పటేల్ సమైక్యతా సందేశాన్ని గాలికి వదిలేసిన మోడీ!

 

ABK Prasad separate telangan issue, ABK Prasad Kcr, separate telangan issue Kcr, ABK Prasad telangana, kcr ABK Prasad

 

 - డా. ఎబికె ప్రసాద్

 

[సీనియర్ సంపాదకులు]

 

పులి మేకతోలు కప్పుకున్నంత మాత్రాన మేకగా మారిపోతుందా? కాదు కనుకనే, దానికి 'మేకవన్నె పులి' అని పేరు పెట్టాల్సివచ్చింది! మేడిపండు చూపులకు మేలిమిగా కనిపిస్తే చాలా? దాని పొట్ట విప్పితే చాలు, అన్నీ పురుగులేనని ప్రజలకు తెలుగు! అలాగే 2000 మంది మైనారిటీల ఊచకోతకు బాధ్యుడై కూడా న్యాయవ్యవస్థనూ, అసమర్థపు కాంగ్రెస్ పాలనావ్యవస్థనూ కొండేళ్ళుగా మభ్యపెడుతూ కేసులనుంచి తప్పించుకుని తిరుగుతూ వస్తున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తన 'కంట్లో దూలాల్ని' చూసుకోకుండా ఎదుటివారి కళ్ళల్లో నలుసుల్ని వెతకచూడ్డంలో ఆరితేరిన వాడు! అశేష త్యాగాల ద్వారా భారత ప్రజాబాహుళ్యం అరవై అయిదేళ్ళనాడు సాధించుకున్న స్వాతంత్యాన్నీ, సెక్యులర్ (మతాతీత, లౌకిక)వ్యవస్థా స్థాపనను ప్రజలకు గ్యారంటీ చేసి ప్రజలకు హామీ పడిన రాజ్యాంగాన్నీ ఈ ఆరుదశాబ్దాలలో అటు కాంగ్రెస్ పాలకులూ, ఇటు రాజేకీయ ముసుగులో పాలనా శక్తిగా 'హిందుత్వ'పేరిట అవతరించిన భారతీయ జనతా పార్టీ నేడు 'మోడీత్వ'రంగులో క్రమంగా నాయకులు బయటపడ్డారు!


కాంగ్రెస్ పాలకుల తప్పుడు రాజకీయాలను చాటు చేసుకుని దేశ ప్రజలను, రాష్ట్రాలను సామ్రాజ్య వలస పాలకుల మాదిరిగానే విభజించి-పాలించే దుర్నీతికి బి.జె.పి. మతరాజకీయవాదులు కూడా గజ్జెకట్టారు. ప్రపంచబ్యాంకు ప్రజావ్యతిరేక "సంస్కరణల''కూ, విదేశీ బహుళజాతి కంపెనీల, దేశీయ గుత్తపెట్టుబడి వర్గాల ప్రయోజనాలకూ తమ తమ పదవీప్రయోజనాల కోసం గొడుగు పట్టడంలో కాంగ్రెసూ, బి.జె.పీ. నేడు పోటాపోటీలు పడుతున్నాయి! అందులో భాగంగానే, చివరికి జాతీయ స్వాతంత్ర్యోద్యమం గుర్తించి ఏకభాషా, సంస్కృతులు పునాదిగా భాషాప్రయుక్త రాష్ట్రాల అవతరణను సుసాధ్యం చేసిన పరిణామాన్ని బలవంతంగా తిప్పికొట్టేందుకు ఈ రెండు మత రాజకీయశక్తులూ తమ ఉనికికోసం, ఒకటిగా ఉన్న రాష్ట్రాలను విడగొట్టి ప్రజలమధ్య ఐక్యతను విచ్చిన్నం చేయడానికి వెనుకాడడం లేదు. ప్రజల వకాలిక సమస్యలయిన తిండి, బట్ట, వసతి, ఉపాథి అవసరాలను తీర్చగల ప్రణాళికాబద్ధమైన పతకాలను అమలు జరిపే బాధ్యతనుంచి ఈ రెండు పార్టీలు రోజురోజుకీ ప్రజలనుంచి దూరమవుతూ, ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు పెట్టుబడిదారీ వ్యవస్థకు సహజమైన 'చిట్కా'ను - విభజించి-పాలించే నీటిని ఆశ్రయించి ప్రజలమధ్య ఘర్షణలను, చీలికలను పెంచడానికి శతథా ప్రయత్నిస్తున్నాయి. ఈ ధోరణి పదవీ ప్రయోజన కాంక్ష దేశ విభజనతోనే ప్రారంభమయి కొనసాగుతోంది!

 

ప్రజలమధ్య, రాష్ట్రాలమధ్య తగవులు, తంపులు పెట్టే 'సంస్కృతి' ఆధారంగానే స్వాతంత్ర్యానంతర కాంగ్రెస్ అధిష్ఠానమూ, అనంతర దశలో బిజెపి నాయకులూ పంజాబ్ ను చీల్చడం (పంజాబ్-హర్యానాలుగా)దగ్గరనుంచి మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్ లను ఛత్తీస్ గడ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ లుగా ముక్కలుగా బద్దలుకొట్టడం వరకూ కీలకమైన పాత్రవహించాయి. ఈ 'విభజన' రాజకీయ కుట్రలో ప్రధాన సమర్థన "విడిపోవటం వికాసం'' కోసమేననీ, "విడిపోయి కలిసి ఉందా''మనీ చేసే విషప్రచారం! అదే సూత్రాన్ని ఇప్పుడు ఈ రెండు మత రాజకీయపక్షాలూ, ఎన్నికలలో తమ స్వార్థప్రయోజనాల కోసం, అందరూ ఆమోదించిన భాషాప్రయుక్త ప్రాతిపదికపై ఏర్పడిన రాష్ట్రాల స్వరూపాలను చెడగొట్టి, సమైక్యంగా మెలగుతూ పెట్టుబడిదారీ వ్యవస్థ పరిధుల్లోనే అభివృద్ధిని నమోదు చేసుకుంటున్న ప్రజలను చెల్లాచెదురు చేయడానికి సంకల్పించాయి; ఈ విచ్చిన్నకర విధానం పైననే ఈ రెండు పక్షాలూ ఆధారపడి తమ రాజకీయ భవిష్యత్తును కాపాడుకునే యత్నంలో ఉన్నాయి! తమ మత, కుహనా లోకిక రాజకీయాలు ప్రజలు గ్రహించకుండా ఉండేందుకు సమాజంలోని అట్టడుగు వర్గాల, బడుగుబలహీన వర్గాల ప్రయోజనాలను 'రక్షించ'డానికే తాము ఉన్నట్టుగా 'సినీ'పరిభాషలో 'బిల్డప్' యిచ్చుకుంటున్నాయి.

 

ఉదాహరణకు బిజెపి-ఎన్.డి.ఎ. హయాము కృత్రిమంగా ఛత్తీస్ గడ్, జార్ఖండ్ రాష్ట్రాలను ఏర్పరచడానికి చెప్పిన 'సాకు' ఏమిటి? ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక రాష్ట్రాలుగా విభజించామని! కాని ఆ లక్ష్యం నెరవేర లేదు సరికదా, ఎ మూడు రాష్ట్రాల నుంచి వీటిని ఎ ఉద్దేశ్యంతో 'చీల్చామ'ని చెప్పాలో ఆ ఆదివాసీల బతుకుల్ని విద్య, వైద్య, ఆరోగ్య, ఉపాథిరంగాలలో చట్టబండలు చేశారు; ఐక్యరాజ్యసమితి, దేశీయ సాధికార సంస్థలూ అజ్రిపిన సర్వేక్షణల్లో ప్రజల జీవన ప్రమాణాలు పెరగలేదు సరికదా, అక్కడి మైనింగ్ వ్యాపారాలు సాగించడం కోసం గిరిజనుల భూముల్ని మల్టీనేషనల్, దేశీయ బడా కంపెనీలు స్వాధీనం చేసుకుని వందలాది కోట్ల రూపాయల్ని దోచుకుతింటున్నాయి. ఆమాటకొస్తే అసలు ఈ ప్రత్యేక రాష్ట్రాలను ఏర్పాటు చేసింది - తిలాపాపం తలా పిడికెడూ పంచుకుని, అమాయక ఆదీవాసీ జనాలను, బడుగువర్గాలనూ పస్తుల్లోకి నెట్టడం! ఈ రెండు రాజకీయపక్షాలూ పోటాపోటీలతో పెంచిన ముఖ్యమంత్రులు పరమ అవినీతిపరులు కావటమూ, ఈ భారం దుర్భరమైనప్పుడు వారిని జైళ్ళపాలుచేయక తప్పని పరిస్థితులకు 'తాళి'కట్టడమూ!



 

ఇలాంటి పరిస్థితుల్లోనే, ఇటీవల హైదరాబాద్ లో సభ తీర్చిన బిజెపి 2014 ఎన్నికల సమన్వయ సంఘానికి సీనియర్ నాయకుడైన అద్వానీని పక్కకునెట్టి నరేంద్ర మోడీని రథసారథి చేశారు! ఉద్దేశ్యం - మతరాజకీయాల ద్వారా తిరిగి కేంద్రంలో అధికారంలోకి రావాలని భావించిన బిజెపి గత అయిదేళ్ళక్రితం వరకూ కర్నాటక సహా మొత్తం ఏడు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. అప్పటిదాకా దక్షిణభారతంలో కాలు మోపలేని బిజెపి మొదటిసారిగా కర్నాటకలో పూర్తిస్థాయి ప్రభుత్వాన్ని నెలకొల్పింది. అక్కడినుంచి స్థానికంగా కర్నాటకలో ఎన్నిరకాల మతఘర్షణలు చోటు చేసుకున్నాయో రాజకీయ పరిశీలకులకు తెలుసు! మరి ఈనాడు ఈ పార్టీ పరిస్థితి ఏమిటి? ఏడు రాష్ట్రాల్లో తన అధికారం కోలిపోయి, ప్రస్తుతం పాలనాశక్తిగాబిజెపి పాలన కేవలం నాలుగురాష్ట్రాలకు కుదించుకుపోయింది! పైగా ఈ నాల్గింటిలోనూ రెండు రాష్ట్రాలు [గోవా, మోడీవారి గుజరాత్] రాజకీయంగా ప్రాధాన్యతలేని కేవల సత్తరగాయాలుగా మిగిలిపోయాయి! చివరికి దక్షిణాదిన చేజిక్కించుకున్న ఆ 'ఒక్కాయికొక్కు' కర్నాటక సహితం ఈ ఏడాది (2013) మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా అవమానకరంగా బిజెపి చేజారిపోయింది! అంతకుముందు జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో కూడా ఘోరంగా ఓడిపోయింది; ఇక 2005 అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్ లోని జనతాదళ్ తో పొత్తువల్ల బిజెపి ఘనంగా ఎన్నికైనట్టు కనపడింది. కాని నరేంద్రమోడీ పార్టీ కేంద్ర రాజకీయాల్లో చోటుచేసు కావటంతో లోక్ దళ్ తో పొత్తు చిత్తు కావలసివచ్చింది! కాగా 2009 లోక్ సభ ఎన్నికల్లో ఈ "పొత్తు'' 40 లోక్ సభ స్థానాల్లో 32 స్థానాలను గెలుచుకుంది. కాని 1999 ఎన్నికల్లో 12 స్థానాలు గెలుచుకున్న బిజెపి 2009లో సొంతంగా ఆ స్థానాలను మాత్రమే నిలుపుకోగల్గింది.



కాని 2013 మోడీ బిజెపి అధిష్ఠానంలోకి రావటంతో బీహాల్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గుజరాతీ మోడీకి దూరంగా ఉండాల్సి వచ్చింది. కారణం? మోడీతో జోడీవల్ల జనతాదళ్ కు అంతకుముందు తనకు దగ్గరయిన బీహార్ లోని 17 శాతం ముస్లీం మైనారిటీల తాను మద్ధతు కోల్పోవలసి వస్తుందని భావించాడు! ఇక జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రంలో అవకాశవాద రాజకీయాలు 2013 జనవరిలో బిజెపి ప్రభుత్వాన్ని కూలగొట్టాయి, ఫలితంగా రాష్ట్రపతి పాలన వచ్చింది! ఇక 2012లో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో బిజెపి ఓడిపోయింది! ఇక దేశంలోనే అతిపెద్ద జనాభా గల ఉత్తరప్రదేశ్ లో, ఎన్నికల వ్యూహంలో, సీట్ల సంఖ్యలో అత్యంతగా పార్లమెంటులో బలాబలాల్ని ప్రభావితం చేయగల ఉత్తరప్రదేశ్ లో 2012 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో 403 స్థానాల్లో కేవలం 47 స్థానాలనే బిజెపి గెలుచుకోగలిగింది. మూడవ పార్టీగా మాత్రమే పరువు నిల్పుకున్నది. 2007లో కూడా కేవలం 51 సీట్లతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది;



అంటే 2002 ఎన్నికల్లో ఆ పార్టీ ప్రస్తుత అధ్యక్షుడైన రాజ్ నాథ్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉండికూడా బిజెపి 88 సీట్లతోనే సరిపెట్టుకోవలసివచ్చింది. అంటే 2002 నుంచీ ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ, బి.ఎస్.పి. పార్టీలు వంతులవారీగా ప్రభుత్వాలు నిర్వహిస్తూ అనేక వైఫల్యాలకు కారణమవుతున్నాగాని ఆ వైఫల్యాలను తనకు అనుకూలంగా బిజెపి మార్చుకోలేక పోవటానికి ప్రధాన కారణం - దాని హిందుత్వ, మోడీత్వ, ఆర్.ఎస్.ఎస్., భజరంగ్ దళ్ మత రాజకీయాలే! ఇలా ఉత్తరప్రదేశ్ లో రానురానూ బిజెపి పతనమవుతూ వచ్చింది. 1996 తర్వాత జరిగిన 4 అసెంబ్లీ ఎన్నికల్లోనో ఆ రాష్ట్రలో ఈ పార్టీ మొత్తం (425 అసెంబ్లీ స్థానాల్లో) వోట్లలోనూ, సీట్ల సంఖ్యలోనూ కూడా క్రమంగా పతనమవుతూవుతూ వచ్చింది. సరిగ్గా ఇందువల్లనే అది 2000-2001 లో కేంద్రంలో సంకీర్ణప్రభుత్వంలో ఉన్నప్పుడే బిజెపి ఉత్తరప్రదేశ్ ను విభజించి ఉత్తరాఖండ్ ను ఏర్పాటు చేస్తేనైనా కేంద్రంలో తన ప్రభుత్వం నిలుస్తుందేమోనని చీల్చడానికి సాహసించింది! అలాగే మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారాన్ని సహించలేనప్పుడు దాన్ని ముక్కలు చేసి ఛత్తీస్ గడ్ ను, బీహార్ లో తన పాలనలేదని జార్ఖండ్ నూ ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించింది! ఇంతకూ అన్నింటికన్నా ఉత్తరప్రదేశ్ అంతటి పెద్ద రాష్ట్రాన్ని చీలగొట్టాలన్న తలంపు బిజెపికి రావడానికి కారణం పార్లమెంటు సభ్యులలో గణనీయమైన సంఖ్యా అక్కడినుంచే ఎన్నిక అవుతూండటం.



అందుకే "యు.పి. అంటే ఇండియా, ఇండియా అంటే యు.పి.'' అన్న వ్యంగ్యవర్ణన జనంలో పాకిపోయింది! నెహ్రూ-ఇందిర పాలనలనుంచి నేటి సోనియా-రాహుల్ కాంగ్రెస్ వరకూ ఈ టప్పుడు సమీకరణే రాజ్యమేలుతోంది. అందుకే 'సుపరిపాలన'. 'అభివృద్ధి' మంత్రాలను తన ఆర్థిక దోపిడీకి ఆకర్షణీయ సూత్రాలుగా ప్రకటించిన వరల్డ్ బ్యాంకు అటు కాంగ్రెస్ పాలకులకు, ఇటు బిజెపి పాలకులకూ సమాన 'ఆరాధ్య'దైవమయింది! ఎవరికివారు తమ పాలనలను "వెలిగిపోతున్న ఇండియా'' అని తమకు తామే నినాదాలు ఎన్నికల సమయంలో సృష్టించుకుని ప్రజలను భ్రమల్లోకి నెట్టి కూర్చున్నారు. ఒడ్డు చేరుకునే వరకూ బోటు మల్లయ్యను మర్యాదగా పిలిచి, దాటింతర్వాత "బోడి''మల్లయ్య అన్నట్టు మోసగించడానికి అలవాటు పడ్డారు. అదే పద్ధతిలో హైదరాబాద్ సభలో నరేంద్రమోడీ స్థానంలేని ఆంధ్రప్రదేశ్ లో బిజెపిని నిలపడంకోసం "వికాస''పురుషుని వేషంలో తెలుగుజాతిని విడగొట్టేందుకు, ఐక్య ఆంధ్రప్రదేశ్ ను ముక్కలు చేసేందుకు రాజకీయ కుట్రలో భాగస్వామి అవుతున్నాడు!

 

కాని వందలాదిమంది రైతాంగ ఆత్మహత్యలకు, పోష్టకాహారానికి దూరమైపోయిన వేలాదిమంది బాలబాలికల, శిశువుల అకాలమరణాలకు నిలయమైన [ఐక్యరాజ్యసమితి నివేదికల ప్రకారం] గుజరాత్ లోని సౌరాష్ట్ర ప్రాంతం తనను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని చాలాకాలంగా ఉద్యమిస్తోంది. ఏడు జిల్లాలతో కూడిన [జామ్ నగర్, సురేంద్రనగర్, రాజ్ కోట, అమ్రేలి, భావనగర్, పోర్ బందర్, జూనాఘడ్] సౌరాష్ట్రను గుజరాత్ నుంచి వేరు చేసి ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలన్న ఉద్యమం అక్కడ ఉదృతంగా సాగుతోంది. దానికి పరిష్కారం చూపలేని మోడీ తగుదునమ్మా అని తెలుగుజాతిని రెండుగా చీల్చడం ద్వారా, వేర్పాటు ఉద్యమానికి ఊతంగా ఆంధ్రప్రదేశ్ లో బిజెపిని పెంచాలని కలలుగంటున్నారు. గుజరాత్ బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ ముక్కలు కావాలి, బిజెపికి నాలుగు సీట్లు పెంచుకోవాలి, తద్వారా ఢిల్లీ దర్బారుకు ఎగబాకాలి, అదీ రంధి! అందుకోస్సం నెహ్రూకు పోటీగా సర్థార్ వల్లభాయ్ పటేల్ కు నిలువెత్తు భారీ విగ్రహాలు ఆవిష్కరించారట! కాని పటేల్ నిలబడింది - భారతదేశ సమైక్యతకు, సంస్థానాల విలీనీకరణ ద్వారా రాస్ష్ట్రాల సుస్థిరత కోసమేగాని మోడీలాగా స్వార్థపూరితమైన విభజన ద్వారా తన 'వికాసం' కోసం కాదు!
 

ఆంధ్రప్రదేశ్ విషయంలో రాష్ట్రాల పునర్విభజన కోసం నియమించిన మొదటి ఫజత్ ఆలీ కమీషనూ, నిన్నమొన్నటి జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ సమర్పించిన రెండు నివేదికలూ మొదటి ప్రాధాన్యాన్ని - ఏకీకృత సమైక్యాంధ్రకే, విశాలాంధ్రకే స్పష్టంగా పేర్కొన్నాయని మరచిపోరాదు. శ్రీకృష్ణ కమీషన్ ఆరు ప్రాధాన్యతలలో మొదటి ప్రాధాన్యతను, ఆఖరి మాటనూ (1/6 ప్రతిపాదనలు) ఆద్యంతాల బిగింపులాగా సమైక్యరాష్ట్రమే సరైనదీ, పురోగతికి సవ్యమైనదీనని స్పష్టం చేసింది! ఇక్కడ నరేంద్రమోడీగాని, అతడిలాంటి బిజెపి నాయకులుగానీ ఈ సందర్భంగా సర్దార్ పటేల్ 1952 జులైలో పార్లమెంట్ లో చేసిన ప్రసంగాన్ని బట్టీపట్టకపోయినా కనీసం చదువుకొని ఉండటం అవసరం! ఆనాడే గూర్ఖాలాండ్ లేదా ఉత్తరాఖండ్ ప్రత్యేక రాష్ట్ర ప్రతిపాదన తలెత్తినప్పుడు సర్థార్ పటేల్ ముఖం వాచేలా యిలా హెచ్చరించారు:

 

"ఉత్తరబెంగాల్ లోని గూర్ఖాలాండ్ లేదా గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను అవాస్తమైన, అసహజమైన, జాతీయప్రయోజనాలకు హానికరమైన ప్రతిపాదనగా భారతప్రభుత్వం భావిస్తోంది. అలాంటి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకోసం ప్రారంభించే ఎలాంటి ఉద్యమానికి ఎలాంటి అవకాశం యివ్వరాదని కేంద్రప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది' ఇలాంటి మతిలేని ప్రయత్నాల ద్వారా దేశ సంఘీభావాన్ని చెడగొట్టడాన్ని కేంద్రప్రభుత్వం సహించబోదు''!

ఈ విషయంలో పటేల్ ఏకభాషా సంస్కృతులు ఆధారంగా సహేతుకమైన భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును అభిలషిస్తూ జాతీయ కాంగ్రెస్ ఆమోదించిన తీర్మానాలను గౌరవిస్తూ, అసహజమూ, అశాస్త్రీయమైన పద్ధతుల్లో రాష్ట్రాల విభజనను వ్యతిరేకిస్తూ స్పష్టం చేశారని మోడీ ప్రభృతులు తెలుసుకోవటం మంచిది!