Next Page 
కాంతి రేఖలు  పేజి 1


                        కాంతి రేఖలు

 

                                                                                     __మాదిరెడ్డి సులోచన


    శ్రీనివాస్. రాధిక అంతస్తులు మరచి ప్రేమించుకున్నారు. పాలేరు కొడుకు, యజమాని కూతురుల కలయికను ఎవరూ హర్షించరు. శ్రీనివాస్ మాయం అయ్యాడు.
   
     రాధిక మారుటన్న మధుమూర్తి, తండ్రి పురుషోత్తమరావుల అక్రమాలు , శ్రీనివాస్ అంతర్థానం గురించి స్వంత అన్న  అయిన సిద్దార్థకు  వ్రాసింది.

     ఇంజనీరింగ్ చదివిన సిద్దార్థ, ఎవరూ అప్పాయింట్ చేయని సి. ఐ.డి. గా పనిచేస్తాడు.అక్కడ శ్వేత  తటస్థపడుతుంది.

     ఎన్నో ఆసక్తికరమయిన విషయాలు  బయట  పడతాయి. సిద్దార్థ క్లాస్ మేట్స్ ఒకడు  బ్లాక్ మ్యాజిక్ ,మరొకడు హిప్నాటిజం నేర్చుకొని ప్రపంచాన్ని గడగడ లాడిస్తాం అనుకుంటారు.

    శ్రీనివాస్ కై వేట ప్రారంభిస్తే ఎందరో దొరికారు.  మరెన్నో విషయాలు బయటపడ్డాయి. చీకటి తొలగిపోయింది. కాంతిరేఖలు ప్రసరించాయి.

     దాదాపు రెండు దశాబ్దాలపాటు విభిన్న సామాజిక సమస్యలను ఇతివృత్తంగా చేసుకొని 70 కి పైగా నవలలు వ్రాసి  ఆంధ్ర  పాఠకుల హృదయయాలలో చిరస్మరణీయంగా నిలచిపోయిన కీ.శే. శ్రీమతి మాదిరెడ్డి సులోచనగారి చివరి నవలా కుసుమమే  ఈ

                                           'కాంతి రేఖలు'
                                          తప్పకచదవండి!



                         కాంతిరేఖలు

                                           - మాదిరెడ్డి సులోచన


    అది 'ఊందానగర్' స్టేషన్!

    ఆ స్టేషన్ దాటి బెంగుళూరు, తిరుపతి వెళ్ళే రైలుబండ్లు వెళ్తాయి కాని అక్కడ ఆగవు.

    లోకల్ ట్రైన్స్ ఆగుతాయి.

    లోకల్ ట్రైన్ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు చాలా మంది.

    కూరలు తీసుకువెళ్ళి హైద్రాబాద్ లో అమ్ముకునే వారు....

    పాలు హోటళ్ళలో వాడుక పోసేవారు.

    కాలేజీ చదువులు చదివే విద్యార్ధులు.

    స్కూళ్ళకు వెళ్ళేవారు, ఉద్యోగాలకు వెళ్ళేవారు, అందరూ ఆత్రంగా చూస్తున్నారు.

    పురషోత్తమరావు తన వదినా మరదళ్ళంచు పంచెసవరించుకుంటూ చుట్టూ చిరాకుగా చూచాడు.

    "దండం!" మంగలి ఒకతను నమస్కరించాడు.

    ఆయన గంభీరంగా తల పంకించాడు.

    "అంకుల్........అమ్మయ్య బండిరాలేదు.........." ఒగరుస్తూ వచ్చాడు రాజేష్.

    ఆయన రాజేష్ ను చూచి చిరునవ్వు నవ్వాడు.

    "మీ జీపు ఏమయిందండోయ్? ట్రైన్ కు వచ్చారు!" నవ్వుతూ అడిగాడు డాక్టర్ ఖాన్.

    "మీ వాహనం ఏమయింది! మీరు బండికి వచ్చారు!"

    "నా బండికి ఏదో రిపేర్ వచ్చింది. ఎందాక?" అన్నాడు ఖాన్. అతను ముస్లిమ్ అని పనిగట్టుకు చెబితేగాని తెలియదు. తెనాలి నుండి వచ్చే ఆ ఊర్లో సెటిల్ అయ్యాడు.

    "నేను వెళ్ళటం లేదండి. మా అబ్బాయి మద్రాసునుండి బండి దిగి, లోకల్ ట్రైన్ పట్టుకుని వస్తున్నాడు, సికింద్రాబాద్ కు జీపు తెస్తానురా అంటే వద్దు అంటాడు మొండి" అన్నాడు పురుషోత్తమరావు.
 
    "పైన్! వస్తే ఒకసారి కనిపించమనండి" నవ్వుతూ, దూరంగా ఎవరో కనిపించగానే అక్కడికి వెళ్ళాడు.
 
    "ఈయన ఓ గొప్ప ఆఫీసరు. ఈయనగార్ని చూడటానికి సిద్దార్ధ వెళ్ళాలా!" ఈసడింపుగా చూచాడు.


Next Page 

WRITERS
PUBLICATIONS