Previous Page Next Page 
ఆఖరి ఘడియలు పేజి 2


    భవానీశంకర్ చకచక ఆలోచించ సాగాడు. ఈ స్మిత అంటీ ఎవరో ఎంత ఆలోచించినా అర్ధం కావటం లేదతనికి.
    బహుశా తులసి తల్లి వేపు అమ్మాయి గాని తండ్రి వేపు అమ్మాయి గాని అయుండాలి. అయినా ఆ పిల్లకు తను ట్యూషన్ లో ఏం చెపుతున్నాడో ఆన్న విషయంతో  ఏమిటి సంబంధం?
    "అల్ రైట్ డియర్! మీ స్మితా ఆంటీకి నేను నమస్తే చెప్పానని చెప్పు. ఇంక ఇంటికేళ్ళు" ఆమె భుజం తట్టి బయటకు పంపాడు తను.
    కొద్దిసేపు అక్కడే కూర్చుని "స్మితా అంటీ" అనే పేరు గురించి కొద్దిసేపు ఆలోచించాడు గానీ ఏమీ తట్టలేదు. ఓసారి తులసి వాళ్ళింటికి వెళ్ళి చూద్దామా అనుకున్నాడు గానీ అదంతగా తెలివితేటలు గలవాళ్ళు చేసేపని కాదని మళ్ళీ ఆ ఆలోచన విరమించుకున్నాడు. అతనలా ఎంత సేపు మోకాళ్ళ మీద కూర్చుని శూన్యంలోకి చూస్తూ గడిపేవాడో గాని హటాత్తుగా ఎదురుగ్గా ఓ పొడగాటి ఆకారం కనిపించే సరికి చటుక్కున స్పృహలోకి కొచ్చి ఆ ఆకారం వేపు పరీక్షగా చూశాడు.
    స్పోర్ట్స్ సైకిల్ మీద ఠీవిగా కూర్చుని సైకిల్ కి ఓ బాగ్ తగిలించుకుని వున్నడతాను. అతడి నెత్తిమీద ఓ హెల్మెట్.
    "ఏమిట్రా ఆ చూపులు. కళ్ళు బైర్లు కమ్మినయా ఏమిటి?" నవ్వుతూ అడిగాడు సైకిల్ వాలా.
    "హలో హలో హలో కామ్రేడ్ శ్యామ్. నీ అవతారం సెంట్ పర్సెంట్ మారిపోయింది బ్రదర్. ఆ శిరచ్చేదాస్త్రణం వల్ల అన్నట్లు సైకిల్ వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవాలని పోలీస్ రూలేమయినా వచ్చిందా బ్రదర్?"
    శ్యామ్ సైకిల్ స్టాండ్ వేసి గదిలో కొచ్చాడు.
    "ఆ రూల్ ఇంకా రాలేదనుకో. కానీ రావటం ఎంత సేపు బ్రదర్! హెల్మెట్ కంపెనీల వాళ్ళు ప్రభుత్వాన్ని మరికొంత మేపితే చాలు హటాత్తుగా రేడియో న్యూస్ వచ్చేస్తుంది. ఆ గొడవ సరేగాని ఇవాళ మధ్యాహ్నం మనింటికి లంచ్ కి రావాలి బ్రదర్ నువ్వు."   
      భవాని శంకర్ ఆనందంతో పొంగిపోయాడు.
    "లంచ్ కా? లవ్ లీ అయిడియా కామ్రేడ్. బ్యూటీ ఫుల్ ప్లాను, అవును, వదినమ్మ ఎందుకింత దయతలచిందంతావు నా మీద?"
    "మరేం లేదు కాలేజీలో చదివిన వాళ్ళ క్లాస్ మేట్ ఎవర్నో లంచ్ కి పిలిచిందట నేనూ మా బాస్ ని లంచ్ కి పిలిచాను. వాడితో మనక్కొంచెం పని వుందిలే. మన ఉద్యోగం పర్మనెంట్ చేస్తాడేమోనని మస్కా కొడుతున్నాను. సరే ఎలాగూ పెద్ద ఎత్తున లంచ్ కార్యక్రమం జరుగుతుంది కదాని నిన్ను...."
    "థాంక్ యూ బ్రదర్! వదినమ్మ చేతివంట తిని చాలా కాలమయింది. నా అంతట నేనే "ఎటాక్" చేద్దామని అనుకుంటున్నాను. నువ్వోచ్చేశావ్- బైదిబై చికెన్ పకోడా, కాలీఫ్లవర్ కర్రీ - ఈ రెండూ మాత్రం వోదినమ్మ అమృత హస్తాలతో ఏర్పాటు చెయ్యాలని చెప్పు -"
    "సరే వస్తా." బయటకు నడిచి మళ్ళీ సైకిల్ ఎక్కడతను. "పదకొండు గంటలకల్లా వచ్చేశాయ్.వెధవ తిరుగుడులు తిరిగి రెండింటికి చేరుకున్నవంటే నువ్వే విచారించాల్సి వస్తుంది..."
    "అల్ రైట్ బ్రదర్. పదకొండు వరకూ ఎందుకు" ఇప్పుడే బయలుదేరతాను."
    "నేను చికెన్ తేవడానికి వెళుతున్నాను."
    "మంచి అలవాటు బ్రదర్ కీపి టప్."
    శ్యామ్ వెళ్ళిపోయాడు.
    భవానీ శంకర్ మరోసారి అద్దం ముందు నిలబడి ట్యూన్ నెంబర్ త్రీ చాలా మెల్లగా బయటకు వినిపించనంత మెల్లిగా ఆలపిస్తూ తల దువ్వేసుకున్నాడు.
    డ్రస్ మార్చుకుని తను ఇంటర్వ్యు ల కోసం ప్రత్యేకంగా దాచుకున్న కాస్టుమ్స్ వేసుకుని టైం చూసుకున్నాడు. తొమ్మిదిన్నర అవుతోంది.
    తలుపు తాళం వేసి రోడ్ మీద కొచ్చాడు. రోడ్ మీద ఫోటో స్టూడియో కుర్రాడు అతనిని చూచి చిరునవ్వు తో విష్ చేశాడు.
    "నమస్కారం సార్."
    "నమస్తే బ్రదర్! హౌ ఈజ్ లైఫ్ బ్రదర్?" స్టూడియో లోకి నడిచి కుర్చీలో కూర్చున్నాడు.
    "లైఫ్ ఇంకెలా వుంటుంది సార్? కాసేపు పాజిటివ్, కాసేపు నెగటివ్ - మధ్యలో ప్రింట్లు.
    "కరెక్టు బ్రదర్. ఒండర్ ఫుల్ డిస్క్రిప్షన్ ! బైదిబై నువ్వింతకు ముందు తెలుగు సినిమాలో యాక్ట్ చేశావా ఫ్రెండ్! ఎందుకంటే ఇలాంటి డైలాగులు ఎక్కడో తెరమీద విన్నట్లు గుర్తు."
    "లేద్సార్! ఇవి మన సొంతం! మీకు తెలీదనుకుంటాను. నేను నాటకాలు రాస్తుంటాను. మొన్న శ్రీరామనవమికి మా ఊళ్ళో జవార్ పేట సెంటర్లో వేసిన "కాటేసిన వర్గం" నాటిక ఎవరిదనుకుంటున్నారు" నాదే!"
    "టెరిఫిక్ ఎచీవుమెంట్ బ్రదర్! బైదిబై మన ఫోటోల సంగతేమీ చేశావు బ్రదరూ! ప్రూఫ్ లు తీశావా?"
    "ఓ - తీశాన్సార్" అంటూ డ్రాయర్ లో నుంచి ఓ పాకెట్ తీసి ముందుంచాడు.
    భవానీ శంకర్ ఒకటొకటి చూడసాగాడు. మొదటి ఫోటో  తన ప్రియమైన శిష్యురాలు తులసిది. రెండోది రాజేశ్వరి, జానకి , శ్రీవల్లి, కలిసి దిగింది. మూడోది టైగర్ ది!
    "అన్నీ బ్రహ్మాండంగా వచ్చేయ్ సార్! మీరెప్పుడూ తీసినా ఒక్కటి కూడా పాడవదు. లైటింగ్, డిస్టెన్స్, అన్నీ పర్ ఫెక్టుగా ఉంటాయ్."
    "థాంక్స్ బ్రదర్! ఈ విషయం నువ్ చెపితే ఏం లాభం మిగత ప్రేక్షకులంతా చెప్పాలి. అప్పుడు గాని ది గ్రేట్ ఫోటో గ్రాఫర్ గా వెలిగిపోము. అల్ రైట్ బ్రదర్ అన్నీ కార్డ్ సైజు ప్రింట్లు వేసేయ్ - రేపు సాయంత్రం వస్తా ........" అతని మాట పూర్తీ కాకుండానే పన్నీటి జల్లు కురిసింది.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS