Next Page 
మిసెస్ కైలాసం పేజి 1


                                     మిసెస్ కైలాసం
                                                          ---వాసిరెడ్డి సీతాదేవి
    

                                        అన్నీ కథలే
                            ---డా|| సి. నారాయణరెడ్డి

                                  
    
    'ఏవండీ కథలు' ?- ఒక సినీ నిర్మాత శాశ్వతషికాయతు.
    'అసలు మన తెలుగులో కథలంటూ వున్నాయా? వొట్టికబుర్లూ కాకరకాయలూ-తప్ప' ఒక సగటు సంసారి జిగటు తీర్పు.
    'పత్రికల్లో బండ్లకొద్ది వస్తున్న కథల్లో ఒక్కటైనా ఒరిజినలా? అబ్బే! నాసిరకం దిగుమతి సరుకు'___ ఒక రోల్డుగోల్డ్ మేధావి విసుగులో పులిసిన విసురు.
    'కథాసరిత్సాగరంతప్ప చెప్పుకోదగ్గ కథలేవీ'?- ఒక పండిత శార్దూలుని గాండ్రింపు.
    ఇదీ వరస. ఆధునిక సాహిత్యంలోని అన్ని ప్రక్రియలకూ ఈ ఈసడింపులే వర్తిస్తాయి. అందుకే పాపం యేనాడో అన్నాడు కవి 'ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరేకదా' అని.
    ఇంతకూ తెలుగులో కథలే లేవా? ఈ మధ్య అసలే లేవా? ఇన్ని వేల కథల్లో మంచి కథలంటూ మచ్చుకులేవా? దిగుమతిసరుకేతప్ప ఎగుమతి చేయవలసిన నాణ్యం ఈ తెలుగు కథలకు లేనే లేదా? అన్యనింద చేసే ముందు ఆత్మపరీక్ష చేసుకుందాం.
    భారత రామాయణాలతోనే కధలూ, గాధలూ ఆగిపోలేదు. కథా  సరిత్సాగరంతోనే కథా ప్రవాహం ఇంకిపోలేదు. 'కాశీ మజిలీల'తోనే కథాజీవి కైవల్యం అందుకోలేదు. కథ అనేది నిన్న ఉండేది. నేడున్నది. రేపుంటుంది. దాన్ని యే యుగాలూ అడ్డవు. దానికి కాలాల కళ్ళాలంటూ  లేవు. గాలీ, నీరూ, వెలుతురూ వున్నంతకాలం- పంచభూతాలమధ్యమనిషి అనే పంచభూత శిశువు జీవించినంత కాలం- వ్యధ లుంటాయి. సొదలుంటాయి. వెలుగునీడల వింతగులాబీలపొదలుంటాయి. ఇవన్నీ ఎన్నాళ్ళుంటాయో అన్నాళ్ళు కథలుంటాయి.
    అసలు వర్తమాన మానవజీవితమే ఒక కథలపుట్ట. మనిషికథల్లో పుట్టాడు; కథల్లో జీవిస్తున్నాడు; కథలను పుట్టించి చస్తున్నాడు. మన చుట్టూ కథలున్నాయి సాలెగూళ్ళుగా; చదరంగాల గళ్ళుగా; ఉదయాస్త మయాల రంగుల వాకిళ్ళుగా.
    అడుగడుగున జరిగే సంఘటనల్లో, అనుక్షణం పీల్చే ఊపిరిలో, కంటికి కనిపించే దృశ్యాలతోపాటు కళ్ళు మూసుకున్నా మనసుఅద్దంలో ప్రతిబింబించే స్మృతిబింబాల్లో బోలెడు బోలెడు కథలున్నాయి.
    కధలున్నాయంటే కథా వస్తువు లున్నాయన్నమాట. చూసే కన్నూ; రాసే పెన్నూ వుంటే అడుగడుగునా కథావస్తువులే.
    రేడియోలో వినిపించే, పత్రికల్లో కనిపించే వార్తల్లో ఎన్నెన్ని కథావస్తువులు లేవు.
    మధనపడిన గుండెల్లో,  నిదురచెడిన కళ్ళల్లో ఎన్నెన్ని కథలు రెక్కలెత్తి విహరించడంలేదు.
    ఆ వార్తల్లోంచి కథావస్తువును పిండుకునే మనస్విత ఉండాలి. ఆ కదలాడే కలలబొమ్మలకు ప్రాణంపోసినిలబెట్టే కళానిపుణత ఉండాలి.
    సీతాదేవిగారి ఈ కథల సంపుటి చదివితే నిత్యజీవితం నా కళ్ళకు కట్టింది. 'నేనేనండీ' అంటూ వెన్నుతట్టింది. మనచుట్టూరా రోజూ ఎదురయ్యే సంఘటనలే సజీవంగా సాక్షాత్కరించాయి. ఎక్కడో ఎప్పుడో మెరుపుతీగల్లా తారసిల్లి మరుపుతెరల వెనకాల మాటుమణిగిన దృశ్యాలే మూర్తి కట్టుకుని ముందు నిలిచాయి.
    ఇక ఈ సంపుటిలోని కథల కమామీషును కాస్తా పరిశీలిద్దాం.
    ఒళ్ళంతా పెట్రోలుచల్లుకుని, నిప్పంటించుకుని మృత్యుకూపంలో దూకిన కుర్రవాడి వెర్రిసాహసం ఒక కథావస్తువు. ఆ కుర్రవాడికళ్ళల్లో మెరిసే ఆశలు, వాడు కట్టుకున్న కలల మేడలు, వాడూహించిన ఉజ్జ్వల భవితవ్య శిఖరాలు- ఇవన్నీ ఆ కథావస్తువు కంటుకున్న అగుపించని మంటలు. ఒక కర్మ సిద్దాంతికీ, ఒక హేతువాదికీ మధ్య జరిగిన సిద్దాంతరాద్దాంతాలతో తీగసాగిన కథ కన్నీటి మంటలతో పర్యవసిస్తుంది. ఇదే 'తమసోమా జ్యోతిర్గమయ'.
    పత్రికల్లో అప్పుడప్పుడు వార్త లొస్తుంటాయి; చిన్నపిల్లలను ఎత్తుకుపోయి కాళ్ళో కళ్ళో చితగ్గొట్టి ఆ కురూపులచేత బిచ్చమెత్తించి పొట్ట నింపుకునే కుత్సితులున్నారని. ఇలాంటి వార్తే ప్రాతిపదికగా రచింపబడిన కథ 'సానుభూతి'. పచ్చగా బతుకుతున్న దంపతుల గారాబు కొడుకు తప్పిపోగా, ఆ దంపతులగుండెల్లో కలిగిన రంపెకోతలనూ, ఆ తల్లి కడుపులో చెలరేగిన దావాగ్నులనూ హృదయ ద్రావకంగా చిత్రించిన కథ ఇది. మనోవిశ్లేషణం దీంట్లోని విశిష్టలక్షణం.
    ఆకటి చీకటికి లోబడి, అడ్డమైన చాకిరీచేస్తూ, తట్టుకోలేక ఒక రోజున మామిడి పండును దొంగిలించి పరుగెత్తుకుపోయి, ఆ కంగారులో లారీకిందపడి చితికిపోయిన అనాధబాలుడి జాలి బతుకు 'బతుకు ఖరీదు' లోని ఇతివృత్తం. ఈ సంఘటనకు సాక్షి జడ్జీ విశ్వనాథం. జడ్జీనే కలవరపరిచిన ఘట్టం ఈ కథకు కొసమెరుపు!
    కలం పేర్లనుబట్టి అమ్మాయిలని భ్రమసి, ఒళ్ళు తిరిగి, పైత్యం పెరిగి చివరికి పార్కులో కలుసుకున్నాక తప్పు తెలుసుకొని తబ్బిబ్బు పడిన రెండు మగపురుగుల రెక్కల టపటపలు 'మిస్టర్ ముకుందం' కథలో వినిపిస్తాయి.
    ఒకానొక ఆఫీసరాణి అల్పబుద్ధికి పట్టిన భూతద్దం 'మిసెస్ కైలాసం' కథ.
    ఈ కథావస్తువులన్నీ రోజూ మనం చూస్తున్న ____ ఊపిరి పీలుస్తున్న సమాజంలో ఉన్నవే. వాటిని చక్కని కథాఖండాలుగా చెక్కడం లోనే వుంది రచయిత ప్రతిభ. ఆ ప్రతిభ శతదళాలుగా వికసించింది సీతాదేవిగారి లేఖినిలో.
    ఈ సంపుటికే కలికితురాయిలాంటి కథ 'పశువూ! మనిషీ!'.    
    తీరా ఆరుపుటలైనా లేని ఈ చిన్నకథ కేవలం కథకాదు____ఒక కావ్యం. ఎల్లావూ, ఎల్లమందా దీంట్లో కదలాడే ప్రధాన పాత్రలు. కోడెదూడ, ఆసామి రంగయ్యా నేపథ్యంలో నిలిచిన పాత్రలు. తోటి మనిషిమీది కసితో, వాడి ఎల్లావును బందెలదొడ్లోపెట్టి, చివరికి తన పసిబిడ్డకు ఆవుపాలు కావలిసొచ్చి, ఆ గోమాతనే ఆశ్రయించి, ఆ తల్లి కురిసిన క్షీరధారల్లో తడిసి కటికి గుండెను వెన్నముద్దగా మలచుకొన్న ఎల్లమంద పాత్ర ఈ కధకు చైతన్యరూపం. ఈ మనిషినే మార్చేసిన ఆ పశువు (ఎల్లావు) ధైవస్వరూపం. ఈ కథనిండా పల్లెటూరి పలుకుబడి ముగ్ధమోహనంగా గుబాళిస్తున్నది; తొలకరి వానజల్లుతో గుప్పున ఉబికివచ్చే మట్టివాసనలాగా కధనం, కవిత్వం అద్భుతంగా అల్లుకున్న కథ ఇది నాలుగు పంక్తుల్ని పట్టి చూస్తేనే తెలుస్తుంది ఈ రచయిత్రి ప్రతిభ ఎంత పదునైనదో; ఎంత పరిపక్వమైనదో.
    'గుండెల్లో బిడ్డమీది మమకారం మసులుతుంటే, జివజివలాడు తోన్న పొదుగులో పాలు కదులుతోంటే మెడకింద గంగడోలు అల్లల్లాడుతోంటే, పట్టుకుచ్చుల తోకపైకెత్తి, మోరచాచి, ఉరకలువేస్తూ, నురగలు కక్కుతూ, చెంగుచెంగునా పరుగులు వేస్తూన్న ఎల్లావుకు, ఈనకాచిన పిల్లిపెసర చేను తన గిట్టల కింద నలిగిపోతోందన్న సంగతి తెలియదు- బాణాకర్రతో ఎల్లమంద ఎదురు నిల్చి నడిచేలో నిలేసేదాక!
    ఏవండీ కథలని చప్పరించేవాళ్ళకూ, 'యేదండీ తెలుగుతనం' అని పెదవి విరిచేవాళ్ళకూ ఈకథ కనువిప్పులాంటిది.
    ఈ సంపుటిలో దాదాపు అన్నీ మంచికథలే వున్నాయి; ఒక్క 'అమ్మమ్మ చెప్పని కథ' తప్ప ఇంతకూ అది కథై తేనా? కథకాని కథ. ఐనా____అమ్మమ్మను తలచుకొని జాలిగా, రచయిత్రిని తలచుకొని, జాలీగా చదువుకోవచ్చు దీన్ని.
    సమత, వైతరణి, మట్టిమనిషిలాంటి నవలల ద్వారా ఇంతవరకే పేరుపొందిన వాసిరెడ్డి సీతాదేవిగారు ఈ సంపుటిద్వారా తెలుగు కథానికా జగత్తులో మరింత వాసికెక్కుతారని ఆశిస్తున్నాను.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS