Previous Page Next Page 
రాక్షస నీడ (రెండవ భాగము) పేజి 3

 

    ఇందుమతి నవ్వుతూ "ఇప్పుడు చెప్పండి" అన్నది.
    "ఆపండి." విసుక్కున్నాడు సుందర్రామయ్య.
    "మరి మీ స్పిరిట్ పేరు ఇప్పుడు చెప్పదేం?"
    "అది అడిగి చెప్తాను" అని మళ్ళీ సుందర్రామయ్య రవిని పురమాయించాడు.
    "హోలీ స్పిరిట్ .....నిజం చెప్పు. వాళ్ళు పట్టుకున్నప్పుడు ఎందుకలా చేశావు?" అని అడిగాడు సుందర్రామయ్య.
    గ్లాసు కదులుతోంది. ఇందుమతి అక్షరాలు కలిపి చదువుతోంది.
    "వాళ్ళకు ఇంగ్లీషు రాదు."
    "నీకు వచ్చా?"
    "వచ్చు"
    "మరి నీ కొస్తే చాలదా? వాళ్ళ కెందుకు ఇంగ్లీషు రావాలి?" అన్నది ఇందుమతి.
    "నీకు నా మీద నమ్మకం లేదు. అందుకే నీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పను."
    ఇందుమతి పకపక నవ్వింది.
    సుందర్రామయ్య గారూ మీ గుట్టంతా బయటపడింది."
    "నా గుట్టేమిటి? నేను కావాలని తోస్తున్నానా?"
    "మరి నిజంగా గ్లాసులో స్పిరిట్ ఉంటే , అదే సమాధానాలు చెప్తుంటే గ్లాసు పట్టుకున్న వాళ్ళు దాన్ని నమ్మేవాళ్ళు ఎందుకై ఉండాలి. పైగా ఇంగ్లీషు తెలిసిన వాళ్లై కూడా ఉండాలా? పాపం! వాళ్ళూ తోశారు గ్లాసు. కాని వాళ్ళకు ఇంగ్లీషు రానందువల్ల అర్ధం పర్ధం లేకుండా తిప్పారు."
    సుందర్రామయ్యకు బోలెడంత కోపం వచ్చింది.
    "ఏమిటి నాన్నా! ఇక్కడ కూడా ప్రారంభించారూ?"
    అందరూ ఒక్కసారిగా తలలు తిప్పి చూశారు.
    "నువ్వు ఇంతవరకూ రాకపోతే చూసి రమ్మని అమ్మ గొడవ పెట్టింది" వచ్చిన యువకుడు అన్నాడు.
    "వీడు మా పెద్దబ్బాయి నరసింహారావు. ఉస్మానియాలో హౌస్ సర్జెన్ గా చేస్తున్నాడు" ఇందుమతికి కొడుకుని పరిచయం చేశాడు సుందర్రామయ్య.
    "తెలుసు, కాని ఎప్పుడు మాట్లాడలేదు." అన్నాడు నరసింహారావు.
    "మీకు కూడా ఈ ఊజా బొర్దు మీద నమ్మకం ఉందా?" అడిగింది.
    "మా నాన్న పట్టుకుంటే చాలు ఏదో ఒక స్పిరిట్ గ్లాసులోకి దూరి పోతుంది. చకచకా మనం అడిగేదానికి సమాధానం చెప్తుంది. మరి నమ్మక ఏం  చెయ్యమంటారు?" అన్నాడు నరసింహారావు నవ్వుతూ.
    ఇందుమతికి చిరాకు వేసింది.
    "ఒక డాక్టరు అయి ఉండీ మీరు కూడా నమ్ముతున్నారు. ప్రాణం లేని శరీరాలనూ, ప్రాణం ఉన్న శరీరాలనూ కూడా కోసే డాక్టరు - మనవ శరీర నిర్మాణం తెలిసిన డాక్టరు - చర్మం ఎన్నో పొరలుంటాయో తెలిసిన డాక్టరు - పొరకూ పొరకూ మధ్య ఉండేదేమిటో తెలిసిన డాక్టరు - ఓ మైగాడ్ ......" ఉద్రేకంగా అన్నది ఇందుమతి.
    "లేదమ్మా! వాడూ నమ్మడు. నీకంటే ఎక్కువగానే ఈ విషయాలు వస్తే ఉద్రేకపడిపోతాడు. నువ్వన్నట్టు ఈ డాక్టర్లకు శరీర నిర్మాణం గురించి తెలుసు - అంతేగాని ఆత్మ గురించి ఏం తెలుసు?' అన్నాడు సుందర్రామయ్య.
    "రవీ! నువ్వూ నమ్ముతున్నావా?' నరసింహారావు రవికేసి తిరిగి అడిగాడు.
    "నమ్మకేం చేస్తాడు? ఆ గ్లాసులో స్పిరిట్ అలా అచ్చు గుద్దినట్టు టకటక సమాధనాలిస్తుంటేను?" అన్నది ఇందుమతి రవికేసి జాలిగా చూస్తూ.
    నరసింహారావు పకపక నవ్వాడు.
    "మరి గ్లాసు ఎలా కదులుతుందంటావ్? నేనైతే కావాలని కదపలేదు" అన్నాడు రవి బిక్క మొహంతో.
    "అంతా నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది" అన్నాడు నరసింహారావు.
    "అంటే.....?"
    "గ్లాసులో స్పిరిట్ వస్తుందనే నమ్మకం అది ప్రవేశించగా గ్లాసు దానంతటదే కదులుతుందనే నమ్మకం. ఆ నమ్మకాలతోనే అది కదులుతుంది.
    "కదులుతుంది కాదు, కదిలిస్తారండి ." ఇందుమతి అన్నది.
    "అవునండీ! మీరన్నది ఒక రకంగా కరెక్టే. గ్లాసుల్లోకి స్పిరిట్ వచ్చిందనీ, ఆ స్పిరిట్ గ్లాసును కదిలిస్తుందని మనసులో కదిలే ఆలోచనల ఫలితంగా, మెదడు సందేశాలను పంపిస్తుంది. ఆ సందేశాల కనుగుణంగా నాడీ మండలం ఉద్రిక్తత చెందుతుంది. వాళ్ళకు తెలియకుండానే వారు గ్లాసును కదిలిస్తారు. అంతేగాని చెయ్యాలని చెయ్యరు. అటో రైడింగ్ ను తీసుకోండి. ఊజా బోర్డులో విధంగా నాడీ మండలం ఉద్రేకం చెంది, చేతి వేళ్ళను కదిలిస్తుందో, అదే విధంగా అటో రైడింగులో మెదడు పంపించే సందేశాలకు అనుగుణంగా నరాలు కంపించి వేళ్ళు కదులుతాయి."
    ఇందుమతికి తనను సపోర్టు చేసే వ్యక్తీ దొరికేసరికి పెద్ద రిలీఫ్ గా అనిపించింది. డాక్టర్ నరసింహారావు చెప్తున్న విషయాలను శ్రద్దగా వినసాగింది.
    "ఒకోప్పుడు ఎక్కువగా ఊజా బోర్డులు, అటో రైటింగ్ ప్రయోగించే వారికీ అసంకల్పితంగా  అంతర్గత మనసు ఆజ్ఞలు జారీ చేయడం వల్ల నాడీ మండలం ప్రభావితం అవుతుంది. ఇలాంటి వారిలో కొంతవరకు హిస్టీరియా లక్షణాలు ఉంటాయనేది అంగీకరించక తప్పదు. అలాగే హిప్నాసిస్ కు లోబడ్డ వ్యక్తులను పరీక్షిస్తే వారిలో పంచేంద్రియాలు (మెలకువలో ఉన్న స్థితి కంటే) ఎక్కువగా చురుకుగా పని చేస్తాయనే విషయం తెలుస్తుంది. ఇది హిప్నాటిజమ్ సబ్జెక్టు తెలిసినవాళ్ళకు అనుభవమే. హిప్నాటిక్ దశలో ఉన్న వ్యక్తికీ ఒక ఇంద్రియం చాలా చురుగ్గా పని చేస్తుందని సజెషన్ ఇచ్చినప్పుడు ఆ ప్రత్యేక ఇంద్రియానికి అటువంటి శక్తి రావడం సహజమే. ఉదాహరణకు - డీప్ హిప్నాటిక్ స్లీప్ లో ఉన్న వ్యక్తికీ నీ అఘ్ర్రనంచె శక్తి పెరిగింది అని సజెషన్ ఇచ్చి పదిమంది చేతుల గడియారాలు తీసి వాసన చూపిస్తే , ఏ గడియారం ఏ వ్యక్తికీ చెందిందో వాసనా ద్వారా చెప్పగలరు. దాన్ని - అతీత శక్తి ప్రభావం అని అనగలరా?" అని ఆగి ఇందుమతిని చూశాడు నరసింహారావు.
    "అంటే హిస్టీరియా లక్షణాలకూ, హిప్నాటిక్ దశలో ఉన్న లక్షణాలకూ పెద్దగా తేడా లేదంటారా?" అడిగింది ఇందుమతి.
    "అవును! ఈ నమ్మకాలు ఉన్న వాళ్ళంతా ఆ విషయాల గురించి ఆలోచించేటప్పుడు , ఊజా బోర్డు ముందు కూర్చున్నప్పుడూ ఓ రకమైన పరవశ్వంలోకి వెళ్ళిపోతారు."
    "ఇక అపరా, నిన్ను డాక్టర్ చదివించడం నాదే తప్పు. విసుకున్నాడు సుందర్రామయ్య.
    ఇందుమతి వైపుకు తిరిగి "నీ విషయం కూడా చెప్పు. దానికి వాడెం చెప్పాడో చూస్తాను. ఊరికే దయ్యాల్లెవూ, ఆత్మలు లేవూ అని వాగంగానే అయిపోదు" అన్నాడు. అంతవరకూ ఉన్న చిరాకు కొడుకు మీదకు దొర్లింది.
    "నా విషయమా?" సాలోచనగా అన్నది ఇందుమతి.
    "అదే - నువ్వు వస్తూ అన్నయ్యను చూసిన విషయం .....' అందుకొని అన్నాడు రవి.
    "నేను మీ అన్నయ్యను చూశానన్నానా?" కయ్యిన లేచింది ఇందుమతి. ఆమెకు రవీ, సుందరామయ్య గౌతమ్ చనిపోయినట్లుగా నమ్మడం , తన్మయత్వంతో ఏదో ట్రాష్ మాట్లాడుతూ గౌతమ్ స్పిరిట్ తో మాట్లాడుతున్నట్టుగా భావించడం చాలా బాధ కలిగించింది.
    నరసింహారావు ఇందుమతి ముఖంలోకి చూశాడు.
    ఇందుమతి జరిగింది చెప్పింది.
    "మీ నాన్నగారు నేను చూసింది గౌతమ్ స్పిరిట్ ను అంటున్నారు.
    నరసింహారావు తండ్రిని అయోమయంగా చూశాడు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS