"తప్పులు చేశాం, అబద్ధాలూ చెప్పాం'' : జయపాల్!

 


 

- డా. ఎబికె ప్రసాద్


[సీనియర్ సంపాదకులు]

 

 

జ్ఞానులయిన కొందరు తాత్వికుల అభిప్రాయంలో "దేవుడికీ త్యాగాలూ, త్యాగశీలురంటేనే యిష్టం''! కాని ఆధునిక యుగంలోని పెక్కుమంది రాజకీయవేత్తలూ, కుహనా రాజకీయాలూ తాము త్యాగాలు చేయకుండా తమ పదవుల వేటలో భాగంగా సామాన్యప్రజల్ని తమకోసం త్యాగాలు, ప్రాణత్యాగాలూ చేసేందుకు పురిగొల్పడం సర్వసాధారణమైపోయింది. అవసరమైతే తమ స్వార్థంకోసం దేశ రాజ్యంగాన్నీ, చట్టాలనూ వక్రీకరించడానికి సహితం ఏమాత్రం వెనుదీయరని కేవలం పది-పదిహేను పార్లమెంటు సీట్లకోసం అంగలార్చడానికి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే స్థితికి దిగజారిపోయారు. భారత రాజ్యాంగ నిబంధనలను అధ్యయనం చేసిన ఏ బుద్ధజీవీ ఈ పరిణామాన్ని సహించలేడు! కాంగ్రెస్ ప్రభుత్వం కనుసన్నలలోనే, దాని ఆశీస్సులతోనే, ఒకేజాతి, భాషాప్రాతిపదికపైన తన ఉత్తర్వులు ఆధారంగానే తాను నియమించిన "రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం'' సిఫారసులు పునాదిగానే, భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు అవసరాన్ని గుర్తించిన నాటి జాతీయ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, దాని సభలూ పదేపదే ఆమోదించిన తీర్మానాల సాక్షిగా అవతరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని - నిట్టనిలువునా చీల్చడానికి, తెలుగుజాతిని ముక్కలు చేయడానికి నేటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఒక తీర్మానాన్ని హడావుడిగా ఆమోదించింది; దానికి అంతే ఆదరాబాదరాగా క్యాబినెట్ ఆమోదముద్ర వేయించింది.

 

 

రాష్ట్రానికి చెందిన తన సొంతపార్టీ ఎం.పి.లను కూడా విశ్వాసంలోకి తీసుకోకుండా అకస్మాత్తుగా రాష్ట్రాన్ని విభజించే నిర్ణయాన్ని ప్రకటించింది. క్యాబినెట్ ఆమోదానికి ముందు పచ్చి అబద్దాల ద్వారా రోజుకొక తీరుగా రాష్ట్రప్రజలను మభ్యపెట్టి మోసగించింది. వై.ఎస్.రాజశేఖర రెడ్డి నాయకత్వంలో రెండుసార్లు ఎన్నికల్లో అఖండ విజయం ద్వారా రాష్ట్రప్రజలు కాంగ్రెస్ కు అత్యధిక సంఖ్యలో పార్లమెంటు సభ్యులను అప్పనంగా చేతికి అందించినందుకు ప్రతిఫలం - కేవలం తన కొడుకు రాహుల్ ను ప్రధానమంత్రిగా ఎలాగోలా నిలపడంకోసం తెలుగుజాతినే విచ్చిన్నం చేయబోవటం! పైగా అది కూడా ఏ ప్రాతిపదికపైన? రాజ్యాంగంలోని "3వ అధికరణ'' చాటున అక్రమంగా దాగి కాంగ్రెస్ అధిష్ఠానం కుట్రపన్నడం ద్వారా ఈ పనికి పూనుకుంది. ఆ "కుట్రలో భాగమే - తెలంగాణా విభజన సమస్యపై ముందుగా తన ప్రతిపాదన ఏమిటో కాంగ్రెస్ అధిష్ఠానం వెల్లడించకుండా ప్రతిపక్షాలను ఇరికించడం! అందుకే సీనియర్ రాష్ట్ర కాంగ్రెస్ ఎం.పి.లు సహితం తమను అధిష్ఠానం పూర్తిగా చీకట్లోకి నెట్టేసి, మాటమాత్రంగా కూడా విభజన నిర్ణయాన్ని తమకు ముందుగా తెలపనేలేదని బయటపడి చెప్పవలసి వచ్చిందని చెప్పడం!

 

ఈ మొత్తం విషపూరితమైన ప్రయోగంలో ఆదినుంచీ పాల్గొన్న అధిష్ఠానంలోని ప్రధాన సభ్యులెవరూ? తమ తమ రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలను కాపాడుకోలేక 'ఛీ' కొట్టించుకుని ఆయా రాష్ట్రాల ప్రజలకు దూరమైపోయిన ముగ్గురు తెలుగేతర సభ్యులు - దిగ్విజయ్ సింగ్ (మధ్యప్రదేశ్), అహ్మద్ పటేల్ (గుజరాత్), గులామ్ నబీ ఆజాద్ (జమ్మూ-కాశ్మీర్)! ఈ బాపతు తెలుగుజాతి భవిష్యత్తును దెబ్బతీయడానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా ఆదేశాలపైన ఆయాచితంగా అవతరించిన తీర్పకులయ్యారు! పైగా సుస్థిరత పొందిన రాష్ట్రాలను విభజించడం వల్ల కాంగ్రెస్ కు ప్రజలకూ ఎంత నష్టం వాటిల్లిందో స్వయాన తమ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో దిగ్విజయ్, ఆజాద్ లు బాహాటంగా ప్రకటనలు చేసినవారేనని, కలలో కూడా మరిచిపోరాదు! అయితే మధ్యలో, మన తెలంగాణా జాతీయంలో చెప్పాలంటే, కొందరు "బుడ్డర్ ఖాన్''ల [విదూషకుల]వల్ల రాష్ట్రానికి ఏర్పడిన సమస్యకు ఇండియన్ (దేశీయ) పరిష్కారం కాకుండా అర్థాంతరంగా వచ్చిపడిన 'ఇటాలియన్ సొల్యూషన్' మూలంగా రాష్ట్ర పరిస్థితులు మరింత జటిలమైపోయాయి! కాంగ్రెసేతర రాజకీయ పక్షాలలో పెక్కుమంది తాము ఆ 'ఇటాలియన్' పరిష్కారాన్ని తలదాల్చడంలో ఒకరికొకరు పోటాపోటీలు పది చివరికి 'ఇటాలియన్ సూత్రాని'కె కట్టుబానిసలై రాష్ట్ర పరిస్థితుల్ని మరింతగా కంపుకంపు చేసి కూర్చున్నాయి!



ఈ తరుణంలో ఎక్కడ ఏ స్థాయిలో ఎలాంటి చర్చ లేదా ప్రస్తావన సాగిందోగాని నా ఆత్మీయ మిత్రులు, కాంగ్రెస్ నాయకులయిన సీనియర్ కాంగ్రెస్ మంత్రి జయపాల్ రెడ్డి, శశిధర్ రెడ్డి 'విభజన' సమస్యపైన వేర్వేరు దృక్పథాలనుంచే అయినా తెలుగుజాతి భవిష్యత్తుకు ఏర్పడిన సంకట స్థితిపైన ఆవేదనను, తమ పాలుపోని స్థితినీ దాచుకొనలేక తమ మనోగత బాధను వేర్వేరు ప్రకటనలో వెలిబుచ్చడం గమనార్హం! వీరిలో ఒకరు (జయపాల్) విభజనపై జరిగిన కాంగ్రెస్ నిర్ణయాన్ని విమర్శించకుండానే ఇరుప్రాంతాల సయోధ్యకు సమస్యకు "సామరస్య పరిష్కారాన్ని'' వెతకడానికి తద్వారా ఉభయప్రాంతాల మధ్య "పెద్దమనుషుల ఒప్పందం కుదుర్చుకుందామ''ని ప్రతిపాదించారు! ఈ ప్రతిపాదనకు పూర్వరంగంగా జయపాల్ ఒక బండసత్యాన్ని బయటపెట్టక తప్పలేదు : ఆయన మాటల్లోనే  "మానవమాత్రులం కాబట్టి తప్పులు చేశాం. అబద్ధాలూ చెప్పాం. వాటి లోతుల్లోకి నేను వెళ్ళదలచలేదు'' అని నిర్మొహమాటంగా ఒప్పేసుకున్నారు! అందుకు ఆయనను అభినందించాలి. కాని ఆ "తప్పులు', "అబద్ధాల''ద్వారా రాష్ట్రసమైక్యతకు, మొత్తం తెలుగుజాతికీ, ఇరుగుపోరుగులో మన గౌరవప్రతిష్ఠలకూ తక్షణం పూరించలేని నష్టం ఎంతటి భారీస్థాయిలో జరిగిందో జయపాల్, శశిధర్ లు గుర్తించాల్సివచ్చింది; ఈ క్రమంలోనే ఉభయులూ హైదరాబాద్ యింత బ్రహ్మాండమైన స్థాయిలో వివిధరంగాలలో ఎదగడానికి బహుభాషల, భిన్న సంస్కృతులలో దీపించడానికి అన్నిప్రాంతాల వారి చోదోడు, వాదోడు ఉందనీ గుర్తించగలిగారు. అయితే మరో "పెద్దమనుషుల ఒప్పందం'' కోసం జయపాల్ పెడుతున్న షరతు మాత్రం కథను మొదటికే తెస్తుంది! మొదట "పెద్దమనుషుల ఒప్పందం'' [రాష్ట్రం ఏర్పాటు సందర్భంగా కుదిరిన ఒప్పందం] పూర్తిగా అమలులోకి రాకపోవడానికి లేదా అమలులోకి తెచ్చుకోలేక పోవడానికి కారకులెవరో ప్రస్తావించకుండా, "విభజనపై 'నిర్ణయం' జరిగిపోయిందిగనుక మరోసారి రెండుప్రాంతాల మధ్య మరొక "పెద్దమనుషుల ఒప్పందం''ద్వారా సామరస్యం నెలకొల్పుకుందామని జయపాల్ చెప్పడం హాస్యాస్పదం కాదా? అంతేగాక, "విభజన రాజ్యాంగ హక్కు'' అని ఆయన చాటడం మరీ విడ్డూరం!

 

ఎందుకంటే, రాజ్యాంగంలోని ''3''వ అధికరణం ఏకభాషా సంస్కృతులు ప్రాతిపదికగా ఏర్పడిన రాష్ట్రాలకు వర్తించదుగాక వర్తించదు! అందుకే భారతదేశ చరిత్రలో ఏనాడూ ఒకే భూభాగం పరిథిలో లేదా ఒకే రాష్ట్రంగా ఒకే గొడుగుకింద లేని హిందీ రాష్ట్రాలకు లేదా ప్రాంతాలకు మాత్రమే "3వ అధికరణ'' వర్తిస్తుందన్న సంగతి మరవరాదు! కాగా, అదే రాజ్యాంగ కింద కేంద్రప్రభుత్వమే సాధికారికంగా భాషా ప్రయుక్త ప్రాతిపదికపైన "రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమీషన్''ను (ఎస్.ఆర్.సి.) ఏర్పరిచి వున్నందున, దాని సిఫారసులపైన ఏర్పడిన రాష్ట్రాలను విచ్చిన్నం చేయడానికి ఆ "3వ అధికరణ'' అవతరించాలేదని గమనించాలి! అంతేగాదు, రాష్ట్రాల సరిహద్దుల్ని మార్చాలన్నా, ఉన్న రాష్ట్రంలోని ఒక భాగాన్ని మరో భాగంలో విలీనం చేసి, వేరే రాష్ట్రం ఏర్పాటు చేయాలన్నా సంబంధిత రాష్ట్రప్రభుత్వం, ప్రజలెన్నుకున్న ఆ రాష్ట్ర శాసనసభ అనుమతి లేకుండా రాష్ట్రాన్ని విభజించడానికి నిరంకుశ రాచరికవ్యవస్థలో 'సామంతుల' ఇష్టారాజ్యాలలో మాత్రమే వీలుంటుందిగాని, ప్రజాస్వామిక వ్యవస్థలో [మనం అలాంటి దానిలోనే ఉన్నామన్న నమ్మకం ఉంటే గింటే] మాత్రమే వీలుపడదు! అందుకే, రాజ్యాంగంలో సిక్కిం, మహారాష్ట్ర, గుజరాత్, మిజోరామ్, అరుణాచల్ ప్రదేశ్, గోవా వగైరా కొన్ని రాష్ట్రాల స్థిరత్వం కోసం "ప్రత్యేక నిబంధన''లను  అధికారాలను రాజ్యాంగం పొందుపరిచిందని మరచిపోరాదు.

 

18p/371 (డి) ప్రాధాన్యం అదే మార్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతికీ, స్థిరత్వానికి, ఉద్యోగ, సద్యోగ విషయాలలో రాష్ట్రంల్ని మూడు ప్రాంతాలమధ్య [ఆంద్ర, రాయలసీమ, తెలంగాణా] సమానతా విలువలు ప్రాతిపదికగా సమన్యాయం పొందుపరచడానికి అనుగుణంగా, తూ.చ.తప్పకుండా పాటించడం కోసమే అవతరించిన ప్రత్యెక ప్రొవిజన్ (స్పెషల్ ప్రొవిజన్) 371[డి] అని మరవరాదు! రాజ్యాంగ సవరణద్వారా 1973 నాటికే 371 అధికరణకు సవరణ తెచ్చి దానిని 371[డి]గా 1974 జులై 1 నుంచి ఇందిరాగాంధీ హయాములోనే ఈ సవరణ పడద్బందీగా అమలులోకి వచ్చింది! తద్వారా ఆ సవరణ అధికరణను కేంద్రం అనుల్లంఘనీయం చేసింది!

 

ఈ ప్రత్యేక సవరణ ఆధారంగానే దాని వివరణాత్మకమైన కఠిన షరతుల పరిధిలోనే ఉద్యోగుల నియామకాలుగాని, బదిలీలుగానీ, ప్రమోషన్లుగానే జరగాలని శాసించింది! వారి అలాంటి ప్రత్యేక అధికరణను ఒకవేళ సక్రమంగా సమన్యాయంగా పరిగణించి, పాటించకుండా పదవుల కాలక్షేపంలో మునిగితేలుతూ వచ్చిన మంత్రులను కొరత వేయకుండా, వారు చట్టాన్ని చట్ట నిబంధనలనూ అమలు జరపని నేరానికి ప్రజలను శిక్షించ సాహసించడం కన్నా మించిన 'క్రిమినల్ చర్య' ఎలా రాజ్యాంగహితమైనదో మిత్రులు జయపాల్, శశిధర్ లు మనసు విప్పి చెప్పాలి! పైగా మన రాష్ట్ర ప్రయోజనాల కోసం, తెలుగుజాతి ఐకమత్యం కోసం, దాని బిడ్డలందరి సమష్టి అభ్యుదయం కోసం ఉద్దేశించిన ఆ ప్రత్యేక విశిష్ట సవరణతో కూడిన 371[డి] అధికరణకు రాజ్యాంగంలోని "3వ అధికరణ'' వాదిగా లోబడి ఉండాలేగాని అందుకు విరుద్ధమైన దిక్కులో అది ప్రయాణించడానికి వీలులేదు సుమా! అందుకే "371డి'' అధికరణ ఉద్దేశం, లక్ష్యం ఏమిటో తెలియని దిగ్విజయ్ సింగ్ లాంటి కొందరు శంకా పీడుతుల కోసమే భారత సుప్రసిద రాజ్యంగా నిపుణుడూ, కలకత్తా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, కేంద్ర లా కమీషన్ మాజీ సభ్యుడు, ఠాగూర్ లా ప్రొఫెసర్, భారత రాజ్యాంగ చట్ట భాష్యాకారుడూ అయిన దుర్గాదాస్ బసు ఆ అధికరణ గురించి యిలా వివరించారు :
"371[డి] అధికరణను తీసుకు రావడంలో మౌలికమైన ప్రయజనం ఏమంటే : (1) ఆంధ్రప్రదేశ్ లోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని వేగవంతం చేయడం, తద్వారా రాష్ట్రమంతటా సమతుల్యమైన అభివృద్ధిని సాదించడం; (2) విద్య, ఉపాధి, పబ్లిక్ సర్వీస్ లో పౌరుల కెరియర్ అవకాశాలను రాష్ట్రంలోని వివిధప్రాంతాల్లో సమతుల్యంగా కల్పించడం'' [జస్టీస్ బసు "కాన్ స్టిట్యూషన్ లా'' పేజీ:384]!




ఈ 371[డి] అధికరణ అఆదారంగానే ఎన్టీఆర్ హయాములో 610 జీ.వో. వచ్చిందని మరవరాదు! అయినప్పుడు, ఈ "లక్ష్యాన్ని'' చేరుకునే ప్రయత్నంలో భాగంగానే జస్టీస్ శ్రీ కృష్ణ కమిటీ (2010) ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు, 1956కు ముందున్న పరిస్థితికీ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రాంతాలలో నెలకొంటూ వచ్చిన అభివృద్ధినీ అంచనావేసి, రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలోనూ ఇప్పటికీ వెనుకబడిన ఉన్న ప్రాంతం ప్రధానంగా రాయలసీమ మాత్రమేనని అధ్యయనం అనంతరం తేల్చి చెప్పింది! అంటే, మిగతా రెండుప్రాంతాలూ అభివృద్ధిలో సహజమైనతరతమ భేదాలతో 1956కు ముందుకన్నా నిస్సందేహంగా వివిధరంగాలలో ప్రగతిని రిజిస్టర్ చేశాయని స్పష్టం చేసింది! ఈ సందర్భంగా, మూడుప్రాంతాలూ అనుకున్నంత స్థాయిలో మరింత గణనీయమైన అభ్యుదయాన్ని సాధించలేక పోవడానికి కనపడుతున్న అసలు కారణాన్ని శ్రీకృష్ణ కమిటీ చెప్పడానికి జంకింది! దేశ పాలకులు, రాష్ట్ర పాలకులు దేశ "అభివృద్ధి''కి ఎంచుకున్న పెట్టుబడిదారీ-భూస్వామ్య వ్యవస్థలో అసమాభివృద్ధి అనేది ఒక ప్రత్యేక లక్షణం. ప్రపంచబ్యాంకు ప్రజావ్యతిరేక "సంస్కరణల''ను బేషరతుగా ఆమోదించిన ఫలితంగా ప్రభుత్వరంగం ఉనికి ప్రశ్నార్థకమై దేశ, విదేశీ బడా గుత్తవర్గాల ప్రయివేట్ పెట్టుబడులకు ద్వారాలు తెరచుకోవడంతో ప్రభుత్వానిది 'బ్రోకర్' పాత్రగా మారవలసి వచ్చింది! ఏ 371[డి] అధికరణ ద్వారా పబ్లిక్ సర్వీసులలో ఉపాధి సౌకర్యాలు మూడుప్రాంతాలలోనూ కల్పించి పెంచాలనుకున్నారో అది కాస్తా 'గుంటపూలు' పూయడం ప్రారంభమయింది. ఉపాధి వనరుల బాధ్యతా అనేది ప్రయివేట్ గుత్త కంపెనీల, విదేశీ గుత్త పెట్ట్టుబడి సంస్థలకు బలవంతంగా బదిలీ చేశారు!


 

ఇందుకు అనుగుణంగానే 1991 నాటి ప్రజావ్యతిరేక ఆర్ధిక సంస్కరణలలో భాగంగా అటు కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ, ఇటు చంద్రబాబు టి.డి.పి. పాలనలోనూ ప్రభుత్వ సర్వీసులలో ఏడాదికి దాదాపు 2 శాతం బొప్పున ఉద్యోగుల ఉద్వాసనకు వేటుపడిందని మరచిపోరాదు! అలా ఉపాధి రంగాన్ని ప్రయివేట్ రంగంలోని బడా తోడేళ్ళ దయాదాక్షిణ్యాలకు వదిలి కూర్చున్నారు. ఉపాధి సమస్యలపైన అన్ని చోట్లా ఆందోళనలకు ఇదే ప్రధాన కారణం సుమా!  అందువల్ల పెట్టుబడిదారీ, భూస్వామ్యవర్గ వ్యవస్థను కనీసం రాజ్యాంగం నిర్దేశిస్తున్న ప్రజాతంత్ర సోషలిస్టు వ్యవస్థదిశగా సమూలంగా మార్చుకుంటే తప్ప భారీస్థాయిలో ఉపాధికల్పనకు అవకాశాలుండవు. ప్రభుత్వాలు మారవచ్చు, పాలకులు మారవచ్చు, తమ మనుగడకోసం అవిఆశాపెట్టే "తాయిలాలు'' మారుతుండవచ్చు, కాని అసంఖ్యాకంగా వనరులు చూపించగల తయారీ వస్తూత్పత్తి (మాన్యుఫ్యాక్చరింగ్)రంగం, వ్యవసాయరంగాలను పండపెట్టడం వల్ల గ్రామసీమల్లో ఉపాధి సౌకర్యాలు ఎదగవుగాక ఎదగవు! అందుకే ఈ పరిణామాలను ముందుగానే పసికట్టిన కొలదిమందిలో ఒకరు - ఆంధ్రప్రదేశ్ అవతరణకు అసలు బీజాలు నాటి తెలుగుజాతిని ఒక్క గూడుకిందికి చేర్చిన తెలంగాణా రైతాంగ సాయుధపోరాటంగ నాయకులలో ఒకరైన దేవులపల్లి వెంకటేశ్వరరావు 1973 మార్చి 4 నాటికే "జాతుల సమస్య''పై రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంట్ లో యిలా స్పష్టం చేయవలసి వచ్చింది :


 

"తమ స్థానాన్ని బలపర్చుకోడానికి, ఒకే భాషా ప్రాంతాన్ని కూడా విడదీసి చిన్నరాష్ట్రాలు ఏర్పరచడానికి నేటి పాలకవర్గాలు వ్యతిరేకమనే అభిప్రాయం తప్పు! ప్రత్యేక ఆంద్ర, ప్రత్యేక తెలంగాణా, ప్రత్యేక రాయలసీమ నినాదాలను కొన్ని పాలకవర్గ ముఠాలు లేవనెత్తుతున్నారు. ప్రత్యేక రాష్ట్రాల నినాదాన్ని అభివృద్ధి నిరోధక ముఠాలే లేవనెత్తుతున్నారనేది గమనించాలి. ఈ నినాదాలలోని అభివృద్ధి నిరోధక స్వభావాన్ని మిలిటెంట్ శక్తులు బట్టబయలు చేసి, ఆ నినాదా స్వభావం నుంచి తమను తాము విడదీసుకోవాలి. బడా ధనికవర్గం, విదేశీ పెట్టుబడి, భూస్వామ్య వర్గాల పాలనే సమస్యలన్నింటికీ మూలకారణం. స్వయం నిర్ణయ హక్కు అనేది జాతిలో ఒక భాగానికి కాదు. తెలంగాణా ప్రజలు ఆంద్రజాతిలో ఒక భాగమేగాని ప్రత్యేకజాతి కాదు. అందువల్ల స్వయం నిర్ణయ హక్కు వుండేది ఆంద్రజాతి మొత్తానికే గాని మన తెలంగాణా ప్రజలకు కాదు .... దానికితోడు దేశ సమస్యలనుంచి ఆంధ్రప్రదేశ్ సమస్యలను విడదీసి చూడడం అవాస్తవికమవుతుంది. నేడు సమైక్య రాష్ట్రంలోప్రజలను పీడిస్తున్న సమస్యలు అటు ప్రత్యేక రాష్ట్రంలో కూడా ప్రజలను పీడిస్తూనే ఉంటాయి. అందువల్ల ఈ రెండు నినాదాలు కూడా ప్రుజల వకాలిక సమస్యలకు పరిష్కార మార్గాలు చూపవు''
 


అందువల్ల చెప్పొచ్చేమంటే, రాజ్యాంగంలో ఆంధ్రప్రదేశ్ లో మూడుప్రాంతాలవారి సర్వీసుల భద్రతా కోసం ప్రత్యేకంగా రూపొందించిన 371[డి] అధికరణ అమలులో ఉన్నంత కాలం రాష్ట్రాన్ని విభజించే అధికారం రాజ్యాంగంలోని "3వ అధికరణ'' క్రింద కేంద్రప్రభుత్వానికి ఉండదుగాక ఉండదు! ఎమర్జెన్సీ కాలంలో పౌరుల ప్రాథమిక హక్కుల అధ్యాయాన్ని నిరంకుశంగా కాంగ్రెస్ పాలకులు నిలిపివేసినట్టుగా "371(డి) అధికరణను 'ఢీ'కొనడం ఆ అధికరణకు రాజ్యాంగ సవరణ లేకుండా సాధ్యపడదు! అలాన్గే ఈ అధికరణ కింద కేంద్రం అధికారాన్ని చలాయించగల ఆదేశిక సూత్రాలుగానీ, కార్యనిర్వాహక ఆదేశాలుగానీ లేవు; పార్టీ వర్కింగ్ కమిటీ దొంగచాటుగా చేసిన తీర్మానానికి, అంతే గూడుపుఠాణీతో క్యాబినెట్ వేసిన ముద్రకూ నేరచరితులయిన లెజిస్లేటర్ లు శిక్షార్హులని చారిత్రాత్మక తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు ఆదేశాన్ని పార్లమెంటులో చర్చించకుండానే ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్సుకూ తేడాలేదు! స్థిరంగా ఉన్నా భాషాప్రయుక్త రాష్ట్రాలను చీల్చాలన్నా, తద్వారా కొత్తరాష్ట్రాలను ఏర్పరచడానికి ముందు ఎంతో కర్మకాండను విధిగా అనుసరించి తీరాలి! 371(డి) అధికరణ ఆసరాగానే ప్రభుత్వ ఉద్యోగులలో మూడుప్రాంతాలలోని ఉద్యోగుల, విద్యార్థుల ప్రయోజనాల ప్రత్యేక రక్షణ కోసమే  రాష్ట్రాన్ని జోనల్ పధ్ధతి ప్రకారం వర్గీకరించడమూ జరిగిందని మరవరాదు! 371(డి) ప్రకారం ఒక్క సుప్రీంకోర్టుకు తప్ప ఇతర కోర్టులకుగానీ, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునళ్ళుకుగానీ ఉద్యోగ నియామకాలు, బదిలీలూ, ప్రమోషన్ల విషయాల్లో జోక్యం తగదని తీర్పులు చెప్పాయి. ఆంధ్రప్రదేశ్ కు వర్తించే 371(డి) అధికరణకు మూడింట రెండువంతుల మెజారిటీతో రాజ్యాంగ సవరణ వస్తేనేగాని 3వ అధికరణ ప్రకారం రాష్ట్ర విభజన చెల్లదు! ఈ విషయంలో మరొక రాజ్యాంగ నిపుణుడు,సాధికార వ్యాఖ్యాత అయిన పి.ఎం. బక్షీ పేర్కొన్న వివిధ తీర్పులు కూడా ధృవపరిచాయి! వీటిని తెలుసుకోకుండా "విడిపోతేనే వికాసం''అనటం తెలుగువారి అభ్యుదయానికి చేటు! ప్రజలను విడగొట్టడం తేలికేగాని కలపడమే కష్టం సుమా!