Previous Page Next Page 
69 సర్దార్ పటేల్ రోడ్ పేజి 2

 

    "కొంత మంది ఆడాళ్ళ కిది భాగావంతుడిచ్చిన వరమండీ! నలుగురు పిల్లలూ, నలబై అయిదేళ్ళు వయసొచ్చినా పాతికేళ్ళ పిల్లలా కనబడతారండీ! అన్నాడు నటరాజ్ పొయ్యి మీద మాడిపోటానికి సిద్దంగా వున్న కూరను పెద్ద ఎత్తున రక్షించేందుకు సన్నాహాలు చేస్తూ.
    సీతకు నటరాజ్ రిమార్క్ మరింత చిరాకు కలిగించింది.
    "నువ్ నోర్మూసుకుని వంటపని చూసుకో"
    ఇలా మాటలతో ఆమెను శాంతపరచటం కష్టమని తెలిసిపోయింది రామచంద్రమూర్తికి' చప్పున లేచి ఆమె తెచ్చిన మంచినీళ్ళ బిందె తనే మోసుకెళ్ళి కిచెన్ ఫ్లాట్ ఫారం మీద పెట్టాడు. ఆ తర్వాత తను వచ్చి ఆమె కెదురుగా నిలబడ్డాడు.
    "మేడమ్ ! మీ ముఖ సౌందర్యానికి వర్చస్సుకీ కారణం ఏమిటి చెప్పగలరా?" అన్నాడు జర్నలిస్ట్ ప్రశ్నించే ధోరణిలో.
    "పక్కింటి ఉమాదేవిగారితో పోటీపడటమేనండీ" అందుకున్నాడు నటరాజ్.
    ఆమె చుర చుర చూసేసరికి రామచంద్రమూర్తి నటరాజ్ వేపు చూశాడు.
    నటరాజ్ కంగారుపడినా చప్పున తేరుకుని -
    "ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని" అని పాడేస్తూ వంటపనిలో మునిగి వున్నట్లు ఓవరాక్షన్ చేశాడు.
    "ఆ పంపు ఇంకా భుమిలోపలకు తవ్వి పెట్టాలండీ అని ఆరునెలల నుంచి మొత్తుకుంటున్నా! ఇంతవరకూ పట్టించుకున్నారా దాని సంగతి?" రుసరుసలాడుతూ అందామె.
    "ఓ కూలిని పెట్టి ఇంకా కిందకు తవ్వించి పెట్టమని నీకు చెప్పానుగా నటరాజూ? ఇంకా చేయించాలేదా ఆ పని.....? నటరాజ్ ని నిలేస్తూ అన్నాడు రామచంద్రమూర్తి.
    నటరాజ్ కి అర్ధమయిపోయింది. సీతమ్మ కోపం నుంచి తప్పించుకోడానికి కావాలని తన మీదకు నెడుతున్నాడని!
    "అదాండీ! ఇంకా లోతుకి తవ్వించవచ్చు గానండీ! మనని చూసి చుట్టుపక్కల వాళ్ళూ, చుట్టూ పక్కలవాళ్ళను చూసి మనం అలా తవ్వుకుంటూ వెళ్లిపోతే చివరకు భూమి అవతలి వేపున్న పరాయి దేశంలోకి చొచ్చుకుపోయే ప్రమాదం వుందండీ! మన కార్పోరేషన్ పంపులు అలా వాళ్ళ దేశంలో కొస్తే మరి వాళ్ళూరు కోరు కదండీ......! మన పంపునీళ్ళు ఆ దేశం మీద కొంచెం చిలికినా చాలు' ఆ పోల్యుషన్ తట్టుకోలేక మొత్తం ఆ దేశస్తులందరూ క్షణాల్లో పిట్టల్లా చచ్చిపడిపోతారండీ..." వినయంగా చెప్పాడతను.
    సీతకు అతని ధోరణి మరింత కోపం కలిగించింది.
    "ఇదిగో! మేమిద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో వాగావంటే బుర్ర రామకీర్తన పాడిస్తాను జాగ్రత్త!" అంది రోషంగా.
    నటరాజ్ తగ్గిపోయాడు.
    ఆమెకు కోపం ఎక్కువయిందంటే నిజంగానే బుర్ర రామకీర్తన పాడిస్తుంది.
    రామచంద్రమూర్తి లేచి డ్రస్ మార్చుకోసాగాడు.
    "ఎక్కడికి?" అడిగిందామె కుతూహలంగా.
    "ఇంట్లో అలా గ్రామ ఫోన్ వింటూ కుర్చోకపొతే ఏదయినా ఉద్యోగం దొరుకుతుందేమో ప్రయత్నించకూడదూ !" అంటూ రోజూ గొడవ పెడుతున్నావ్ కదా! అందుకని ఉద్యోగ వేట కేళ్తున్నాను."
    అతని మాటలు ఎందుకో సీతకి కొంచెం బాధ కలిగించాయి.
    అతనిని ఉద్యోగం చేయమని తనే బలవంత పెడుతున్నట్లుంది ....అతనికి యిష్టం లేకపోయినా!
    "అవును! మీ సంపాదన నేను కట్టుకుపోదామనీ....." కోపంగా అంటూ వంటగదిలో కెళ్ళి ఫ్లేట్ లో వేడి ఉప్మా తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీదుంచింది.
    "త్వరగా తీసుకోండి. చల్లారిపోతుంది."
    రామచంద్రమూర్తి కిటికీ దగ్గరకు నడిచి రోడ్ వేపు చూసి ఆత్రుతగా ఆమెను పిలిచాడు.
    "సీతా! త్వరగా రా! అర్జెంట్! అదిగో .....ఆ నైట్ చీర కట్టుకున్న అమ్మాయే ఆ చివరింటి మోహన్రావ్ తో ప్రేమ కలాపాలు సాగిస్తోంది....."
    సీత వడివడిగా కిటికీ దగ్గరకు నడిచి తనూ రోడ్డు వేపు చూసింది.
    "ఏడ్చినట్లుంది! ఆమె మోహనరావ్ భార్యేగా?" అంది చిరాకుగా.
    "కాదని ఎవరన్నారు? అంటే వాళ్ళిద్దరూ భార్య భర్తలు కాకపోతే ఆసక్తి వుంటుందన్నమాట! అంతేనా?" నవ్వుతూ అడిగాడు.
    "చాల్లెండి! అతితెలివి.....' చిరుకోపంతో అని పెరట్లో కెళ్ళిపోయింది సీత.
    అతను ఫలహారం చేయటం ముగించేసరికి నటరాజ్ కాఫీ తీసుకొచ్చి అందించాడు.
    "మీరూ, సీతమ్మగారూ ఊరికే ఉబలాడపడిపోతున్నారు గానీ మీ లాంటి ప్రభుత్వద్యోగులకు ప్రైవేట్ కంపెనీల వాళ్ళెవరూ ఉద్యోగాలివ్వరండీ!" ఖండితంగా చెప్పాడతను.
    "ఎందుకంటావ్?" రోషంగా అడిగాడు రామచంద్రమూర్తి.
    "గవర్నమెంటు ఉద్యోగులకు పని చేయటం ఏమాత్రం అలవాటు వుండదు కదండీ! వీళ్ళను పెట్టుకుంటే వాళ్ళు దివాలా తీయాల్సిందేనండీ. కావాలంటే పబ్లిక్ సెక్టర్ చూడండో సారి.....! వేలకోట్లు మునిగి పోతున్నాయి."


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS