జగన్ పై దాడి.. ఆపరేషన్ గరుడలో భాగమా.!!

 

వైజాగ్ ఎయిర్ పోర్టులో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడి ఆపరేషన్ గరుడలో భాగమా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. నటుడు శివాజీ కొన్ని నెలల క్రితం 'ఆపరేషన్ గరుడ' అంటూ సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఒక జాతీయ పార్టీ ఏపీ మీద కక్ష్య సాధించాలనే ఉద్దేశంతో 'ఆపరేషన్ గరుడ'ను ప్రయోగిస్తున్నట్టు ఆయన తెలిపారు. అంతేకాదు అసలు 'ఆపరేషన్ గరుడ' ను ఎలా ప్రయోగిస్తారు? ఈ ఆపరేషన్లో ఎవరెవరు పావులు? అనే విషయాన్ని వీడియో రూపంలో శివాజీ ప్రజలకు క్లియర్ గా వివరించారు. అయితే శివాజీ మాటలను దాదాపు అందరూ కొట్టిపారేశారు. అంతేకాదు సోషల్ మీడియా వేదికగా పలువురు ఆయన మీద జోకులు కూడా పేల్చారు. అయితే అప్పుడు శివాజీ మాటలు.. ఇప్పుడు జగన్ మీద జరిగిన దాడిని పరిశీలిస్తుంటే.. నిజంగా శివాజీ చెప్పినట్టు ఏపీ మీద ఒక జాతీయ పార్టీ ఆపరేషన్ గరుడను ప్రయోగిస్తుందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఎందుకంటే ఇలా దాడి జరుగుతుందని గతంలో ఆపరేషన్ గరుడ గురించి వివరించిన వీడియోలో శివాజీ ముందే చెప్పారు. 'ఒక జాతీయ పార్టీ.. ఏపీ స్థానిక ప్రభుత్వాన్ని డిస్ట్రబ్ చేయడమే టార్గెట్ గా పెట్టుకుంది. దీనిలో భాగంగానే ఏపీలోని ఒక ముఖ్య పార్టీ నాయకుడి మీద గుంటూరు, హైద్రాబాద్లో రెండు సార్లు రిక్కీ కూడా నిర్వహించారు. ప్రాణహాని లేకుండా ఆ నాయకుడి మీద దాడి జరుపుతారు. దీనివల్ల రాష్ట్రంలో అలజడులు మొదలవుతాయి. అంతేకాదు బీహార్ నుంచి వచ్చిన వ్యక్తులు ఇక్కడ అల్లర్లు స్టార్ట్ చేస్తారు. దీనివల్ల స్థానిక ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది' అని శివాజీ వీడియోలో వివరించారు. ఈ దాడి వెనుక అసలు కారణం ఏంటో ఇంకా తెలీదు కానీ.. గతంలో శివాజీ చెప్పిన మాటలు.. ఇప్పుడు దాడి జరిగిన విధానం చూస్తుంటే.. జగన్ పై దాడి ఆపరేషన్ గరుడలో భాగమనే అనుమానం వ్యక్తమవుతోంది.