Previous Page Next Page 
మట్టి మనిషి పేజి 2


    సాంబయ్యకు ఒళ్ళు పులకరించింది. గుండెలు పొంగాయి. చకచకా అంగాపంగా వేసుకుంటూ కాలవగట్టుమీద నడుస్తున్న సాంబయ్య తన వంశ చరిత్రంతా మననం చేసుకోసాగాడు-
    సాంబయ్య తండ్రి వెంకయ్య. వెంకయ్య పొట్ట చేత్తోపట్టుకొని ఆ వూరు వచ్చాడు. ఉత్తరాదినుండి వచ్చాడు కనుక ఆ వూళ్ళో అంతా అతన్ని ఉత్తరాది వెంకయ్య" అని పిల్చేవాళ్ళు. కట్టు బట్టలతో వచ్చిన వెంకయ్య మొదట్లో కూలిపనిచేసి బతికేవాడు. కాని త్వరలోనే ఊళ్ళోవాళ్ళ దృష్టిలో వెంకయ్య నమ్మకమైన మనిషని నిగ్గుతేల్చాడు. మోతుబరిరైతు వీరభద్రయ్య అతన్ని తన పాలేరుగా పెట్టుకున్నాడు. నాలుగేళ్ళు తిరిగేసరికి నాలుగొందలు వెనకేసి వెంకయ్య వేసవి కాలంలో ఉత్తరాదికి తన దేశం వెళ్ళాడు. మళ్ళీ ఊడ్పులరోజులకు తన యిల్లాలితో తిరిగి భద్రయ్యగారింటికి వచ్చాడు. భార్యతో తిరిగివచ్చిన వెంకయ్య వీరభద్రయ్యగారింటికి వచ్చాడు. వీరభద్రయ్యగారింట్లో పాలేరుపని మానేసి చినవీరయ్యగారి పొలం రెండెకరాలు కమతానికి తీసుకొన్నాడు; వీరయ్యగారి వాముల దొడ్డికి పక్కగా వున్న బొందల్లో చిన్న పాకవేసుకొని కాపరం పెట్టాడు. భార్య మంగమ్మ ఆ ఇంటా ఈ ఇంటా మంచి సెబ్బరకువెళ్ళి వూడిగం చేసేది. పచ్చళ్ళు పెట్టి, వడ్లు దంచి, కారం కొట్టి, పప్పులు బాగుచేసి ఇల్లు గడిపేది.
    వెంకయ్య పెళ్ళాంతోసహా పొలంలో అహర్నిశలూ పనిచేసి పండించేవాడు. కౌలుకు ఇచ్చిన చినవీరయ్యగారికి గింజ బీరుపోకుండా వప్పచెప్తున్న వెంకయ్య నిజాయితీమీద గ్రామంలో వాళ్ళకు గురి ఏర్పడింది. భరణం పొలం మీద బతుకుతున్న వితంతువు రెండెకరాలు కౌలుకు తీసుకున్న వెంకయ్య రెండేళ్ళు తిరిగేసరికి పన్నెండెకరాలు కౌలు వ్యవసాయం చేయసాగాడు. బండీ, ఎద్దులజతా కొన్నాడు. ప్రతియేడూ పుట్టి పుట్టిన్నర ధాన్యం వెనకేసుకోసాగాడు.
    పది సంవత్సరాలు గడిచాయి. వెంకయ్య రెండెకరాల పొలం కొన్నాడు.
    స్వంత పొలం అది. తన భూమి! వెంకయ్యకు భూమ్మీద మమకారం, సంపాదనమీద ఆరాటం పెరిగాయి. పొలం కొనటానికి కొద్దిగా అప్పు చేశాడు. ఆ అప్పు తీరేదాకా వెంకయ్య, వెంకయ్య భార్య నిద్రపోలేదు.
    అప్పులు తీరి స్వంత సేద్యంలో నిలదొక్కుకుంటున్నాడు వెంకయ్య. అప్పుడే సాంబయ్య పుట్టాడు. అప్పటికే మంగమ్మ పొరిగిళ్ళలో చాకిరి చెయ్యటం మానివేసింది.
    వెంకయ్య అరకకట్టి బయలుదేరితే, మంగమ్మ కొడుకు నెత్తుకొని భర్తతోపాటు పొలం వెళ్ళేది.
    పాతిక సంవత్సరాలు గడిచాయి. వెంకయ్య కాడిగట్టు పొలం మరో రెండకరాలు కొన్నాడు. తను వుంటున్న ఇంటిస్థలం కూడా కొన్నాడు. ఇవన్నీ కొనటానికి మళ్ళీ కొంత అప్పు చేయాల్సి వచ్చింది. ఆ అప్పు తీరేదాకా, తను కాపరం పెట్టిన ఆ మొదటి పాకలోనే ఉండటానికి నిశ్చయించుకొన్నాడు. ఎప్పుడో తప్ప కూలీల లేకుండానే వెంకయ్య కుటుంబం ఎల్లపాదీ పొలంలోనే పడివుండి పనులు చేస్తుండేవాళ్ళు. భార్య, కొడుకూ వెంకయ్యతోపాటే కష్టించి, ఆ శ్రమను పంటరూపంలో ఇంటికి తెచ్చుకొనేవాళ్ళు. వెంకయ్య ఎంత పొదుపుగా వ్యవసాయం చేస్తున్నాడో మంగమ్మ కూడా అంత పొదుపుగానే సంసారాన్ని గడుపుకొస్తుంది. కొడుకు సాంబయ్య తండ్రి వారసత్వం పుణికిపుచ్చుకొన్నాడు. తండ్రి మాటకు జవదాటి ఎరుగడు.
    సాంబయ్యకు పాతికేళ్ళు రాగానే పెళ్ళయింది. ఇంటి పనుల్లో ఆరితేరిన పిల్లను చూసి పెళ్ళి చేశారు. అయితే సాంబయ్యకు పిల్లను ఉత్తరాదిలోనే వెతకాల్సిన పనిలేకపోయింది. ఆ ఊరుకు రెండామడ దూరంలో వున్న పాలెంలో పెళ్ళి  చేశాడు తండ్రి. పదహారు రోజుల పండగయిపోగానే సాంబయ్య, పెళ్ళాం  దుర్గమ్మను వెంటబెట్టుకొని ఇంటి కొచ్చాడు. దుర్గమ్మ భర్తతో పగలు ఎప్పుడూ మాట్లాడి ఎరుగదు. ఇంట్లో వడ్లు దంచడం, పాడిగేదెను చూసుకోవడం, ఇంత ఉడకేసి పెట్టడం దుర్గమ్మ పనిగా వుండేది. తల్లీ దండ్రీతోపాటు సాంబయ్య పొలంలో కష్టపడి పనిచేసేవాడు. వెంకయ్యకు వీలుచూసుకొని కోడలు కూడా పొలం వస్తే బాగుండునని వుండేది. కాని అత్త మంగమ్మ ఆసెళ్ళే, అది ఎండలో ఏం కాగుద్ధిలే. ఇంటి పట్టున అది కూడా వుండకపోతే ఇల్లెట్టా!" అనేది.
    దుర్గమ్మ కాపరానికి వచ్చిన కొన్నాళ్ళకు వోరోజు, వారంరోజులుగా మంచు పడుతోంది. రాత్రిళ్ళు పొలాన పిల్లపెసరచేనుకు కాపలా పడుకొన్న వెంకయ్య ఏడో రోజు తెల్లవారి లేవలేదు. సాంబయ్య తండ్రికి అన్నం మూట తీసుకొని పొలానికి వచ్చాడు. చేలో గొడ్లుపడి మేస్తున్నాయ్. సాంబయ్య పరుగు పరుగున వెళ్ళి గొడ్లను అదిలించాడు. అప్పటికే కుంచం గింజలవార గొడ్లు తొక్కేసినయ్. సాంబయ్యకు మొదటిసారిగా తండ్రిమీద కంపరం కలిగింది.
    "ఎక్కడ సచ్చాడీ ముసలాడు?" అంటూ ధూంధాంలాడుతూ గూటి దగ్గర కొచ్చాడు సాంబయ్య. అన్నంమూట దించుతూ తొంగి చూశాడు. తండ్రి నిగడతన్ని పడుకొని వుండడం చూశాడు.
    "అయ్యోయ్, ఏందీ! ఇంకా పడుకున్నావ్?" పిలిచాడు కొడుకు.
    వెంకయ్య పలకలేదు, ఉలకలేదు, గుడిసెలోకి వంగి తండ్రిని కదిలించాడు.
    "అయ్యోయ్! ఏందిది? అయ్యోయ్!" అంటూ బిగ్గరగా అరచాడు.
    పొలంమీదున్న మరో మనిషి సహాయంతో తండ్రిని ఇంటికి చేర్చాడు.
    ఆచార్యులవారు వచ్చి చూసి వెంకయ్యకు ధనుర్వాతం వచ్చిందన్నాడు! సాంబయ్యకు అర్ధంకాక నోరు తెరిచాడు.
    "అదే సాంబయ్యా! గుర్రంవాతం! వయస్సు దాటినవాడు. రాత్రిళ్ళు మంచులో పడుకుంటే రాదామరి?" అన్నాడు వరదాచారి.
    "అదే కామాలి. నేను పట్టికుదిపితే ఉంగిడిపడ్డ గొడ్డులా బిగిసిపోయుండాడు మా అయ్య!" సాంబయ్యకు తండ్రి జబ్బేదో వరదాచారి చెప్పగా అర్ధమయినట్లు అన్నాడు.
    మంగమ్మ వెంకయ్యను చుట్టుకొని భోరున ఏడ్చింది.
    అలా వెంకయ్య మూడురోజులు మంచంలో వున్నాడు. నోరు బలవంతాన లాగి రోజుకు మూడుపూటలా వరదాచారి మందు నూరి పోశాడు. ప్రొద్దుట పోసిన మందు సాయంకాలం, సాయంకాలం పోసిన మందు పొద్దుటా తిరిగి పెదవుల సందుల్నుంచి బయటకు కక్కడం తప్పించి వెంకయ్య చూపూ పలుకూ ఎరగడు. మూడోరోజు రాత్రి వెంకయ్య - తాతముత్తాతలు పుట్టిన గడ్డవదిలి ఈ వూరికి వచ్చిన వెంకయ్య - తిరిగి వాళ్ళు వెళ్ళినచోటుకే వెళ్ళాడు. భర్త ఏడూరు చూడకుండానే మంగమ్మ పోయింది. తెల్లవారుజమున వాములదొడ్లో జనపకట్టె లాగుతున్న మంగమ్మకు పురుగు ముట్టింది. తెరలు తెరలుగా నురుగులు కక్కడం మొదలుపెట్టింది. నాలుగోసారి నురుగుకక్కినప్పుడుగాని సాంబయ్యకు ఊళ్ళోవాళ్ళిచ్చిన సలహా బుర్రకెక్కలేదు. ఎడ్లబండికట్టి జల్లలో తల్లినివేసుకొని పెళ్ళాన్ని తీసుకొని ఐదుకోసులదూరంలో వున్న రైల్వేస్టేషన్ కు బయలుదేరాడు. స్టేషన్ ఇంకా కోసెడు ఉందనగానే మంగమ్మ కాస్తా కన్నుమూసింది. దుర్గమ్మ జల్లబండిలో బావురుమంది. దుర్గమ్మ ఏడుపుని అదుపులోపెట్టి, సాంబయ్య బండిని వెనక్కు తిప్పాడు. దుర్గమ్మ అత్తశవం పక్కన కూర్చొని వెనక్కు వెనక్కు చూడటం మొదలుపెట్టింది. దుర్గమ్మ అంతవరకు పొగబండిని చూడలేదు దూరంగా తాటితోపు వెనుకనుంచి, పైకి లేస్తున్న పొగమాత్రం కన్పించింది పాపం దుర్గమ్మకు.
    అయ్యా, అమ్మా పోయాక సాంబయ్యకు రెక్కలు విరిగినట్టయ్యింది. పొలం పని తన ఒక్కడివల్లా కావడం లేదు. దుర్గమ్మనుకూడా వీలు చిక్కినప్పుడల్లా పొలం తీసుకువెళుతున్నాడు. కలుపుకూ, కాయకోతకూ - ఇంకా ఇలాంటి చిన్న చిన్న పనులకు కూడా కూలీలను పెట్టాల్సి వచ్చినప్పుడు సాంబయ్యకు గుండెలు చిక్కపట్టేవి. బిళ్ళకుడుముల్లాంటి వెండిరూపాయి లివ్వాలంటే ప్రాణాలు అలిసిపోయేవి. కూలికింద తాలూ బోలూ ధాన్యమూ, గడ్డీ, గాదమూ మాత్రమే ఇచ్చేవాడు. అట్లా ఇష్టమయిన కూలీలే సాంబయ్యకు పనిచేయడానికి వచ్చేవాళ్ళు.
    అత్తమామల చావుతో దుర్గమ్మకు ఇంటిచాకిరి కొంత తగ్గినా అలవాటులేని పొలంపని కొంత కష్టంగానే వుండేది. రాత్రిళ్ళు భర్తతోపాటు పొలంలోనే వుండాల్సి వచ్చినప్పుడు బెంగకూడా పడేది. అమ్మా నాన్నా గుర్తుకొచ్చేవాళ్ళు, పెళ్లయినప్పుడు వూళ్ళోవాళ్ళు, బంధుకోటి "దుర్గమ్మ అదృష్టవంతురాలు" అన్నారు కొస్టం, పొలం పుట్రా, ఇల్లూ, వాకిలీ, పాడీపంట వున్న ఇంటికి ఆమె కోడలుగా వెళ్తున్నందుకు.
    గుబులుగా వున్న దుర్గమ్మ ఒకోసారి సాంబయ్య మాటకు వెంటనే జవాబు చెప్పేదికాదు. మోచేత్తో కసుక్కున పొడిచే వాడు సాంబయ్య "ఎక్కడే నీ ధ్యాసంతా! చెప్పేదీ నీక్కాదు?" అనేవాడు సాంబయ్య.
    ఉగాది పండగరోజు తెల్లవారుఝామునే లేచి దుర్గమ్మ అలుకులూ ముగ్గులూ పూర్తిచేసింది. గారెలకు పిండి రుబ్బి, బూరేలకు పిండి దంచింది. మధ్యాహ్నానికి పిండివంటలన్నీ పూర్తిచేసి, దబరాగిన్నెలో పెట్టి భర్తకోసం ఎదురు చూడసాగింది దుర్గమ్మ. మెట్టపొలాన వున్న కందికట్టే, మాగాణిలో వున్న జనపకట్టే, బేరం ఇచ్చేసి బయానా పుచ్చుకొని తిరిగొచ్చాడు సాంబయ్య. వస్తూనే గాబుదగ్గరకెళ్ళి మొలపంచమీదే చన్నీళ్ళు గుమ్మరించుకొన్నాడు. ఛాతీమీద మట్టిని అరచేత్తో రుద్ది, మెడకింద మునిగోళ్ళతో గీకి బుడబుడా నెత్తిమీద నీళ్ళు గుమ్మరించుకొంటూ.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS