డొక్కశుద్ధి లేనట్టుంది!

 

 

 

ఎవరి నోట్లోంచి అయినా నలుగురికీ ఉపయోగపడే మాటలు రావాలంటే వాళ్ళకి కాస్తంత అయినా డొక్కశుద్ధి వుండాలి. రాష్ట్ర మంత్రివర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ గారి పేరులో ‘డొక్క’ వుందిగానీ, మనిషిలో డొక్కశుద్ధి వున్నట్టు లేదు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రి అయి వుండి కూడా ఆయన ఎప్పుడూ రాష్ట్రం సమైక్యంగా వుండాలని గట్టిగా వాదించిన పాపాన పోలేదు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి ఆయన చేసిన కృషి కూడా లేమీ లేదు. అయ్యగారి నోటి వెంట ఎప్పుడు ఏ మాట వచ్చినా రాష్ట్ర విభజనకు అనుకూలంగానే వుంటుంది.

 

తనకు తన పదవి తప్ప ఏదీ పట్టదన్నట్టుగా ఆయన వ్యవహారశైలి వుంటుంది. ఇటు విభజన ఉద్యమంతోగానీ, అటు సమైక్య ఉద్యమంతోగానీ తనకు ఎలాంటి సంబంధం లేదన్నట్టు ఆయన మాట్లాడుతూ వుంటారు. ఎవరైనా సమైక్య ఉద్యమకారులు ఎక్కడైనా నిలదీస్తే మాత్రం ‘రాష్ట్రం సమైక్యంగా వుండాలనే నేను కోరుకుంటున్నా. కాకపోతే రాష్ట్రం సమైక్యంగా ఉండే పరిస్థితి లేదు’ అని చెప్పి తప్పించుకుంటూ వుంటారు. సీఎం ఎడ్డెం అంటే తాను తెడ్డెం అనడం డొక్కా మాణిక్య వరప్రసాద్‌కి ఈమధ్య బాగా అలవాటైపోయినట్టుంది.



అందుకే సీఎం సమైక్యం అంటున్నాడు కాబట్టి ఆ సమైక్యాన్ని నేనెందుకు పట్టించుకోవాలని ఊరుకుంటున్నట్టున్నారు. రాష్ట్ర విభజన తర్వాత సీమాంధ్ర రాజధానిగా ఏ ప్రాంతం ఉండాలన్న డిస్కషన్ అంతటా జరుగుతోంది. మన డొక్కా గారికి కూడా సీమాంధ్ర రాజధాని గురించి మంచి మంచి ఐడియాస్ వచ్చినట్టున్నాయి. వాటిని వెంటనే బయటపెట్టేశారు.




కొండవీడు ప్రాంతానికి సంబంధించిన ఒక సీడీ విడుదల కార్యక్రమానికి వెళ్ళిన మంత్రిగారికి సీమాంధ్ర రాజధాని గురించి అద్భుతమైన ఆలోచన వచ్చింది. వెంటనే కొండవీడు, అమరావతి ప్రాంతాలను సీమాంధ్ర రాజధానిగా చేస్తే అద్భుతంగా వుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసేశారు. అసలే రాష్ట్రం విడిపోతోందన్న బాధలో వున్న సమైక్యవాదులను డొక్కా గారి విచిత్ర ప్రతిపాదనలు మరింత బాధపెడతాయే తప్ప వాటివల్ల ఒరిగేదేమీ లేదు. ఇప్పటికైనా డొక్కా గారు కాస్తంత డొక్కశుద్ధి చూపించి తన ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యవహరిస్తే బాగుంటుంది.