Next Page 
అరణ్యకాండ పేజి 1

                                                        అరణ్యకాండ

                                                                                                      --- కొమ్మనాపల్లి గణపతిరావు

                                                                                                     

                                                
 
                                                       చదివేముందు  ఒకమాట!

    ఒక సంఘటనని  యధాతథంగా  రాస్తే  అది వార్త అవుతుంది. దానికి  అందమైన వాతావరణాన్ని  జతచేస్తే  రచనగా  మారుతుంది. సన్నివేశాన్ని  ఫోటోగ్రాఫర్ లా ఏకరువు  పెట్టే రచయితలు  ఎందరో వున్నారు. కాని అదే సన్నివేశానికి  అందమైన  రంగులు  దిద్ది  చిత్రకారుడి సృజనాత్మకతతో  అద్భుతంగా  చెప్పే  రచయితలు  కొందరే  ఉన్నారు. అలాంటి  వారిలో  యువరచయిత  కొమ్మనాపల్లి  గణపతిరావు ఒకరు.
   
    ఇలా అనటానికి  కారణం  అతడు  తనదంటూ  సృష్టించుకున్న  ఒక చిత్రమైన  శైలి. ఇతరులకు సాధ్యంకాని శిల్ప  చాతుర్యం, వస్తువేదైనా_కధనంతో  పాఠకుడు కుస్తీ  పట్టాల్సిన  అవసరం  కలిగించడు. శైలితో  సాముగరిడీలు  చేస్తాడు. ఇది బహు కొద్దిమంది  రచయితలకు  మాత్రమే  సాధ్యం. ఈ సత్యానికి  సాక్ష్యమే "అరణ్యకాండ."

    నవల చదవక ముందు  "అరణ్యకాండ" ఇతివృత్తాన్ని  టూకీగా  చెప్పినప్పుడు  ఇది మంచి నవలగా  మారే అవకాశం  లేదేమో  అనిపించింది. అదే అన్నాను కూడా. నేను సందేహం వెలిబుచ్చానూ  అంటే వూరికే  కాదు  అని తర్జన భర్జన  చేసుకుని  వుండాలి  గణపతిరావు. మొత్తం మీద  నవల  చాలా  చాతుర్యంగా  నడిచింది!
   
    గణపతిరావు  రచనలు  చదువుతుంటే  నాకు అర్ధమైందొక్కటే.

    ఏమి రాసినా  అది వాసి కెక్కాలన్న  తపన. పాఠకులకి  ఏదో ఓ కొత్త  విషయాన్ని చెప్పాలన్న  జిజ్ఞాస. వాక్య నిర్మాణంలోను, వస్తు వైవిధ్యంలోను  భిన్నత్వం_రచనకి  ఇమడదేమో  అనిపించే  వాతావరణాన్ని  సైతం  ఆహ్లాదకంగా  మలిచి  అందివ్వగల  నేర్పు.

    ఈ నవల  నేను ప్రచురించక  పోయినా  గణపతిరావును  అభినందించకుండా  వుండలేక  పోతున్నాను.

    ఒక సామాన్యమైన  పులికి  నరమాంసాన్ని  మరిగిన రాయల్ బెంగాల్ టైగర్ కి మధ్య గల వైవిధ్యాన్ని  గుర్తించి పరిశోధించి, ఆ మేనీటర్ ను తుదముట్టించడానికి  వేటలో  అపారమైన అనుభవంగల ఫారెస్ట్ ఆఫీసరు చైతన్య వచ్చి అహోరాత్రులు ఎంత శ్రమపడిందీ, ఎంత విలక్షణమైన  ఒడుపులతో  ఢీ కొన్నదీ  చదువుతుంటే  మనం పసిపిల్లలుగా  మారిపోతాం. పరిచయంలేని  అడవి పరిసరాలు, వివిధ జంతుజాలాల  ప్రవర్తన మనకెంతటి  అబ్బురాన్ని కలిగిస్తుందంటే  ఎంత  శోధించాడీ  రచయిత అనిపించక మానదు. శాస్త్రీయమైన  ఆధారాలతో  జిమ్  కార్బెట్, కెన్నత్  ఏండర్సన్ ల నేర్పుతో  గణపతిరావు రాసిన  యీ నవల వేటపై  తెలుగులో  వెలువడిన  తొలి నవలగా  మనం  గర్వంగా  చెప్పుకోవచ్చు.

    ఇంతకు మించి  యీ నవల్లో  కనబరిచిన  తెలివి మరొకటుంది. కేవలం  వేటలో  మెళుకువల్ని  రాసుకుంటూ  పోతే  అది వ్యాసాల  సంపుటిగా మారే  ప్రమాద ముందని  గ్రహించి  బేక్ డ్రాప్ గా అందమైన కథనీ, సెంటిమెంటల్ త్రెడ్ ని మిళితం  చేశాడు.

    ఆ కథ_నవల  కెంతటి  బలాన్నిచ్చిందంటే 'నానీ' కోసం మనమూ  కలత  చెందుతాం. ఓటమిపై వేదాంత పరమైన గెలుపు  కోసం  అన్వేషణ సాగించే 'చైతన్య' ఉదాత్తతకీ  కరిగిపోతాం.

    అందుకే  ఇది మామూలు  నవలకాదు.

    తెలుగు సాహితీ  వనంలో  వాడిపోని  పూదండ_

    ఈ 'అరణ్యకాండ'.

    సాహితీ వినీలాకాశంలో  ఒక ఆశాకిరణం.

    శ్రీ కొమ్మనాపల్లి  గణపతిరావు.

            
  ఆల్ ది బెస్ట్.

                                                                                            _సి.కనకాంబరరాజు.            


Next Page 

  • WRITERS
    PUBLICATIONS