ఆధార్ కు రక్తం, మూత్రం కూడా అడుగుతారేమో..!

 

ఈ మధ్య  సంక్షేమ పథకాలకి అయితేనేమి, బ్యాంకులకు గానీ, ఫోన్ నెంబర్లుకు గాను ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వాటికి ఆధార్ ను లింకు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానంపై సుప్రీంకోర్టులో కొంతమంది పిటిషన్ దాఖలు చేశారు. ఆధార్ ను ఎంతో మంది నిపుణులు ఆమోదించారని, ఇది విధానపరమైన నిర్ణయం అయినందున న్యాయపరమైన సమీక్ష అవసరం లేదని కేంద్రం వాదనలు వినిపించగా.. కేంద్రం వాదనలు విన్న న్యాయమూర్తులు తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాలను న్యాయస్థానాలు సమీక్షించరాదని ఇండియాలో దారిద్ర్య రేఖకు దిగువన నిజంగా మగ్గుతున్న వారిని ఆదుకోవాలన్నదే తమ అభిమతమని.. సాంకేతికంగా అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో ఆధార్ కార్యక్రమం నడుస్తోందని, కోర్టులు ఇందులో కల్పించుకోజాలవని అటార్ని జనరల్ కే కే వేణుగోపాల్ వాదించారు.  ఇక ఈ కేసును విచారిస్తున్నసుప్రీంకోర్టు  కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ నిర్ణయం పారదర్శకతతో కూడినదా? నిజాయితీతో ఉన్నదా? అన్న విషయాలను మాత్రమే కోర్టు విచారించగలుగుతుందని చెప్పారు. ఈ స్కీమ్ ను, ఆధార్ కార్డును వ్య‌తిరేకిస్తున్నవారి ప‌రిస్థితి ఏంట‌ని ఈ సందర్భంగా ధ‌ర్మాస‌నం కేంద్రాన్ని ప్ర‌శ్నించింది. ప్రస్తుతం వేలిముద్రలు, కనుపాపలు సేకరించడం వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించినట్టా? కాదా? అన్న విషయాన్ని విచారిస్తున్నామని, భవిష్యత్తులో ఆధార్ బోర్డు రక్తం, మూత్రం, డీఎన్ఏ నమూనాలను కోరదన్న నమ్మకం ఏంటని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.