ధ్యేయమే ధర్మం కాదు… ధర్మమే ధ్యేయం… బాహుబలితత్వం!


బాహుబలి… ఇప్పుడు ఇదొక పదం కాదు! ఓ సినిమా పేరు కూడా కాదు! బాహుబలి అనేది ఇప్పుడొక బ్రాండ్! ఇప్పుడొక మార్కెట్! ఇప్పుడొక చరిత్ర! ఇంతగా కలకలం రేపిన బాహుబలి… సినిమాలో ఎవరు? హీరో! యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్… బాహుబలిగా సరికొత్త ఇమేజ్ సంపాదించుకున్నాడు… జక్కన్న చేతుల్లో! ప్రభాస్ కెరీర్ ఇక పైన బాహుబలికి ముందు, బాహుబలికి తరువాత అనే మాట్లాడుకుంటారు! అయితే, ఇంత ప్రెస్టేజియస్ గా తీసిన బాహుబలిలో… హీరో పాత్రైన బాహుబలికి ఇన్ స్పిరేషన్ ఏంటి?

 

బాహుబలిలోని ఇతర పాత్రలన్నిటిలాగే కథానాయకుడి క్యారెక్టర్ కీ… పురాణ పురుషులే ప్రేరణ! ప్రధానంగా బాహుబలి వ్యక్తిత్వం చూస్తే మనకు శ్రీరాముడే గుర్తుకు వస్తాడు! ఆయనలాగే బాహుబలికి కూడా ఆజానుబాహుడు, అందగాడు, అందరికీ నచ్చిన వాడు! అయితే, రాముడికి సోదరులందరూ దాసానుదాసులే! కాని, బాహుబలి విషయంలో అసలు శత్రువు వరుసకు సోదరుడైన భల్లాలదేవుడు! ఇక్కడే మనకు మహాభారతం స్ఫురిస్తుంది! దుర్యోధనుడి లాంటి భల్లాలదేవుడు ధర్మరాజు లాంటి నీతిమంతుడు, నియమవంతుడు అయిన బాహుబలిని మోసం ద్వారా గెలవాలనుకుంటాడు. అయితే, భారతంలో ధర్మరాజుపై సుయోధనుడు చేసే కుట్రలు పని చేయవు. కాని, కట్టప్ప బాహుబలిని చంపేశాడు కాబట్టి… భల్లాలదేవుడి వ్యూహం ఫలించిందనే చెప్పుకోవాలి!

 

బాహుబలి వారసుడిగా, అంతే బలవంతుడిగా ది బిగినింగ్ లో అలరించిన శివుడు రెండో భాగంలో పగ తీర్చుకోబోతున్నాడు. అంటే ధర్మరాజు లాంటి బాహుబలికి జరిగిన అన్యాయానికి, దేవసేనకి జరిగిన అవమానానికి అర్జునుడిలా ప్రతీకారం తీర్చుకోనున్నాడన్నమాట! ఇక మొదటి పార్ట్ లో కొండలు ఎక్కుతూ, జలపాతాలు దాటుతూ, భారీ శివలింగాన్ని ఎత్తిన శివుడు… భీముడిలాగా కూడా ఒప్పించాడనే చెప్పాలి! ధర్మరాజు, భీముడు, అర్జునుడి పాత్రలే కాదు… రాజమౌళి తన హీరో క్యారెక్టర్ డిజైన్ చేయటంలో హనుమంతుడ్ని కూడా ప్రేరణగా తీసుకున్నాడు! లంకలా మారిపోయిన భల్లాలదేవుడి వశంలో వున్న మాహిష్మతిలోకి ఒంటరిగా చొరబడతాడు. రావణుడు సీతమ్మను బంధించినట్టు భల్లాలదేవుడు దేవసేనను బంధిస్తే… హనుమంతుడిలా కోటకి నిప్పు పెట్టి తల్లిని కాపాడుకుని తెచ్చుకుంటాడు శివుడు! ఇదంతా చూస్తుంటే మనకు సుందరకాండలోని ఆంజనేయుడే గుర్తుకు వస్తాడు!        

 

అన్యాయం జరిగినప్పుడు , ప్రజలు అష్టకష్టాల పాలవుతున్నప్పుడు ఒక యోధుడు న్యాయం వైపున, ధర్మం వైపున నిలవటమే బాహుబలి తత్వం అయితే… మన దేశంలో ఇప్పటికి ఎందరో బాహుబలులు అవతరిస్తూనే వచ్చారు! ఎప్పటికీ ధర్మానికి ప్రతి రూపంగా నిలిచిపోయే శ్రీరాముడు మొదలు శ్రీకృష్ణుడు, ఛత్రపతి శివాజీ, సుభాష్ చంద్రబోస్… ఇలా ఎందరెందరో! ఒక్కొక్కరిదీ ఒక్కో మార్గమైనా అందరూ అధర్మాన్ని ఎదిరించేందుకే ఆయుధం పట్టారు! ఇక ఆయుధం పట్టకుండానే లోకాన్ని జయించిన ఆదిశంకరులు, వివేకానందుడు, గాంధీ … వీళ్లు కూడా బాహుబలులే!

 

ఇక మరోసారి మన వెండితెర బహు అద్భుత బాహుబలిని గుర్తు చేసుకుంటే… జక్కన్న చేత చెక్కబడిన ఈ బాహుబలి భల్లాలదేవుడ్ని, బాక్సాఫీస్ ని సమర్థంగా గెలవాలని మనమూ కోరుకుందాం!  ఆల్ ది బెస్ట్ టూ ఆల్ టైం బెస్ట్ తెలుగు మూవీ!