే అవకాశం దక్కేది. తన కుటుంబంతో ఎక్కువసేపు గడపలేకపోతున్నానన్న బాధ అతని మనసులో మెదులుతూనే ఉండేది. భార్యాపిల్లలు కూడా అతను తమకోసం మరింత సమయం గడిపితే బాగుండు అని తెగ ఆశపడేవారు.

 

ఇదిలా ఉండగా, ఆ మధ్యతరగతి మనిషి తన ఉద్యోగంలో ఎలాగైనా పదోన్నతి సాధించాలనుకున్నాడు. అందుకోసం మరిన్ని చదువులు చదివితే బాగుండు అనిపించింది. దాంతో ఓ ఏడాదిపాటు అతని ఆదివారాలన్నీ చదువుకే అంకితమైపోయాయి. రోజూ రాత్రివేళ మాత్రమే అతను తన కుటుంబంతో కాసేపు గడపగలిగేవాడు. అతను ఇంట్లో ఎక్కువసేపు గడపడం లేదంటూ భార్యపిల్లలు బాధపడితే... ‘మీకోసమే కదా కష్టపడుతోంది’ అంటూ వారి నోరు మూయించేవాడు. ఆ మాటలో నిజం ఉందని తోచడంతో భార్యాపిల్లలు ఇక మారు మాట్లాడేవారు కాదు.

 

ఓ ఏడాది గడిచిపోయింది. మధ్యతరగతి మనిషి చదువు పూర్తయిపోయింది. ఊహించినట్లుగానే పదోన్నతి కూడా లభించింది. ఆయన చదువు పూర్తయి కోరుకున్న పదోన్నది లభించింది కాబట్టి, ఇకనుంచి తమతో మరింతసేపు గడుపుతాడని ఆశించారు భార్యాపిల్లలు. కానీ పదోన్నది లభిస్తే సరిపోతుందా! దాని సరిపడా పని కూడా ఉంటుంది కదా. పైగా ఆ మనిషి తన పనిలో వెనక్కి తగ్గే రకం కాదయ్యే! దాంతో అహర్నిశలూ కార్యాలయంలోనే గడిపేవాడు. ఏ అర్ధరాత్రికో పిల్లలు పడుకున్నాక కానీ ఇల్లు చేరుకునేవాడు కాదు. ఉదయం అతను లేచేసరికి పిల్లలంతా ఎవరి దారిన వారు వెళ్లిపోయేవారు. దాంతో అతను పిల్లలతో మాట్లాడే సందర్భాలే తగ్గిపోయాయి. తను కుటుంబానికి ఏమాత్రం సమయం వెచ్చించలేకపోతున్నానని అతనికి తెలుసు. కానీ ఇదంతా వారి భవిష్యత్తు కోసమే చేస్తున్నానని తల్చుకుని ఓర్చుకునేవాడు. ఉద్యోగంలో మరో మెట్టు పైకి ఎక్కితే ఇంత ఒత్తిడి ఉండదు కదా అని ఎదురుచూసేవాడు.

 

అనుకున్నట్లుగానే ఇంకో ఏడాది గడిచేసరికి అతను డిపార్టుమెంట్ అధిపతిగా మారిపోయాడు. ఇది వరకు అతను పనిచేస్తే సరిపోయేది. ఇప్పుడు అలాకాదయ్యే! బాధ్యత కూడా తోడయ్యింది. ప్రతి ఫలితానికీ జవాబుదారిగా ఉండాల్సిన పరిస్థితి. తనేమిటో నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. దాంతో అతను ఆ సవాలుని స్వీకరించాడు. ఒకోరోజు ఆఫీసులోనే నిద్రపోయేవాడు. ఇప్పుడు భార్యని చూడటం కూడా తగ్గిపోయింది. దాంతో ఓ రోజు భార్యాపిల్లలు కలిసి అతని ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘సంపాదించిన స్థాయి చాలు. ఇక కుటుంబం గురించి కూడా ఆలోచించమని’ వేడుకున్నారు. ‘మరొక్క ఏడాది ఓపిక పట్టండి. ఇంకో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. అది వచ్చాక ఇంక కుటుంబానికి తగిన సమయం కేటాయిస్తాను,’ అంటూ మాట ఇచ్చాడు.

 

మాట ఇచ్చినమేరకు ఏడాది గడిచిపోయింది. ఊహించినట్లుగానే మరో ప్రమోషన్ కూడా వచ్చేసింది. ఇప్పుడతను మధ్యతరగతి మనిషి కానేకాదు. తన పనిచేస్తున్న కంపెనీకే వైస్ ప్రెసిడెంట్. ‘రేపటి నుంచి మీ కోసం కొంత సమయాన్ని కేటాయిస్తాను. మీ బాగోగులను గమనించుకుంటాను,’ అంటూ ఆ రాత్రి భార్యాపిల్లలకి సంతోషంగా చెప్పాడు. కానీ మర్నాడు ఉదయం లేవనేలేదు!!! తను చిన్నవయసులోనే చాలా సాధించాడంటూ ఓదార్చడానికి వచ్చినవారంతా తెగ పొగిడారు. కానీ అతను ఏం కోల్పోయాడో అతని భార్యాపిల్లలకే తెలుసు.

(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

- నిర్జర.