Previous Page Next Page 
ఒక గుండె సవ్వడి పేజి 3


    ఒక్క క్షణం అది విజువలైజ్ చేసుకున్నాడు. ఆ వెంటనే 'ఛ....ఛ...' అనుకుంటూ తల విదిల్చాడు. నీవు చరుచుకున్నాడు 'థూ- థూ-' అనుకుంటూ.
    "ఏమైంది అభీ- ఎనీ ప్రాబ్లెం..."
    "ఒసే...ఎందుకే నన్నట్టా టెన్షన్ తో చంపుతావ్?" ఏడుపు మొహంతో అన్నాడు అభినయ్.
    విరాజ మాట్లాడకుండా అతని భుజంమీద తలపెట్టి అతనితోపాటు నడుస్తూనే ఉంది.
    "నువ్వు మొద్దబ్బాయివి కాదు... ముద్దబ్బాయివి" అనుకుంది విరాజ ఆ క్షణం.
    తన దగ్గర వున్న ఫైవ్ రుపీస్ కాయిన్స్ ఆ మొక్కజొన్న పొత్తుల వాడికిచ్చి ఆ పొత్తులు కొన్న విషయం అభినయ్ కు చెప్పలేదు.
    అలా అభినయ్ ని ఉడికించడం సరదా విరజకు.
    అతడంటే ఆమెకు ప్రేమే కాదు.... ప్రాణం కూడా!
    
                                   * * *
    
    "హచ్.... హచ్... హచ్..."
    "ఆహా ... నువ్వలా తుమ్ముతుంటే నాకు గొంతులో 'బిచ్.... బిచ్... యాడ్ గుర్తొస్తోంది' అంది అభినయ్ తలను తన చీరకొంగుతో తుడుస్తూ.
    "ఎవరైనా పొడి టవల్ తో తల తుడుస్తారు. నువ్వేంటి తడిచిన చీరకొంగుతో తుడుస్తున్నావు?" అడిగాడు బుద్దిగా తల తుడిపించుకుంటూనే అభినయ్.
    "ఎన్ని తెలుగు సినిమాలు చూడలేదంటావ్.... వర్షంలో తడిచిన హీరోకు. హీరోయిన్ యిలానే తల తుడుస్తుంది. ఒక్కోసారి హీరో అలా హీరోయిన్ వంగి తల తుడుస్తుంటే ఆమె అందాలు చూసి చొంగ కారుస్తాడు. నువ్వేంటి.... అలా కళ్ళు మూసుకుంటావు దద్దోజనంలా...." అంది అభినయ్ రియాక్షన్స్ అబ్జర్వ్ చేస్తూనే.
    "నేనేం దద్దోజనాన్ని కాదు అయినా నీకిలా వర్షంలో తడుస్తూ నడవాలనే సరదా ఏమిటో అర్ధం కాదు. బుద్దిగా ఆఫీసులొ ఫైల్ చూస్తున్న నన్ను.... వర్షం మొదలవ్వగానే కొంపలు కూలుతున్న వాయిస్ తో పిలిపించావ్ యిలా తడిపించావ్.... పెళ్ళయ్యాక కూడా యింతేనా?" ఏడుపు మొహంతో అడిగేడు అభినయ్.
    "డౌటా? నాకు వర్షంలో మనిద్దరం తడుస్తూ వెళ్ళడం... అలా వెళ్తూ కబుర్లు చెప్పుకోవడం.... ఎంతిష్టమో..." అని గుండెలమీద తలపెట్టి అంది విరజ.
    "చచ్చాను.... వర్షాకాలమంతా నేనిలా తడవాల్సిందేనా... హతోస్మి..." అనుకున్నాడు అభినయ్.
    తను బుద్దిగా ఆఫీసులో ఫైల్స్ చూస్తున్నాడు. విరజ ఫోన్ చేసింది వెంటనే రమ్మనమని.
    తీరా వచ్చాక, కారులో టాంక్ బండ్ వరకూ వెళ్ళారు. అప్పుడే వర్షం ప్రారంభమైంది. అలా వర్షంలో తడుస్తూ నడుద్దామని చెప్పింది.
    టాంక్ బండ్ దగ్గరున్న జనాలు అంతా ఆశ్చర్యపోతూ చూశారు. యిలా వర్షంలో తాపీగా నడుచుకుంటూ, పైపెచ్చు మొక్కజొన్న పొత్తులు తింటూ వెళ్ళడం.... చూసేవాళ్ళకు వింతగా అనిపించింది.
    అయినా తనకు 'డోంట్ కేర్' ... అది విరజ కోరిక. విరజకోసం తను ఏదైనా చేస్తాడు. తను విరాజ కోరిక తీర్చాలి. దట్సాల్!
    
                                      * * *
    
    "అభీ!... ఏమిటీ ఆలోచిస్తున్నావ్?"
    "మనిద్దరి పరిచయం గురించి.... మనిద్దరి మధ్య అల్లుకున్న ప్రేమ గురించి....మనిద్దరం.... ఒక్కటే అనుకున్న వైనం గురించి..." చెప్తోన్న అభినయ్ మనసు ఎటో వెళ్ళిపోతోంది.
    "అభీ!.... నాకిప్పటికీ ఆశ్చర్యంగానే వుంటుంది. మన పరిచయం మన ప్రేమ.... గమ్మత్తుగా జరిగి, మత్తుగా పెరిగి, ముద్దుగా పెరిగి పెద్దయి..." అతని పెదవుల మీదికి తన పెదవులతో దాడికి సిద్దపడుతూ అంది విరజ.
    "అబ్బా.... నీకీ పెదవులు కోరికే... జబ్బేమిటి? నా పెదవులేమైనా దొండపండ్లా?!"
    "అదేమిటో అభీ! అమ్మాయిల పెదవుల్లా వుండే నీ ఎర్రటి పెదాలను చూస్తే నాలో శాడిస్టిక్ ఆలోచనలు.... ప్చ్.... నేను అబ్బాయిని.... నువ్వు అమ్మాయివి అయినా బావుండేది" అంది అల్లరిగా విరజ.
    అభినయ్ మాట్లాడలేదు.
    అతని మనసు గతస్మృతులను పరామర్శిస్తోంది.
    సరిగ్గా మూడేళ్ళ క్రితం....
    తనకు విరజతో పరిచయం... అదెలా?
    ఆ సంఘటన ఇంకా కళ్ళకి కట్టినట్టే వుంది.
    
                                     * * *
    
    టాంక్ బండ్ దగ్గర రెయిలింగ్ ని ఆనుకొని నిలబడ్డాడు అభినయ్.
    చీకట్లు ముసురుకున్నాయి.
    స్ట్రీట్ లైట్ల వెలుతురులో టాంక్ బండ్ అందంగా కనిపిస్తోంది. కొత్తగా వచ్చిన నెక్లెస్ రోడ్ అందంగా, అందమైన అమ్మాయి మెళ్ళో ఉన్న డైమండ్ నెక్లెస్ లా మెరుస్తోంది వచ్చీ, పోయే కార్ల లైట్లు మరింత అందంగా కనిపిస్తున్నాయి. ఆ కారులో తనూ తిరిగితే...
    ఎప్పుడు తనకా అదృష్టమో?!
    ఓవైపు చలి చంపేస్తోంది! మరోవైపు ఆకలి, కడుపులో ఏం లేదు మూడు రోజులుగా.
    నీళ్ళు తాగి తాగి కడుపులో వికారం పుడుతోంది. ఆకలికి మించిన పెద్ద శత్రువేదీ లేదు ఈ లోకంలో. అనుక్షణం తనని బెదిరించే ఆకలి. పాతికేళ్ళ జీవితంలో.... ఎన్ని నిద్రలేని రాత్రులు.... మరెన్నో అన్నం తినని సందర్భాలు.
    తను అర్జంటుగా ఏదైనా తినాలి. లేకపోతే తను కళ్ళు తిరిగి పడిపోవడం గ్యారంటీ. అవున్మరి....మూడ్రోజులుగా అన్నం తినకపోతే కళ్ళు తిరగక, కడుపు నిండుగా వుంటుందా? అయినా ఈ ప్రపంచంలొ పని కరువవ్వడమేమిటి? షిట్.... బూటు పాలిష్ చేయలన్నా, కనీసం బ్రష్, పాలిష్ వుండాలి. ఆ డబ్బులే వుంటే తను హాయిగా తినేవాడు.
    అభినయ్ అలా అలా ఆలోచిస్తూ.... టాంక్ బండ్ వంక చూస్తున్నాడు. అతనికి కళ్ళు తిరుగుతున్న ఫీలింగ్ కలిగింది. తనకేమవుతోంది? కళ్ళు తిరిగి తను స్పృహ కోల్పోవడానికి సిద్దంగా వున్నాడా?
    తన చాప్టర్ క్లోజా?
    "హి భగవాన్! హాయిగా నీళ్ళలో ఎంత ప్రశాంతంగా వున్నావయ్యా! నీకేం పట్టదు కదూ! చెయ్యి అభయం ఇస్తున్నట్టు పెట్టి, టాంక్ బండ్ వైపు చూడ్డమేగా నీ పని! నీకేం తెల్సు మా బాధలు... కళ్ళు పూర్తిగా బైర్లు కమ్ముతున్నాయి.
    ఆలోచనలు కూడా రాన్రాను మందగిస్తున్నాయి.
    తల్లెవరో....?
    తండ్రెవరో...?
    ఏమీ తెలియని తను.... అనాధ శరణాలయంలోకి ఎలా వచ్చాడో? కూడా తెలియదు. అక్కడే పెరిగి.... అంచెలంచెలుగా ఈ ప్రపంచంలో బ్రతుకు పోరాటం ప్ర్రారంభించిన తను... కనీసం తన ఆశయం నెరవేర్చుకోకుండానే....
    తను పెద్ద బిజినెస్ మాగ్నెట్ అవ్వాలి. ఉహూ... అలా అవ్వకపోయినా ఫర్లేదు.... ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో కనీసం రెండు రకాల టిఫిన్లు, మధ్యాహ్నం లంచ్ లో నాలుగు రకాల కర్రీస్, స్వీట్, రాత్రికి మంచి డిన్నర్.... ఉండడానికి యిల్లు.... మినిమమ్ ఓ కారు, కనీసం స్కూటరైనా ఫర్లేదు.
    అవేమీ తీర్చుకోకుండానే తను ఫినిష్ అవ్వబోతున్నాడా? బుద్ధ భగవాన్.... నీ స్టిల్లు మార్చవయ్యా.... ఏదైనా మిరాకిల్ చెయ్యి..." అనుకున్నాడు. నీళ్ళల్లో ఉన్న బుద్దుడ్ని చూస్తూ...
    సరిగ్గా అప్పుడే అతను ఎక్స్ పెక్ట్ చేసిన డామేజీ జరగనే జరిగింది. బుద్ది తక్కువై టాంక్ బండ్ లోకి తొంగి చూసి, అలానే కళ్ళు తిరిగి, బ్యాలెన్స్ తప్పి పెద్ద శబ్దం చేస్తూ.... ధబ్ మంటూ.... నీళ్ళల్లో పడిపోయాడు అభినయ్.
      
                                     * * *
    
    అప్పుడే 'హేశ్ మోర్' లో ఛోలేబత్రా తిని, గొంతుదాకా టూటీ ఫ్రూట్ ఐస్ క్రీమ్ లాగించి, ఫ్రెండ్స్- అంతా అలా టాంక్ బండ్ మీద వాక్ చేస్తూ వస్తుంటే వాళ్ళకి 'ధబ్' మన్న శబ్దం వినపడింది.
    వాళ్ళలో జీన్స్ ప్యాంట్, టీషర్ట్ వేసుకున్న అమ్మాయి నీళ్ళల్లోకి దూకి, ఒడ్డుకి లాగింది అభినయ్ ని.
    "ఏయ్.... మేన్.... అలా నోరు బిగించేస్తే ఎలా...? కక్కు.... కమాన్! తాగిన వాటరంతా కక్కు... అసలే నీళ్ళకు కరువు అంటే, ఎన్ని నీళ్ళు తాగావయ్యా? మహానుభావా..."


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS