స్నేహం నటిస్తూనే  సరిహద్దులో చైనా కుట్ర ! నాకులా  దగ్గర  దళాల మధ్య  ఘర్షణ! 

స్నేహంగా ఉంటామని చెబుతూనే  కుట్రలు కొనసాగిస్తోంది చైనా. భారత్ భూభాగంలోకి చొరబడేందుకు డ్రాగన్ కంట్రీ ప్రయత్నాలు చేస్తోంది. దీంతో చర్చలు జరుగుతుండగానే సిక్కింలో భారత, చైనా దళాల మధ్య మళ్లీ ఘర్షణలు చెలరేగాయి.  ఉత్తర సిక్కింలోని నాకులా వద్ద.. భారత్‌ చైనా సైన్యాల మధ్య మూడు రోజుల క్రితం ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణలో ఇరుదేశాలకి చెందిన సైనికులు గాయపడినట్లు సమాచారం. గల్వాన్‌ ఘటన తరహాలోనే ఇరుదేశాలు బాహాబాహికి దిగినట్లు తెలుస్తోంది.

మూడు రోజుల క్రితం సిక్కింలోని నాతులా ప్రదేశం గుండా చైనా సైనికులు భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నాలను  భారత బలగాలు దీటుగా అడ్డుకున్నట్లు తెలుస్తోంది. చైనా సైనికులను అడ్డుకునే ప్రయత్నంలోనే ఇరు దేశాలకు చెందిన సైనికుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో నలుగురు భారత జవాన్లు గాయపడగా, చైనా సైనికులు 20 మంది గాయాలపాలయ్యారు. అయితే ప్రస్తుతం అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయని, పరిస్థితి మాత్రం పూర్తి అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. వాతావరణ పరిస్థితులు ఇబ్బంది పెడుతున్నా సరే... సరిహద్దుల్లో సమర్థవంతంగా మన సైనికులు తమ విధి నిర్వహణలో నిమగ్నమయ్యారని ఆర్మీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. భారత్‌ చైనా మధ్య నాకులా ప్రాంతం సరిహద్దుగా ఉంది.