Previous Page Next Page 
జీవాత్మ పేజి 4


    
    ఏ మనిషైనా అనారోగ్యానికి గురైతే అతని స్థూల శరీరానికి వైద్యం చేయటమే యిప్పటివరకు మనకు తెలిసినది.
    
    జబ్బు స్థూలశరీరానికి పాకేవరకు ఆగకుండా యోగదృష్టి ద్వారా సూక్ష్మ శరీరాన్ని గమనిస్తే ఆ సూక్ష్మ శరీరానికే వైద్యం చేస్తే యింతమంది డాక్టర్లు, ఇన్ని హాస్పిటల్స్ అవసరం లేదేమో!
    
    1939లో సెమియోన్ డేవిడోవిచ్ కిర్లియాన్, అతని భార్య కలసి కిర్లియాన్ ఫోటోగ్రఫీని అభివృద్ధిపరచారు. అధిక ప్రకంపనలు గలిగిన విద్యుత్ క్షేత్రాన్ని ఆధారం చేసుకునే వాళ్ళీ ఫోటోగ్రఫీని కనిపెట్టడం జరిగింది.
    
    అయినా ఇంతవరకు ఆ ఫోటోగ్రఫీ మనదేశంలోని ఏ హాస్పిటల్ లోనూ ప్రవేశపెట్టడం జరుగలేదు.
    
    ఆరుదశాబ్దాలు గడిచినా ఆత్మను ఫోటో తీసే ఆ పరికరం మన దేశం రాకపోవడం మనదేశ ప్రజల దురదృష్టమనాలా...? లేక మన దేశాన్ని పాలించే నాయకులు, మేధావుల నిర్లక్ష్యమనాలా.....?
    
    కిర్లియాన్ దంపతుల అధ్యయనాన్ని ఆధారంగా చేసుకుని, అనారోగ్యం ముందుగా జీవధాతు శరీరానికి సోకుతుందనీ, ఆ తర్వాతే అది కన్పించే భౌతిక శరీరంలో కన్పిస్తుందని తెలిసింది.
    
    జీవశక్తి శరీరమంటే కేవలం ఏదో ఒక విధమైన ప్లాస్మా (ద్రవం) వంటి అయాన్ లతో కూడిన ప్రోటాన్, ఎలక్ట్రా న్ లతో లేదా అలాంటి ఇతర అణువులతో ఉత్తేజవంతమైన, శక్తిమండలమే కాదనీ, అది స్వయంగా ఒక సమైక్య జీవమనీ, అదంతా ఒక్కటిగా పనిచేస్తూ, తన స్వంత విద్యు దయస్కాంత క్షేత్రాలను ఏర్పరచుకుంటుందనీ, అల్మా ఆటాలో గల ఎంతో గౌరవప్రదమైన కిరోవ్ స్టేట్ యూనివర్శిటీకి చెందిన జీవ భౌతికశాస్త్రజ్ఞులు, జీవరసాయన శాస్త్రజ్ఞులు, జీవ భౌతిక శాస్త్రజ్ఞులు బృందం ప్రకటించింది.
    
    మానసిక ఉద్రేకాలు, మనస్సు యొక్క నిశ్చలత, మనోస్థితి, ఆలోచనల ప్రభావం ఈ జీవధాతు శరీరంపై వుంటుంది.
    
    స్టేట్ యూనివర్శిటీ ఆఫ్ కజాఖాస్తాన్ పరిశోధనా ఫలితాల నాధారంగా, శక్తి శరీరానికి ఒక నిర్దిష్టమైన వ్యవస్థాపరమైన అమరిక వుంటుందనీ, అది జీవి యొక్క రూపాన్ని నిర్ణయిస్తుందనీ తేలింది.
    
    మాస్కోలోని, ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఏనిమల్ మార్ఫాలజీకి చెందిన డాక్టర్ అలెగ్జాండర్ స్టడిట్ స్కీ అనే శాస్త్రజ్ఞుడు కండరాల ముద్దను మెత్తగా, చిన్న చిన్న ముక్కల్లా తరిగి. ఒక ఎలుక శరీరంలోని గాయంలో పూడ్చి కట్టుకట్టాడు.
    
    ఆ తర్వాత చూడగా, పూర్తిగా కొత్త కండరం అక్కడ పెరిగింది. దానిబట్టి ఒక విధమైన నిర్దిష్ట శరీరతత్వ విధానం వుంది అనే నిర్ణయానికి వచ్చారు.
    
    ఏ వ్యక్తి అయినా తన వ్రేలిని గానీ, చేతిని గానీ పోగొట్టుకున్నప్పటికీ, ఆ పోగొట్టుకున్న భాగానికి చెందిన జీవధాతు శరీరం యింకా అలాగే వుంటుంది.
    
    దానివలన కొన్నాళ్ళవరకూ అది ఇంకా తనలోనే వుంది అనే భావన అతనిలో కలుగుతూనే వుంటుంది.
    
    జీవధాతు పదార్ధ నాళాలు వున్నాయనీ, అవి ప్రాచీన చైనా దేశీయుల వైద్యవిధానంలో వివరించిన ఆక్యుపంచర్ బిందువులు మెరిడియన్స్ లకు అనుగుణంగా వుందనీ లెనిన్ గ్రాడ్ కు చెందిన శాస్త్రజ్ఞుడు డా. మైఖేల్ కు కుజ్ మిచ్ గైకిన్ నిర్ధారించాడు.
    
    టోబో స్కోప్ సహాయంతోమ్ ఆక్యుపంచర్ స్థానాలను ఖచ్చితంగా సరిగ్గా సూచించాడు.
    
    ఆ తర్వాత విక్టర్ ఆడమెన్నో అనే ఒక యువశాస్త్రవేత్త,  మెరుగైన టోబోస్కోపూను కనుగొన్నాడు.
    
    దానికి సీ.సీ.ఏ.పీ. (కండక్టవిటీ ఆఫ్ ది ఛానెల్స్ ఆఫ్ ఆక్యుపంచర్ పాయింట్స్) అని పేరు పెట్టాడు.
    
    ఇది కేవలం ఆక్యుపంచర్ బిందువులనే గుర్తించదు- జీవధాతు శరీరంలో జరిగే ప్రతి చర్యలనూ, మార్పులనూ అంకెల రూపంలో గ్రాఫ్ గీస్తుంది కూడా.
    
    జీవధాతు శరీరంలో గల తేజోవంతమైన స్థానాలకు అనుగుణంగా ఆక్యుపంచర్ స్థానాలు వుంటాయి.
    
    నిద్రణంగా వున్నా మానసిక శక్తి సామర్ద్యాలను ఉత్తేజపరచడానికి జీవధాతు శరీరంలోని కొన్ని బిందువులలో చలనాన్ని కలిగించే అవకాశాన్ని, రష్యా  దేశస్థులు కూడా చాలా తీవ్రంగా పరిగణించారు.
    
    ప్రాణచికిత్స చేయడానికి, చికిత్సకుని జీవధాతు శరీరం నుండి రోగి జీవధాతు శరీరంలోనికి శక్తిమార్పిడి జరుగుతుందని రష్యాదేశపు మనోవైజ్ఞానిక చికిత్సకులపై జరిపిన పరిశోధనలు తెలిపాయి.
    
    ఈ పరిశోధనలన్నీ ఈ శతాబ్దంలో జరిగినవి. పై శాస్త్రజ్ఞుల పరి శోధనలకు తిరిగి మనదేశ ఆధ్యాత్మిక వాదులే ఆధారమయ్యారు. మన ప్రాచీన గ్రంథాల్ని తస్కరించి, విదేశీయులు తదుపరి పరిశోధనలకై వెళుతుంటే, మనం మాత్రం మన పూర్వ సంస్కృతిని, విజ్ఞానాన్ని, అజ్ఞానంతో చూడలేక పోతున్నాం. ఇక కథలోకి వెళ్దాం-
    
    
                                                                                               వినమ్రతతో
                                                                                 మీ సూర్యదేవర రామ్ మోహనరావు


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS