ప్రజాదర్బార్ కాదని....సహస్ర చండీ యాగమా జగన్ ?

 

విభజన తర్వాత పదమూడు జిల్లాలతో ఏర్పడ్డ ఏపీకి రెండవ సీఎంగా వైసీపీ అధ్యక్ష్యుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాద్యతలు చేపట్టి నిన్నటితో నెల రోజులు పూర్తయ్యాయి. దీంతో చాలా వరకూ మీడియా సంస్థలు, వెబ్ సైట్స్ ఆయన నెల రోజుల పాలన భేష్ అంటూ ఏక పక్ష తీర్మానాలు ఇచ్చేశాయి. అయితే నిజానికి కాస్త మనసు పెట్టి ఆలోచిస్తే ఆయన ఏమేరకు పని చేస్తున్నారు అనే విషయం అందరికీ ఇట్టే అర్ధం అవుతుంది. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు బానే ఉంటున్నాయి, కానీ కొన్ని మాత్రం ఆచరణ సాధ్యమా కాదా అనే విషయాన్ని పట్టించుకోకుండా మొండిగా ప్రకటన చేసి ముందుకు వెళ్ళడం వలన అది జగన్ ప్రభుత్వం మీద పెద్ద మచ్చగా మిగిలిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. 

ఎందుకంటే ఏ విషయం అయినా చేసేయగలం అనే నమ్మకంతో ప్రకటనలు చేసి ప్రజల ముందు లోకువ అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాంటిదే ప్రజా దర్బార్, ఆయన తండ్రి రాజన్న మాదిరిగానే ప్రజలను నేరుగా కలుస్తారని ఆయన క్యాంప్ ఆఫీసులోనే ప్రజలతో మమేకం అయ్యి వారి సమస్యలు తీరుస్తారని జూన్ 29వ తేదీన సీఎంవో నుంచి దీనిపై అధికారిక ప్రకటన వెలువడింది. జూలై ఒకటి నుండి ఆయన ప్రతీ రోజూ ప్రజాదర్బార్‌లో పాల్గొన్న తర్వాతే రోజువారీ అధికారిక కార్యక్రమాలల్లో పాల్గొంటారని ప్రకటించారు. 

ఈ విషయం మీద ముందు నుండీ సమన్వయం ఉందో లేదో తెలీదు కానీ నిన్న జగన్ తో భేటీ ఐన మంత్రులు, ఈ నెలలో బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని అవి పూర్తయ్యాక వచ్చే నెలలో ఈ దర్బార్ మొదలవుతుందని ప్రకటించారు. అయితే సీఎంవో ప్రకటన మాత్రం వేరేలా ఉంది, ప్రజల వసతి కోసం సీఎం క్యాంప్ కార్యాలయంలో ఇంకా ఏర్పాట్లు పూర్తి కాలేదని అందుకే ఆగస్టు ఒకటో తేదీకి ప్రజాదర్బార్‌ను వాయిదా వేసినట్లుగా ప్రకటించారు. అదొక ఎత్తు అయితే జగన్ ఇంటికి ఈరోజు ప్రజాదర్బార్ వాయిదా పడిన విషయం తెలియక కొంతమంది ప్రజలు వచ్చి జగన్ కోసం ఎదురు చూస్తున్నారు. 

అయితే వారికి మాట మాత్రం అయినా ఈ వాయిదా విషయాన్ని చెప్పని జగన్ తమ పార్టీ ఏర్పాటు చేసిన సహస్ర చండీ యాగంలో పాల్గొనేందుకు వెళ్ళిపోయారు. జగన్ అలా వెళ్తున్న విషయాన్ని తెలుస్కున్న ఇంటికి చేరుకున్న ప్రజలు ఆయన్ను కలిసేందుకు ప్రయత్నించి తొక్కిసలాటకి లోనయ్యారు. వైసీపీ ఆధ్వర్యంలో తాడేపల్లి సీఎస్ఆర్ కళ్యాణమండపంలో సహస్ర చండీయాగం జరుగుతోంది. జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించాలని కోరుతూ ఏడాది క్రితం వైసీపీ నేతలు ఈ యాగాన్ని చేపట్టారు. 

ఎమ్మెల్యే భూమనకరుణాకర్ రెడ్డి సహకారంతో సాగిన ఈ యాగంలో పార్టీ ముఖ్యనేతలు కూడా పాల్గొంటూ వచ్చారు. ఈరోజు పూర్నాహుతి కార్యక్రమంలో జగన్ పాల్గొని ఈరోజుతో యాగానికి ముగింపు పలికారు. అయితే ముఖ్యమంత్రి హోదాలో జగన్ దైవ కార్యాలకి వెళితే ఎవరూ తప్పు పట్టరు, కానీ ఆయన ఇలా తన కోసం ఎదురు చూస్తున్న జనానికి మాట మాత్రం అయినా చెప్పకుండా అలా వెళ్ళిపోవడం, అనుభవ లేమితో ప్రకటనలు, వాయిదాలు ఖచ్చితంగా ప్రభుత్వం మీద నెగటివ్ అభిప్రాయం ఏర్పరుస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఇలాంటివి ఇప్పటికి అయినా పొరపాట్లు అనుకుని దిద్దుకునే చర్యలు చేపట్టకుంటే ప్రభుత్వానికి ఇబ్బందే !