కాంగ్రెస్ మటాష్!

 

 

 

ఐదు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ వివరాలు బయటకి వచ్చాయి. పలు మీడియా సంస్థలు, ఎన్నికల సర్వేల సంస్థలు కలసి నిర్వహించిన సర్వేలన్నీ నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ మటాషైపోవడం ఖాయమని, ఈశాన్య భారతంలోని మిజోరాం స్టేట్‌లో మాత్రం కాంగ్రెస్ చావుతప్పి కన్ను లొట్టపోయే అవకాశం వుందని తేల్చాయి. ఇండియాటుడే, టైమ్స్ నౌ, సీఎన్ఎన్-ఐబీఎన్ లాంటి మీడియా సంస్థలు విశ్వసనీయమైన సర్వే సంస్థలతో నిర్వహించిన ఎగ్జిట్‌పోల్ ఫలితాలు అందరూ ఊహించిన విధంగానే వచ్చాయి.

 

మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ ఆల్రెడీ అధికారంలో వుంది. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని సర్వేలు తేల్చాయి. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో వున్న రాజస్థాన్  రాష్ట్రాన్ని భారతీయ జనతాపార్టీ సొంతం చేసుకునే అవకాశం వుందని తేలింది. అలాగే ఢిల్లీలో కూడా బీజేపీ హవా నడుస్తుందని తెలుస్తోంది. అయితే ఈ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం వుండటం వల్ల ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ సహకారం తీసుకోవాల్సిన అవసరం వుండొచ్చని సర్వే ఫలితాలు వెల్లడించాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వదు కాబట్టి ఢిల్లీ పీఠం కూడా కాంగ్రెస్ చేజారినట్టే లెక్క!




ఇక కాంగ్రెస్ అధికారంలో వున్న మిజోరాంలో బొటాబొటి మెజారిటీతో గట్టెక్కే అవకాశం వుందని సర్వేలు చెప్పాయి. మిజోరాం లాంటి చిన్న రాష్ట్రంలో గెలవటం వల్ల కాంగ్రెస్‌ పార్టీకి పెద్దగా ఒరిగేదేమీ లేదు. ముఖ్యంగా ఢిల్లీ పీఠం కోల్పోయే పరిస్థితి రావడం కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బే. పదిహేను సంవత్సరాలుగా ఢిల్లీని శాసిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఇది మింగుడుపడని వ్యవహారమే. మొదటి నుంచీ సర్వేలు తనకు వ్యతిరేకంగా వుండటంతో కాంగ్రెస్ పార్టీకి సర్వేల పేరు చెబితేనే మండిపడుతోంది. డబ్బులు ఎవరు ఇస్తే సర్వేలు వాళ్ళకి అనుకూలంగా వస్తాయని అడ్డంగా వాదిస్తోంది. అయితే ఇప్పుడు ప్రముఖ మీడియా సంస్థలు జరిపిన ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఏది ఏమైనా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైందనడానికి ఈ సర్వే ఫలితాలు నిదర్శనంగా నిలుస్తాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.