వైసీపీ వెర్సెస్ అశోక్‌బాబు!

 

 

 

సమైక్య ఉద్యమాన్ని సక్సెస్‌ఫుల్‌గా నడుపుతూ రాజకీయ నాయకులకు చేతగాని పనిని చేసి చూపిన అశోక్‌బాబు మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కారాలు, మిరియాలు నూరుతోంది. గొంతు నొప్పి పుట్టేలా సమైక్య నినాదం వినిపిస్తున్నా సీమాంధ్రలో తమ పార్టీని పట్టించుకునేవారే లేకపోవడంతో వైసీపీ నాయకులు నిరాశలో వున్నారు. దాంతో తమ అక్కసును ఎవరు కనిపిస్తే వాళ్ళ మీద వెళ్ళగక్కుతున్నారు.

 

 

ఆల్రెడీ సీమాంధ్రలో తమ పార్టీకి చెక్ పెట్టిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మీద విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఏపీ ఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబుని టార్గెట్ చేసి విమర్శిస్తున్నారు. ఉద్యోగులు సమ్మె చేస్తున్న సమయంలో అశోక్‌బాబు బాబు చేత తమ పార్టీకి అనుకూలంగా మాట్లాడించాలని ప్రయత్నించిన వైసీపీ నేతలు విఫలమయ్యారు. తమ పార్టీ నీడలోకి రానని చెప్పడమే కాకుండా, రాష్ట్రం విభజన వరకూ రావడానికి కారణమైన వైసీపీ మీద పరోక్షంగా విమర్శలు కురిపించిన అశోక్‌బాబు మీద వైసీపీ నాయకులకు ఎప్పటి నుంచో ఆగ్రహం వుంది.



సీమాంధ్రలో అశోక్‌బాబు రాజకీయ నాయకుడిగా ఎదిగి తమ పార్టీని అడ్రస్ లేకుండా చేసే అవకాశం కూడా వుందన్న భయం వారిలో వుంది. అశోక్‌బాబు రాజకీయ పార్టీ ప్రారంభించే అవకాశం వుందని తాజాగా వార్తలు వస్తూ వుండటంతో వైసీపీ నాయకులకు చెమటలు పడుతున్నాయి.   అంతేకాకుండా కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి జగన్ నిర్వహించిన సమైక్య శంఖారావ సభ అశోక్‌బాబు నిర్వహించిన సభ ముందు వెలవెలబోయిందన్న విమర్శలు కూడా వైసీపీకి అశోక్‌బాబు మీద ద్వేషం పెరిగేలా చేశాయి. దాంతో తాజాగా అశోక్‌బాబు మీద వైసీపీ నాయకులు విమర్శనాస్త్రాలు సంధించడం ప్రారంభించారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి అశోక్‌బాబు విఘాతం కలిగిస్తున్నాడని ఆధారం లేని ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. అశోక్‌బాబు మీద  రాజకీయాలు ప్రయోగించి, ఆయన్ని మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసి, జనాల్లో అశోక్‌బాబు మీద వ్యతిరేకత పుట్టేలా చేసి రాజకీయ లబ్ధి పొందటమే వైసీపీ ప్రస్తుత కర్తవ్యంలా కనిపిస్తోంది.