Previous Page Next Page 
పగలే వెన్నెల పేజి 2

   
    
    మిఠాయికొట్టులో అన్నీ తీపిపదార్దాలే వుంటాయి. వాటిలో వెరైటీ లుంటాయిగానీ అన్నీ స్వీట్లే. అట్లానే ప్రబంధాలు కూడా మిఠాయికొట్లు లాంటివి. కామన్ అయినది శృంగారం. కథలు వేరైనా శృంగారం ఒకటే.  వరూధినీ ప్రవరాఖ్యం నుంచి అన్నీ శృంగారప్రధానమే. ఎవరో  తన దగ్గరికి వస్తున్నట్టు అన్పించడంతో సురేష్ కళ్లు మరింత సాగదీశాడు. వస్తోంది అతని దగ్గిర పనిచేసే బాబు. "ఏమిట్రా? నా కోసమేనా?"


    "ఆఁ అయ్యోరొచ్చాడు - మీకోసం  చూస్తున్నాడు."


    "నాకోసం ఎందుకురా - మామూలుగా చేసే తతంగం అంతా పూర్తి చేసేయమని చెప్పు."


    "మీరు రావాల్సిందేనంట."


    బాబు ముందుకు వెళుతుంటే అతనూ వెనకే అడుగులేశాడు. అప్పటి  వరకు  గోలగోలగా వున్న ఆ ప్రాంతం అతన్ని చూడగానే  కాస్తంత సద్దుమణిగింది.


    "పూజ ప్రారంభిస్తాను" అయ్యవారు వినయవిధేయతలతో అడిగాడు. "ఆఁ ఒక్కమాట" అంటూ వెళుతున్న ఆయన్ని పిలిచాడు సురేష్ వర్మ.


    " చెప్పండి."


    "పూజ పూర్తికావాలంటే ఎంతసేపు పడుతుంది?"


    "సుమారు గంట"


    "అంత సేపొద్దు - పూజ మొత్తం ఓ అరగంటలో ముగించెయ్ - దక్షిణ రెట్టింపు ఇస్తాను" అన్నాడు.


    అయ్యవారి ముఖంలో ఆనందం చిమ్మింది.


     "అలాగే - మీరు కోరినట్టే."


    అయ్యవారు గదిలోపలికి వెళ్లాడు.


    అంతలో సురేష్ కూర్చోవడానికి ఎదురింట్లోంచి  ఓ ప్లాస్టిక్ కుర్చీ తెచ్చి వేశాడు బాబు. పందిట్లో  ఓ మూలకు దాన్ని జరిపించి, కూర్చున్నాడు సురేష్ వర్మ.


    ఆ రోజు శ్రీరామనవమి. దేవుళ్లూ, దెయ్యాల మీద నమ్మకం లేకపోయినా అతను గత ఐదేళ్ళనుంచి ఈ వేడుకను జరిపిస్తున్నాడు.


    వేసవికాలం ఊరుఊరంతా నవమిరోజున గుడి దగ్గరికి రావడం - వెన్నెల్లో అందరూ కలిసి ఆనందంగా గడపడం, చివరికిగుగ్గుళ్లు పెట్టించుకుని తింటూ యింటికెళ్లడం, యివన్నీ బావుంటాయి గనుకే అతనూ తాత ముత్తాతల నుంచి వస్తున్న నవమి ఉత్సవాలను జరిపిస్తున్నాడు.


    మొదటిరోజు ఉభయదాత అతనే. ఆ రోజు  దేవుడి అలంకరణ మొదలుకొని గుగ్గుళ్లు, పందారం  వరకు ఖర్చంతా అతని కుటుంబానిదే.  మొత్తం పద్నాలుగు రోజులు నవమి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి.  చివరి రోజు దేవుడి ఊరేగింపు. రోజుకొకరు ఉభయదాత.


     తొలిరోజు ఉత్సవం తనది కాబట్టి సురేష్ వర్మ దేవాలయ పరిసరాలన్నిట్నీ శుభ్రంచేయించాడు. గుడికి వెల్ల చేయించాడు. పోయిన బల్బుల స్థానే కొత్తవి ఏర్పాటు చేశాడు. టేప్ రికార్డర్, స్పీకర్లనూ రిపేరు చేయించాడు.


    కొత్తకొత్తగా కన్పిస్తున్న  ఆ దేవాలయం  వెన్నెల్లో దంతంతో చేసిన  రథంలా వుంది. అందులోని  శ్రీరాముడు రథంలో ఊరేగుతున్న రాజకుమారుడిలా వున్నాడు.


    తొలిరోజు కాబట్టి ఊర్లోని జనం బాగానే  వస్తున్నారు. పోగాపోగా గుగ్గుళ్ల పందారానికి తప్ప ముందు జరిగే భజనలకి ఒక్కరు కూడా రారు.  ప్రసాదం పెడుతున్నారని  తెలిసినప్పుడే పరుగు పరుగున  దూకుతారు.


    అందులోనూ తొలి ఉభయం  సురేష్ వర్మది. కాబట్టి, వెళ్లకుంటే  బావుండదన్న ఉద్దేశ్యంతో కూడా అందరూ విధిగా దేవాలయం దగ్గరికి వస్తున్నారు.


    ప్రస్తుతానికి సురేష్ వర్మ, కుటుంబం ఆర్దికంగా వెనకపడినప్పటికీ పేరు ప్రతిష్టల్లో మాత్రం ఆ మండలంలో  నెంబర్ వన్.  అతని తాత సుబ్బరాయవర్మ. అప్పట్లోనే  కుబేరుడు.  ఆ తర్వాత  అతని కొడుకు నారాయణవర్మ స్వాతంత్ర్య సమరంలో ప్రముఖపాత్ర  వహించాడు. స్వంత ఆస్థుల్ని   సైతం ధారబోశాడు.


    ఆ తర్వాత కూడా ఆయన నీతి నియమాలకి కట్టుబడ్డాడుగానీ ఆస్థుల్ని సంపాదించడానికి కాదు.


    ఆయనకి ముగ్గురు పిల్లలు. పెద్దవాళ్లు ఇద్దరూ కూతుర్లు, మూడో వాడు సురేష్ అమ్మాయిలకి పెళ్ళిళ్ళు చేయడానికి చాలా ఆస్థుల్నే అమ్మాల్సి వచ్చింది. అయినా ఇప్పటికీ ఆ ఊర్లో భూస్వాములు వాళ్లే.


    అయితే భూములే ఆధారం కావడంవల్ల  ఆదాయం పెద్దగా రాదు. భూములున్నాయన్న మాటేగాని వాటివల్ల పొంగిపొర్లిపోయే రాబడి మాత్రం లేదు. సురేష్ వర్మకు వ్యవసాయమంటే ఇష్టం. యూనివర్శిటీలో ఎమ్. ఏ. చదివాక యింటికొచ్చి వ్యవసాయం చూసుకునేవాడు.


    "వాడొక్కడు. ఉద్యోగం సద్యోగం అంటూ వాడ్ని నా కళ్ల ముందునుంచి మాయంచేయకండి" అని అతని తల్లి అనసూయమ్మ కూడా వంతపాడడంతో నారాయణవర్మ కూడా మరోమాట చెప్పలేకపోయాడు.


    తన అక్కయ్యల పెళ్లిళ్లు చేయడం దగ్గర్నుంచి రోజువారీ వ్యవసాయం పనుల వరకు నారాయణ వర్మకి సురేష్ చేదోడు వాదోడుగా వుండేవాడు.


    అయిదేళ్ళక్రితం ఆయన కాలం చేశాక మొత్తం భారమంతా సురేష్ వర్మపైనే పడింది. అతను నిజంగానే చాలా డిఫరెంట్ మనిషి. అప్పటి తన సహచరుల్లాగా బోళామనిషి కాదు. ఏదైనాసరే గాఢంగా కోరుకునే వ్యక్తి. పైపై మెరుగులు కాక లోతుల్ని తరచిచూసేవాడు.


    కాబట్టి ఏ విషయంలోనైనా అతని అభిప్రాయాలూ, అభిరుచులూ విభిన్నంగా వుండేవి.


    తండ్రిపోయిన తరువాత అప్పులన్నిటినీ తీర్చెయ్యడం లక్ష్యంగా పెట్టుకున్నాడు. అక్కయ్యల పెళ్ళిళ్ళ నిమిత్తం చాలనే, ఖర్చయింది.'మోసం  - దగాలేని వృత్తి వ్యవసాయం ఒక్కటే అనిపించింది' అని వ్యవసాయం ప్రారంభించాడు. తండ్రి అమ్మెయ్యగా మిగిలింది అప్పటికి దాదాపు ముప్పై ఎకరాలు. అదిగాక ఐదెకరాల మామిడితోటుంది. ఆ ముప్పై ఎకరాల్లో రకానికి ఒకటిచొప్పున పంటలు వేయడం ప్రారంభించాడు. కూరగాయల తోటలు, పూలతోటల్ని వేశాడు.


    మొదటి మూడు సంవత్సరాలకే అప్పులన్నీ తీర్చేశాడు. ఇక ఆ తరువాత వచ్చే రాబడినంతా  భూముల అభివృద్దికి ఖర్చు పెట్టాడు. కష్టాల్లో వున్నవాళ్లకి వీలైనంతగా సహాయం చేస్తుంటాడు. అందుకే ఆ వూర్లో అతనికి మంచి పేరుంది. ఆ పల్లెటూరికి రెండు కిలోమీటర్ల దూరంలో ఓ టౌన్ వుంది. రోజూ సాయంకాలం బాబును తీసుకుని టౌన్ కి వెళుతూంటాడు.


    అతనికి ఇష్టమైనవి రెండే విషయాలు. ఒకటి చదవటం,  రెండు సిగరెట్లు కాల్చడం. టౌన్ కి వెళ్ళి కొత్తగా వచ్చిన మ్యాగజైన్లు, నవలలు కొనుక్కుని తిరిగి వస్తూంటాడు.


    తీరిక దొరికినప్పుడు పుస్తకం పట్టుకుని చదవటం తప్ప మరొకటి చేయడు.


    అనసూయమ్మ  కొడుకు ప్రయోకత్వాన్ని చూసి తనలో తనే మురిసిపోతుంటుంది. ముప్పై ఏళ్లొచ్చినా అతను ఇంకా పెళ్ళి చేసుకోలేదన్న బాధ తప్ప, కొడుకు మీద ఆమెకు ఎటువంటి అసంతృప్తి లేదు.


    "చేసుకుంటానులేవే - ఏ అమ్మాయిని చూసినా యింత వరకు పెళ్ళి చేసుకోవాలన్న ఆలోచన కలగలేదు. నేనేం చేయను చెప్పు" అని అతను తల్లికి సర్దిచెపుతుంటాడు.


    నిజంగానే అతన్ని స్పందనకు గురిచేసే అమ్మాయి ఎక్కడా ఇంతవరకు తారసపడలేదు.


    అయ్యవారు పూజ అంతా అయిన తర్వాత చివరగా మంగళ హారతి పట్టుకొచ్చాడు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS