Previous Page Next Page 
వెన్నెల వొణికింది పేజి 2


    చిన్మయిలో ఓ ప్రత్యేకమైన గుణం వుంది. ఎవరైనా మనుషులు ఆమెకి నచ్చకపోతే అటువైపు తొంగయినా చూడదు. వాళ్ళని బలవంతంగా భరించదు. "అదంత మంచి పద్దతికాదు. సొసైటీలో కొందర్ని బలవంతాన భరిస్తూ వుండాలి. అది నాగరికతలో ఒక భాగం" అనేవాడు రాజీవ్.
    
                                                             * * *
    
    రాజీవ్ అద్దెకుంటున్న ఇంటిదగ్గర చిన్న కాలనీలా ఏర్పడి చుట్టుప్రక్కల ఏడెనిమిది ఇళ్ళదాకా వున్నాయి.
    
    ఎదురుగా భవానీపతిరావు అద్దెకుంటున్నాడు. ఇటుప్రక్కన కళ్యాణచక్రవర్తి, అటుకేసి నిఖిలేశ్వర్.
    
    నిఖిలేశ్వర్, అతని భార్య మంజుభార్గవి చాలా అన్యోన్యంగా వున్నట్లు కనబడతారు. వాళ్ళ ఇంటికి స్నేహితులూ, పరిచయస్థులూ రావడం ఎక్కువే. వారానికో పదిరోజులకో వాళ్ళింట్లో ఏదో వంకన ఓ పార్టీ జరుగుతూ వుంటుంది.
    
    మంజుభార్గవి భర్త స్నేహితులతో చాలా సోషల్ గా మాట్లాడుతూంటుంది. వాళ్ళతో కలిసి పేకాడుతూ కూడా వుంటుంది. వాళ్ళు డ్రింక్స్ తీసుకుంటూంటే చిప్సూ వగైరాలు సర్వ్ చేస్తూ వుంటుంది. ఇవన్నీ కూడా చిన్మయి కళ్ళబడ్డాయి. ఆమె మంజుభార్గవిని మనసులో ఎంతో ఏవగించుకుంది.
    
    మంజుభార్గవి చొరవగా కల్పించుకుని చిన్మయి దగ్గరకు వస్తూ వుండేది. "నువ్వు బయట ప్రపంచంలో ఇష్టంలేకపోతే మూవ్ అవకు, యిరుగు పొరుగు వారితో కలసి వుండు. లేకపోతే నీకు గర్వం అని అపార్ధం చేసుకునే అవకాశ ముంది" అని ఆమెకు రాజీవ్ నచ్చజెప్పాడు. అందుకని ఆమె వాళ్ళతో కొంత వరకూ మాట్లాడుతూ వుండేది.
    
    "చిన్మయిగారూ! మీ హజ్బెండ్ డ్రింక్ చెయ్యరా?" అనడిగింది మంజుభార్గవి.
    
    "చెయ్యరు."
    
    "ఎందుకని?"
    
    "ఆయన కిష్టంలేదు."
    
    "ఆయన కిష్టంలేదా? మీకిష్టంలేదా?" అని నవ్వుతూ అడిగింది.
    
    "ఇద్దరకూ ఇష్టంలేదు."    
    
    "ఆయన స్మోకింగ్ చేస్తారా?"
    
    "చెయ్యరు."
    
    "కార్డ్స్ ఆడతారా?"
    
    "ఆడరు."
    
    "మరి మీ ఇద్దరికీ టైంపాస్ ఎలా అవుతూ వుంటుంది?"    

    "ఇద్దరం కలసి కబుర్లు చెప్పుకుంటూ వుంటాం. కలిసి బయటకు వెళుతూ వుంటాం."
    
    "కేవలం అలా చేసినందువల్ల టైంపాస్ అవుతుందా? జీవితంలో థ్రిల్ ఉండనక్కరలేదా?"
    
    "మేమిలా వుండటం మాకు థ్రిల్లింగ్ గానే వుంటుంది."
    
    మంజుభార్గవి నవ్వింది. "మీరేం పోగొట్టుకుంటున్నారో కొన్నాళ్ళయాక తెలుస్తుంది" అన్నది.
    
    "నాకు తెలిసిన సత్యం ఎన్నటికీ చెదరదు" అన్నది ఆత్మవిశ్వాసంతో చిన్మయి.
    
                                                              * * *
    
    కళ్యాణచక్రవర్తి భార్యపేరు ఆనంద. మనిషి రూపవతే మాట ఎప్పుడూ గయ్ గయ్ మంటూనే వుంటుంది.
    
    ఆమె కళ్ళలో, చూపులో, ప్రవర్తనలో, నడవడికలో అణువణువునా అహం తొంగిచూస్తూ వుంటుంది. ఆమెకు మిగతావారికన్నా అతీతురాలినన్న భావం వళ్ళంతా ప్రాకివుంది. తాను తప్ప ప్రపంచంలో అందరూ తప్పులు చేస్తూ వుంటారని గాఢంగా నమ్ముతుంది. తన వ్యక్తిత్వంమీద, అభిప్రాయాలమీద ఆమెకు ప్రగాఢమైన విశ్వాసముంది. మనుషుల్లో ఏ గుణమూ ఆమెకు నచ్చదు. ఇతరులకి నచ్చని వాటిల్లో ఆమెకు అపురూపమైన గొప్పతనం కనిపిస్తూ వుంటుంది. చాలా మంచివాళ్ళలోకూడా ఆమెకు చాలా బలహీనతలు కనిపిస్తూ వుంటాయి. అసలామెకు యితరుల మంచితనంమీద సదభిప్రాయం లేదు. ప్రపంచంలో తాను ఒక్కతే మంచిది. కరెక్టుగా ఆలోచిస్తుంది. ఇతరులంతా వక్రంగా ప్రవర్తిస్తూ ఆలోచిస్తూ వుంటారు. తనకిష్టంలేని వాళ్ళని చాలా బలహీనంగా చూస్తుంది. మెత్తగా సౌమ్యంగా మాట్లాడే వాళ్ళంతా తడిగుడ్డలతో గొంతుకోసేవాళ్ళని ఆమె ఉద్దేశం.
    
    ఆమె భర్తని ఎప్పుడూ చెండుకు తింటూ వుంటుంది. తన మూడ్స్ ప్రకారం అతను నడుచుకుంటూ ఉండాలి. ఇతరులెవరితోనైనా నవ్వుతూ మాట్లాడితే ఆమెకు వళ్ళు మండిపోతూ వుంటుంది. తనతో తప్ప అతనెవరితో ఆప్యాయంగా మాట్లాడకూడదు. తనముందు ఇంకొకర్ని పొగడకూడదు. పాపం అతను చాలావరకూ భార్య యిష్టప్రకారమే నడుచుకునేందుకు ప్రయత్నించేవాడు. కాని అప్పుడప్పుడు నోరుజారిపోయి ఏదో అనేస్తూ వుండేవాడు. వెంటనే నిప్పంటుకున్నట్టయి పెద్ద రగడ జరిగిపోయేది.
    
    చిన్మయి ఆ కుటంబ వ్యవహారమంతా గమనిస్తూవుండేది. స్త్రీకి అవసరానికి మించిన స్వాతంత్ర్యం, స్త్రీ దగ్గర అతి మంచితనం యీ రెండూ వుంటే వచ్చే నష్టాలేమిటో ఆ కుటుంబాన్ని చూసి తెలుసుకుంది. ఆమెకు కళ్యాణచక్రవర్తిని చూస్తే జాలేసేది. ఎప్పుడైనా దగ్గరకు పిలిచి "ఎందుకు నీ పెళ్ళాన్ని ఆ చెంపా ఈ చెంపా వాయించి ఓ మూల కూచోబెట్టవు?' అని అడగాలనిపించేది. స్త్రీని మరీ అంత సుఖానికీ, స్వేచ్చకూ వదిలిపెట్టినా, అదుపులో పెట్టకపోతే సంసారాలు భ్రష్టుపట్టిపోతాయనిపించింది. కాని సహజంగా శాంతగుణం, సౌమ్యత కొంత లోపల వుండాలి. లేకపోతే ఆ చెంపా ఈ చెంపా వాయించినంత మాత్రాన ఆడది ఆగుతుందా? ఎందుకుంటుంది? సంసారాన్ని రచ్చకీడుస్తుంది. నోటికి హద్దూ పద్దూలేని ఆడదయితే భర్తని దోషిలా సమాజం ముందు నిలబెడుతుంది.
    
                                                               * * *
    
    భవానీపతిరావు యింట్లో అంతా ఇంకోరకం. భార్యభర్తలకు క్షణం పడదు. ఎప్పుడూ ఒకరినొకరు సాధించుకుంటూ వుంటారు. మాటలతో దారుణంగా హింసించుకుంటూ వుంటారు. కోపం పట్టలేనప్పుడు అతని భార్య అరవిందను నాలుగు తగిలిచ్చేవాడు కూడా. అతను తగిలిచ్చిన కొద్దీ ఆమె రెచ్చిపోతూ వుండేది. ఇద్దరూ ఘోరంగా ఒకరినొకరు హింసించుకునేవారు. నా విలువ మీకు తెలియదు...' అని ఆమె అరిచ్చెప్పేది. 'నా విలువ నువ్వు తెలుసు కోవటంలేదు' అని అతనంతకంటే గట్టిగా అరిచేవాడు. 'నే వెళ్ళిపోతాను యిక్కడ్నించి' అనేది. 'వెళితే వెళ్ళవే విడాకులిచ్చిపారేసి మళ్ళీ పెళ్ళి చేసుకుంటాను' అనేవాడు గట్టిగా. "ఓహో! అదా నీ ప్లాను! నన్ను బయటకు పంపించి యింకోదానితో కులుకుదామనుకుంటున్నావేమో! నేను నిన్ను విడిచి వెళ్ళను.'


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS