బాబుకు నకిలీ లేఖ...

 

ఏపీలో ఆసక్తికరమైన అంశం చోటుచేసుకుంది. ఏకంగా ముఖ్యమంత్రి సీఎంకే నకిలీ లేఖ వచ్చింది. అది కూడా ఐఏఎస్ ల నుండి. ఇంకా అశ్చర్యకరమైన విషయం ఏంటంటే... ఆ లేఖలో ఇటీవల జన్మభూమి కార్యక్రమంలో చంద్రబాబు గారు మాట్లాడిన మరుగుదొడ్ల వ్యవహారం గురించి. వివరాల ప్రకారం... మార్చి 31నాటికి వందశాతం మరుగుదొడ్లను నిర్మించని జిల్లాల్లో కలెక్టర్లకు వ్యతిరేకంగా ధర్నా చేస్తానని...అప్పటికైనా వారికి రోషం వస్తుందని వ్యాఖ్యానించారు. దీంతో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఐఏఎస్‌ అధికారుల సంఘం పేరుతో ఒక నకిలీ లేఖను సిఎం చంద్రబాబుకు పంపించారు. ఆ లేఖలో....

 

అయ్యా శ్రీకాకుళంలో స్వచ్చభారత్ కార్యక్రమంలో మీరు చేసిన వ్యాఖ్యలు మమ్నలి బాధించాయని...అందుకే కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురాదలచామని...తమలో లోపాలుంటే బదిలీ చెయ్యండి...కానీ ఈ విధంగా నిందించటం తగదంటూ పేర్కొన్నారు. మీ నాయకులు ఎలాంటి పనులు చేపట్టకుండానే బిల్లులు కోసం మామీద ఒత్తిడి తీసుకొస్తున్నారని, ముందు వారిని నియంత్రించాలని...అలాగే జన్మభూమి కమిటీ సభ్యులు, కమీషన్ తీసుకోకుండా పనిచెయ్యమని చెప్పాలని సిఎంను కోరుతున్నామన్నారు. అంతేకాదు...అందులో మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి నిధుల కేటాయింపు వివరాలను సైతం ప్రస్తావించారు. మరుగుదొడ్ల నిర్మాణానికి కేంద్రం విడుదల చేసింది రూ.992.06 కోట్లు, రాష్ట్రప్రభుత్వం విడుదల చేసింది 838.16 కోట్లు. మొత్తం 1830.22కోట్లలో కేవలం 1230.22 కోట్లు ఖర్చుచేశారు. మిగతా నిధులను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు దుర్వినియోగం చేశారు అని అందులో తెలిపారు. దీంతో సొంత పార్టీ నేతలపైనే ఆరోపణలు చేయడం... అందులో ఈ లేఖను స్వయంగా ముఖ్యమంత్రిగారికే పంపడంతో సంచలనం సృష్టిస్తోంది.

 

ఇంతకీ అసలు విషయం ఏంటంటే ఈ లేఖ నకిలీ లేఖ అని తేలింది. ఈలేఖపై స్పందించిన ఐఏఎస్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం.. ఆ లేఖ నకిలీదని, తమ సంఘం లెటర్‌హెడ్‌ను నకిలీది ముద్రించి చేశారని, ముఖ్యమంత్రికి తాము ఎలాంటి లేఖ రాయలేదని ప్రకటించారు. ఇప్పుడు ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది.