ఎగసిపడిన ఈ 'ఉప్పెన' విజయానికి నీ సంగీతం ఆయువుపట్టు!
on Feb 22, 2021
మెగాస్టార్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయం కాగా, విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించిన 'ఉప్పెన' మూవీ 2021లో ఇప్పటివరకూ విడుదలైన చిత్రాల్లో అతి పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేసిన ఈ మూవీకి దేవి శ్రీప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ పెద్ద హైలైట్ అయ్యింది. "నీ కన్ను నీలి సముద్రం" అనే బ్లాక్‌బస్టర్ సాంగ్ నుంచి అన్ని పాటలూ విన్నకొద్దీ వినాలనిపించేట్లు ఉన్నాయనేది వాస్తవం. అందుకే దేవిని మెగాస్టార్ సర్ప్రైజ్ చేశారు. అతడిని అభినందిస్తూ ఒక మ్యూజికల్ గిఫ్ట్‌తో పాటు ఓ లెటర్ కూడా పంపారు.
దాన్ని తన సొంత యూట్యూబ్ చానల్ ద్వారా షేర్ చేశాడు దేవి శ్రీప్రసాద్. చిరు పంపిన గిఫ్ట్ ప్యాక్‌లోంచి మొదటగా లెటర్ తీసి చదివాడు. "Dear DSP, ఎగసిపడిన ఈ ఉప్పెన విజయానికి నీ సంగీతం ఆయువుపట్టు. స్టార్స్ చిత్రాలకి ఎంత ప్యాషన్‌తో సంగీతాన్నిస్తావో, చిత్ర రంగంలోకి ప్రవేశిస్తున్న కొత్త టాలెంట్‌కి అంతే ప్యాషన్‌తో మ్యూజిక్ నిస్తావ్. నీలో వుండే ఈ ఎనర్జీ, సినిమాలకి నీ మ్యూజిక్ ఇచ్చే ఎనర్జీ ఎప్పటికీ ఇలాగే వుండాలని కోరుకుంటూ, నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. God Bless Devi! You Truly are a Rock Star!.. ప్రేమతో చిరంజీవి." అని అందులో ఉంది.
ఆ తర్వాత ఆయన పంపిన గిఫ్ట్‌ను కూడా తీసి చూపించాడు దేవి. అది ఇద్దరు ప్రేమికుల పింగాణీ బొమ్మ. చాలా బ్యూటిఫుల్‌గా ఉన్న ఆ బొమ్మను చూసుకుంటూ మురిసిపోయాడు దేవి. తనకే కాకుండా, ప్రతిభావంతులైన ఎవరినైనా ఎంకరేజ్ చేస్తూ వస్తున్న మంచి మనిషిగా చిరును కొనియాడాడు.