ఆర్టీసీకి కొమ్ములున్నాయా?

 

 

 

మహబూబ్‌నగర్ జిల్లా పాలెం దగ్గర జబ్బార్ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురై 45 మంది మృత్యువాత పడిన దుర్ఘటన ఇంకా కళ్ళముందు కదులుతూనే వుంది. ప్రైవేట్ ట్రావెల్స్‌ విధానాలను, నిర్లక్ష్యాన్ని సమర్థించడం కాదుగానీ, ఆ దుర్ఘటన జరిగిన తర్వాత అందరూ ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వహించే వాళ్ళని విలన్ల మాదిరిగా చూశారు. ఆర్టీయే అధికారులు అయితే సడెన్‌గా వాళ్ళ డ్యూటీలు గుర్తొచ్చి రాష్ట్రవాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ నడిపే బస్సులను చెక్ చేశారు. వందలాది బస్సులను సీజ్ చేశారు.


ప్రజల్ని కాపాడటం, ప్రైవేట్ బస్సుల ఆగడాలను అరికట్టడమే తమ లక్ష్యమన్నట్టు చాలా హడావిడి చేశారు. అయితే ఈ రూల్స్, చెకింగ్స్, బస్సులను సీజ్ చేయడం, కేసులు పెట్టి జైల్లో తోయడం ఇవన్నీ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళకి మాత్రమే వర్తింపజేస్తారా? ఆర్టీసీ బస్సులకు వర్తింపజేయరా? ఇదేనా ప్రభుత్వ చిత్తశుద్ధి? పాలెం దుర్ఘటన జరిగిన తర్వాత రాష్ట్రంలో అనేక ఆర్టీసీ బస్సులు చిన్నచిన్న ప్రమాదాలకు గురయ్యాయి. రెండు మూడు ప్రాణాలు కూడా పోయాయి. వాటి గురించి పట్టించుకున్నవాళ్ళే లేరు.

మంగళవారం రాత్రి నల్గొండ జిల్లా చింతపల్లి దగ్గర హైదరాబాద్ నుంచి నెల్లూరుకు వెళ్తున్న ఆర్టీసీ గరుడ బస్సు లగేజీ బాక్సులో అర్ధరాత్రి సమయంలో మంటలు చెలరేగాయి. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండి మంటలను గుర్తించి ఆర్పడంతో పెనుప్రమాదం తప్పింది. ఒకవేళ ఈ ప్రమాదంలో జరగరానిది జరిగితే ఎవరు బాధ్యులు? ప్రైవేట్ బస్సులను ఉద్యమంలా తనిఖీలు చేస్తున్న ఆర్టీఏ అధికారులు ఒక్క ఆర్టీసీ బస్సునైనా తనిఖీ చేసిన పాపాన పోయారా? రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో ఆర్టీసీ డొక్కు బస్సులు తిరుగుతున్నాయి. వాటి కండీషన్ మీద ఆర్టీఏ అధికారులెవరైనా ఆర్టీసీని ప్రశ్నించిన దాఖలాలున్నాయా? 


రోడ్లమీద ఎక్కడబడితే అక్కడ ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ బస్సులను ఆపి తనిఖీలు చేస్తుంటారు. ఇలా ఆర్టీసీ బస్సులను ఆపి ఏనాడైనా తనిఖీ చేశారా? ఆర్టీసీ బస్సులు పూర్తి సురక్షితంగా వుంటాయని, వాటికి అస్సలు ప్రమాదాలు జరగవని, వాటిని తనిఖీ చేయాల్సిన అవసరం లేదని ఆర్టీఏ అధికారులకు ఎవరైనా సర్టిఫికెట్ రాసిచ్చారా? మొత్తమ్మీద ఈ మొత్తుకోవడం వెనుక ఉన్న బాధ ఏమిటంటే, ప్రైవేట్ బస్సుల మీద ఎలాంటి రూల్స్ ప్రయోగిస్తున్నారో  ఆర్టీసీ బస్సుల మీద కూడా అవే రూల్స్ ప్రయోగించాలి. ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలి.