గంగ కాదు... గంగమ్మ అని తేల్చేసిన హైకోర్ట్!

 

గంగ మనకు నది మాత్రమే కాదు. గంగ మనకు గంగమ్మ! ఆమె పాపాల్ని కడిగేసే పరమ పావని! అందుకే, గంగోత్రిలో గంగ పుట్టింది మొదలు గంగా సాగర్ అనే ప్రాంతంలో సముద్రంలో చేరే వరకూ మనకు గంగా తీరమంతా పుణ్య  క్షేత్రాలే! మరీ ముఖ్యంగా, కాశీ లాంటి చోట శివుడ్ని పూజించటం ఎంత ముఖ్యమో అంతే ముఖ్యం గంగలో మునగటం! ఇక గంగతో సమానంగా పూజలందుకునే యమున గురించి చెప్పేదేముంది? శ్రీకృష్ణుని రాసలీలలకు ప్రత్యక్ష సాక్షిగా భావిస్తారు యమునమ్మని! అయితే, ఇక మీదట గంగా, యమునలు భక్తులకు, ఆస్తికులకు మాత్రమే కాదు... లాయర్లకు, కోర్టులకు కూడా అమ్మలే! ఉత్తరాఖండ్ హై కోర్ట్ తాజా అభిప్రాయం ఇదే సంగతి చెబుతోంది!


గంగా, యమునల గురించి ఉత్తరాఖండ్ హైకోర్ట్ మాట్లాడాల్సి రావటానికి కారణం... ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ మధ్య ఆస్తులు, అప్పుల పంపకాల గురించి దాఖలైన ఒక పిటీషన్! దాని పై విచారణ చేస్తున్న న్యాయమూర్తులు గంగ, యమున నదులు కేవలం నీటి ప్రవాహాలు కాదని అన్నారు. అవ్వి హిందువుల భక్తి, శ్రద్దలకి మూలమైనవి. అంటే,గంగ, యమున కూడా న్యాయస్థానం ముందు వ్యక్తులుగా అస్థిత్వం కలిగి వుంటాయి. వాటి తరుఫున బాధ్యత తీసుకున్న వ్యక్తులు వాదనలు వినిపించవచ్చు! అలాగే, వాటికి దేశంలోని అందరు పౌరులుకుండే హక్కులు కూడా వుంటాయి! ఈ విషయం చెబుతూ కోర్ట్ గంగా మయ్యా అంటారు అని కూడా తెల్పింది. అంటే, గంగను భారతీయులు తల్లిలా చూస్తారన్నమాట!


గంగ, యమునల్ని ప్రత్యేక అస్థిత్వం గల ప్రాణులుగా పరిగణించాలి అని కోర్టు అనటం వెనుక చాలా అర్థమే దాగుంది. ప్రస్తుతం ఉత్తర భారతదేశానికి జీవనాడుల్లాంటి గంగా, యమునా నదులు తీవ్ర ప్రమాదంలో వున్నాయి. తీరం వెంబడి నివసించే జనం నిర్లక్ష్యం, లక్షలాదిగా తరలి వచ్చే భక్తుల విశృంఖలత్వం, కలుషితాల్ని ప్రవాహాల్లో కలిపేసే కర్మాగారాలు... అన్నీ కలిసి ఆ జీవనదుల జీవాన్ని హరించేస్తున్నాయి. వాటి బ్రతికే హక్కుని హరించేసి గంగా, యమునల అంతానికి ఆరంభం పలికేశాయి! ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం చాలా రోజులుగా గంగా, యమునా రక్షణకి నడుం బిగించింది. కాని, మొన్నటి వరకూ యూపీలో, ఉత్తరాఖండ్ లో బీజేపి ప్రత్యర్థి పార్టీలు అధికారంలో వుండటంతో గంగా మ్యానేజ్ మెంట్ బోర్డ్ ఏర్పాటు కుదరలేదు. దీనిపై కూడా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. త్వరలోనే నదుల సంరక్షణకి బోర్డ్ ఏర్పాటు చేయాలని సూచించింది.


గంగా, యమునలు పునర్వైభవం పొందేలా చేస్తామని హామీ ఇచ్చిన మెదీ సర్కార్ ఇప్పుడు ఉత్తరాఖండ్ , ఉత్తర్ ప్రదేశ్ లలో కూడా తమ ప్రభుత్వాలే ఏర్పాడ్డాయి కాబట్టి ఏం చేస్తుందో వేచి చూడాలి! మన పురాణాలు, ఇతిహాసాలతో పాటూ కోర్టు కూడా గంగా, యమునలు సజీవ అస్థిత్వాలని, కోట్లాది జనం తాలూకూ విశ్వాసానికి మూలాలని ప్రకటించింది కాబట్టి పాలకుల బాధ్యత మరింత పెరుగుతుంది. దేశ సంపద, వారసత్వం లాంటి నదుల్ని ఎంతటి శ్రమైనా భరించి రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది! వాటి కోసం కాకపోయినా.. మన అస్థిత్వం కోసమైనా...