Previous Page Next Page 
కదిలే మేఘం పేజి 2


    "నాకు ఒక్కన్నీ వుండలేనంత సీరియస్ గా ఏంలేదు. అందులోనూ నేనుడాక్టర్ని నాగురించి నాకెందుకు తెలీదు? కావాలంటే చూడు" అంటూ మహేష్ బెడ్ మీదనుంచి లేచి నిలబడి గదిలో అటూ ఇటూ తిరిగాడు.
    సునంద అతని వంక ఆశ్చర్యంగా చూస్తోంది. శారీరకంగా దుర్భలంగా వుండటం తప్పించి మనిషి చాలా చలాకీగా వున్నాడు. అసలు యితన్లో జబ్బేవిటి? తన కర్ధంకానిది ఏదోవుంది. తెలుసుకోవాలి.
    "ఇప్పటికైనా నన్ను నమ్ముతావా?"
    "ఏమయినా ఒక్కదాన్ని వెళ్ళి ఆఇంట్లో వుండలేను. భయమని కాదు. వొంటరితనం భరించలేను"
    "కాని నువ్వెంత అలసిపోయి వున్నావో తెలుసా? ఫ్రెష్ గా వుండాలని లేదా?" అన్నాడతను తిరిగి బెడ్ మీదికివచ్చి కూర్చుంటూ.
    "ఇక్కడే ఫ్రెష్ గా అవుతాను"
    "ఇక్కడా? యిది హాస్పిటల్. ఏమి సుఖంగా వుంటుంది?"
    "హాస్పిటలయితే మాత్రంమేం? ఫైవ్ స్టార్ హోటల్లా వుంది. ఈ రూమ్ చూడు ఎంత గొప్పగా వుందో! మా ఆయన మిలియనీరైనా యింత హాయిగా ఏ రూమూ తీర్చిదిద్దలేదు. పైగా ఎ.సి., టి.వి. అన్ని సౌకర్యాలూ వున్నాయి" అంటూ లేచి బ్రీఫ్ కేస్ తెరిచి అందులోంచి చీరె, జాకెట్, టవల్ తీసుకుంది.
    "ఇప్పుడే వొస్తాను" అంటూ బాత్ రూమ్ లోకి వెళ్ళిపోయింది.
    ఇంచుమించు అరగంట గడిచాక డోర్ తెరుచుకుని సునంద గదిలోకి వచ్చింది.
    జుట్టు విరబోసి వుంది. తెల్ల పాలిస్టర్ చీరె, నల్లగా వంటికి అతుక్కుపోయినట్లున్న జాకెట్టు, పమిట కుడి చేతిమీదుగా వ్రేలాడుతూండగా, జాకెట్ అడుగు బటన్ పెట్టుకుంటూ "నిజంగా ఫైవ్ స్టార్ హోటల్లానే వుంది. బాత్ రూమ్ లో టబ్ వుందని  తెలీదు అబ్బా! ఎంత హాయిగా వుందో" అన్నది.
    ఆమె మీదనుంచి ఓ మృదు సుగంధం వ్యాపిస్తోంది. బటన్ పెట్టుకోవటం పూర్తిచేసి, పమిట సరిచేసుకుని, బెడ్ కు దగ్గరగా వున్న కుర్చీలో కూచుని "యిప్పుడు చెప్పు" అంది.
    జవాబు లేదు.
    అతనివంక పరీక్షగా చూసింది. కళ్ళు మూసుకుని పడుకునివున్నాడు.
    "మహేష్" అని పిలిచింది.
    పలకలేదు.
    నిద్రపోతున్నట్లు గ్రహించింది. అప్రయత్నంగా ఆమె చెయ్యి అతని నుదురు మీద వ్రాలి మెల్లగా నిమురుతోంది.
    సునంద కళ్ళవెంట నీళ్ళు కారుతున్నాయి.
    
        
                           *    *    *
    
    మరునాడు ఉదయం ఎనిమిది దాటుతోంది. ప్రొద్దుటే తనని చూడటానికి చంద్రం వస్తే కారులో సునందని యింటికి వెళ్ళి రమ్మని పంపించాడు.
    "తిరిగి రెండు గంటల్లో వొచ్చేస్తాను. అక్కడ ఒక్కదాన్నీ వుండలేను" అంది సునంద బయల్దేరబోతూ.
    "ఒక్క ప్రామిస్ మీద నిన్ను వొంటరిగా విడిచిపెడుతున్నాను"
    "ఏమిటి?"
    "హరిణిని నువ్వు కాంటాక్ట్ చెయ్యకూడదు. ఫోన్ లో గాని, పర్సనల్ గా గాని."
    సునంద మాట్లాడకుండా అతని ముఖంలోకి చూస్తూ నిలబడింది.
    "ఏమిటి?"
    "అలాగే" అన్నట్టు తలఊపింది.
    "హరిణికి నేను హాస్పిటల్ లో వున్నట్టు తెలీకూడదు. అంతే"
    ".....సరే"
    సునంద వెళ్ళిపోయింది.
    మెల్ బోర్న్ లో ఆస్ట్రేలియాకూ, ఇండియాకూ మధ్య బెస్ సన్ ఎండ్ హెడ్జెస్ వన్ డే యింటర్నేషనల్ పోటీ జరుగుతోంది.
    మహేష్ టి.వి. ఆన్ చేశాడు.
    ఇరువైపుల వాళ్ళూ బలాబలాలు చూపిస్తూ ఆడుతున్నారు. గవాస్కర్ స్లోగా బ్యాటింగ్ చేస్తోన్నా, చూసేవారికి యిదేమిటింత నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తున్నాడనిపిస్తోన్నా, తన ఆర్దడాక్సికల్ స్టయిల్ లో పకడ్బందీగా పరుగులు తీస్తున్నాడు. శ్రీకాంత్ తొందరగా పరుగులు తీసే ప్రయత్నంలో మేథ్యూస్ కి కాట్ ఎండ్ బౌల్డ్ అయి అవుటయిపోయాడు.....వెంగ్ సర్కార్ కొంత వరకూ బాగానే ఆడి తర్వాత యీజీ కాచ్ యిచ్చిరంగంనుంచి నిష్క్రమించాడు. తర్వాత వచ్చిన మొహీందర్ అమర్ నాథ్ వికెట్స్ మీదకి వస్తోన్న బంతిని బ్యాట్ తో అడ్డుకోవటం కుదరక చేత్తో ఆపి హ్యాండిలింగ్ ది బాల్ క్లయిమ్ మీద మేథ్యూస్ "హౌ యీజ్ యిట్?" అన్న అరుపుకు ఎంపైర్ అవుట్ యివ్వటంతో చావునవ్వు నవ్వుకుంటూ పెవిలియన్ లోకి వెళ్ళిపోయాడు.....ఆ తర్వాత వచ్చిన యువకిశోరం అజారుద్దీన్ తనమీద పెట్టుకున్న ఆశలన్నీ వమ్ముచేసి తేలిగ్గా అవుటయిపోయాడు....వెంటనే కపిల్ దేవ్ వచ్చి విజ్రుంభించబోయి ఎల్.బి.డబ్ల్యూ అయి వెనక్కి వెళ్ళిపోయాడు.
    మహేష్ యిహ చూడలేక పోయాడు. గెలవవలసిన మ్యాచ్ లో ఒక్కొక్కరూ పిట్టల్లా రాలిపోతూ చేతులారా జారవిడుచుకుంటూ ఉంటే భరించలేక టి.వి. ఆఫ్ చేసి గదిలోంచి బయటకు వచ్చాడు.
    ఎ.సి.రూమ్ అవటంచేత లోపల వున్నంత సేపూ బయటి ప్రపంచం తెలియలేదు.
    వరండాలోకి రాగానే హాస్పిటల్ వాతావరణమంతా కళ్ళకు కడుతోంది.
    ఎదురుగా ఓ సిస్టర్ నడిచి వొస్తోంది. అతన్ని చూడగానే చిరునవ్వు నవ్వి "హలో డాక్టర్! ఎలా వున్నారు?" అని పలకరించింది.
    "ఫైన్" అని చెప్పి ముందుకు సాగాడు.
    అతనువున్న అంతస్థులో అన్నీ స్పెషల్ రూమ్సే. ఇంచుమించు అన్నిట్లోనూ పేషెంట్సు వున్నారు. కని రూమ్స్ తలుపులన్నీ మూసివుండడం చేత లోపల ఎవరూ లేనట్లు, నిశ్శబ్దంగా అనిపిస్తోంది. అతని గదికి కొంచెం దూరంలో ర్యాంప్ వుంది. స్ట్రెచర్ మీద ఎవరో పేషంట్ ని పైకి తీసుకొస్తున్నారు.
    పేరపిట్ వాల్ దగ్గరకు వెళ్ళి నిలబడి క్రిందకి చూశాడు. సువిశాలమైన హాస్పిటల్ ఆవరణలో డజన్లకొద్దీ కార్లు ఆగివున్నాయి. ప్రతి రెండు నిముశాలకూ ఏదో కారు లోపలకు రావటమో, బయటకు వెళ్ళటమో జరుగుతోంది. అదిగాకుండా ఆటోలు, యితర వాహనాలు ప్రతిక్షణం కదుల్తూనే వున్నాయి.
    వివిధ శాఖలకు చెందిన డాక్టర్లు ఏప్రాన్స్ వేసుకుని అటూ ఇటూ తిరుగుతున్నారు.
    రకరకాల పేషంట్స్ - ఆపరేషన్ నిమిత్తం వచ్చినవాళ్ళు, గుండె జబ్బులవాళ్ళు, దీర్ఘరోగాలతో పీడించబడుతోన్న వాళ్ళు, యాక్సిడెంట్స్ అయినవాళ్ళు, కాన్పులకోసమొచ్చిన స్త్రీలు, గైనిక్ ట్రబుల్స్ తో వచ్చిన స్త్రీలు, వివిధ వ్యాధులతో తీసుకుంటోన్న పిల్లలు, పక్షవాతాలతో బాధపడుతోన్న రోగులు, కంటిజబ్బులవాళ్ళు, యి.ఎన్.టి. డిసీజెస్ వాళ్ళు, న్యూరలాజికల్ కేసెస్....


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS