Next Page 
పాఠకులున్నారు జాగ్రత్త! పేజి 1


                       పాఠకులున్నారు జాగ్రత్త!
    
                                                      ----యర్రంశెట్టి శాయి


                        
    
    చాలా విచారంగా హోటల్లోకొచ్చి కూర్చున్న  సింహాద్రిని చూసి సర్వర్ రామనాథం ఆశ్చర్యపోయాడు. తను సింహాద్రిని సంవత్సరం నుండి భోజనం సర్వ్ చేస్తున్నాడు. కానీ ఏ రోజూ అతనింత దిగులుగా ఉండగా, చూడలేదు. ఆఖరికి వర్షాకాలంలో వరుసగా వారంరోజులపాటు రోజూ వంకాయ కూరె వండినా అతను చలించలేదు. చిరునవ్వుతో ఆ కూరను పక్కకు తోసేసి పచ్చడితోనే అన్నం తినేసేవాడు.
    అలాంటి వ్యక్తి ఇప్పుడిలా విచారంగా ఉండడం అతనికి బాధ కలిగించింది. బాధల్లో ఉన్న వ్యక్తికి ఎవరయినా కొంచెం రెండు మాటలు ధైర్యం చెప్తే చాలు- వాళ్ళు ఇట్టే ఆ విచారం నుంచి బయటపడి చిన్న పిల్లలా కేరింతలు కొడుతూ వెళ్ళిపోతారని ఓ వారపత్రికలో ప్రశ్నలూ జవాబులూ శీర్షికలో చదివాడు తను.
    అంచేత ఇప్పుడు అతనికి ధైర్యం చెప్పాలి. అతనూ ఆ బాధలన్నీ మర్చిపోయి-చిన్న పిల్లాడిలా కేరింతలు కొడుతూ ఇంటికెళ్ళాలి. బాధల్లో ఉన్న కస్టమర్ కి ఆమాత్రం సహాయం చేయడం తన ధర్మం. అదీగాక అతను తనకు చాలాసార్లు "టిప్" ఇచ్చాడు. ఓసారి మర్చిపోయి ఒకేరోజున రెండుసార్లు "టిప్" ఇచ్చాడు కూడా.
    "గురూగారూ!" పిల్చాడు రామనాథం.
    "ఊ!" అన్నాడు సింహాద్రి.
    "మీరలా దిగులుపడడం బావుండలేదండీ! కష్టాలు కలకాలం కాపురముండవు" అని మా ఫ్రెండ్ అంటే- శ్రీకృష్ణా కాపీ విలాస్ లో సీనియర్ సర్వర్ రామానుజం అంటూండేవాడు. అంచేత ధైర్యం తెచ్చుకోండిసార్! కావడి కొయ్యేనోయ్- కుండలు మన్నేనోయ్ అని పెద్దలన్నారు. అందులో ఎంత గొప్ప నిజం ఉంది...... ఒక్క నిమిషం ఆలోచించండి! కావడి విరిచిచూస్తే అందులో నిజంగా కొయ్యే ఉంటుంది. అలాగే కుండలు పగలగొట్టి చూస్తే అందులో మట్టేగా ఉండేది. కాపోతే కాల్చినమట్టి లేదా బంకమట్టి ఏదొకటి - మొత్తానికి అది మాట్టే. అంతెందుకు సార్! శ్రీనాధుడేమన్నాడు? రాసెడిది భాగవతమట రాయించెడివాడు రామచంద్రుడు- నేరాసిన.. నేరాసిన...ఏమిటో గుర్తు లేదు అది అగునట! చూశారా ఎంత అద్భుతంగా చెప్పాడో? అంచేత మీరు...."
    సింహాద్రి వాలకం గమనించిన రామనాథం తన స్పీచ్ ఠక్కున ఆపేశాడు- అతను తను చెప్పే మాటలు పిసరంతా కూడా వినడం లేదని అనుమానం కలగడంతో.
    అంచేత తను ప్రస్తుతం అతని దృష్టిని అర్జంటుగా ఆకర్షించాలని నిర్ణయించుకున్నాడు.
    "గురూగారూ!" వినయంగా పిలిచాడతనిని.
    "ఊ!" అన్నాడు సింహాద్రి.
    "నేను మీతో మాట్లాడుతున్నాను. వింటున్నారా?" అనుమానంగా అడిగాడు.
    సింహాద్రి అయోమయంగా అతని వంక చూశాడు.
    "ఏమిటన్నావు?"
    "నేను చెప్తోంది వింటున్నారా?"
    "నువ్వు  చెపుతోందా?"
    "అవునండీ!"
    "ఏమిటి చెప్పటం?"
    "అదేనండీ! ధైర్యం చెపుతున్నాను"
    "ధైర్యమా?"
    "అవునండీ! తమరికే!"
    "ఎందుకు ధైర్యం చెప్పడం?"
    "అదేనండి.... మీరు ఎంతో దిగులుగా ఉన్నారు కదా? అందుకని"
    "దిగులా?"
    "అవునండీ! అలా దిగులు పడకూడదండీ! కావడి కొయ్యేనోయ్ కుండలు మట్టేనోయ్ అని పెద్దలన్నారు చూడండి! అది గుర్తుంచుకోవాలన్న మాటండీ మనం. కష్టాలు కలకాలం కాపురం ఉండవ్ అని కూడా మా రామానుజం అంటాడండీ"
    సింహాద్రికేమీ అర్ధం కాలేదు.
    "రామానుజమా?"
    "అవునండీ!"
    "ఎవరతను?"
    "శ్రీకృష్ణా కాఫీ విలాస్ లో సీనియర్ సర్వరండి! నాకు మంచి ఫ్రెండ్"
    "అతనేమన్నాడు"
    "కావడి మట్టేనోయ్, కుండలు కొయ్యేనోయ్ అన్నమాట ఎప్పుడూ కోట్ చేస్తూంటాడండీ అతను. కష్టాలు కలకాలం కాపురం చేయవు అని కూడా అతనే అంటూంటాడండీ!"
    "ఎందుకలా అనటం?"
    రామనాథం ఉక్కిరిబిక్కిరయ్యాడు.
    "ఎందుకంటే.... అది... అలా ... అనటం ... మరి అతని మనసులోని విషయం అన్నమాటండీ అది! అదేకాదండి! ఇంకెన్నో అలాంటి మాటలు చెప్తాడండి! అది విన్నప్పుడు మనకి భలే ఓదార్పుగా వుంటుందన్న మాటండీ! మీకు తెలుసో తెలీదో ఎవరయినా సరే ఎలాంటి కష్టాల్లో ఇరుక్కున్నాసరే. అందులోనుంచి బయట పడటం చేతకానప్పుడు రామానుజం దగ్గరకెళ్తాడన్న మాటండీ"
    "ఎందుకు?"
    "అతను ఎవరి కష్టాలకు సరిపోయే గొప్ప కొటేషన్లు వాళ్ళకు చెప్పి ఓదారుస్తాడన్న మాటండి!"
    "ఎవరు ఓదారుస్తారు?"
    "అదేనండీ! రామానుజం"
    "రామానుజమా?"
    "అవునండీ!"
    "రామానుజం ఎవరు?"
    రామానాధానికి అర్ధమయిపోయింది. అతను తను చెప్పింది వినకపోవడమే కాదు తనతో మాట్లాడుతున్నది కూడా మనసు కెక్కించుకోవడం లేదు. ఇప్పుడు మళ్ళీ రామానుజం హిస్టరీ అంతా అతనికి రిపీట్ చేసినా ఆ శ్రమంతా వృథా అని తెలిసిపోతోంది.
    సరిగ్గా అప్పుడే అతనిని రక్షించడానికన్నట్లు హోటల్ మేనేజర్ వచ్చాడక్కడికి.
    "ఏం సార్! రూమ్  మారారా?" ఆప్యాయంగా సింహాద్రిని పలుకరించాడతను. సింహాద్రి అతనివంక అయోమయంగా చూశాడు.
    "రూమా?"
    "అవునండీ!"
    "ఏ రూము?"
    "ఏ రూమేమిటి? మీరు ఇప్పుడుంటున్న శివాజీనగర్ రూమ్ నుంచి మలక్ పేట్ రూమ్ కి మారుతున్నానన్నారు కదా?"
    "ఓ... అదా!" పూర్తిగా స్పృహలోకొచ్చేశాడు సింహాద్రి.
    "అవును- మారేశాను.... మారేశాను...." అన్నాడు హడావుడిగా.
    "ఇప్పుడున్న రూమెక్కడ?" అడిగాడు మేనేజర్.
    "అదే- శవం బ్రదర్స్ బ్రాందీషాపు లేదూ? దాని కెదురుగ్గా వందమీటర్లు వెళ్తే...."
    "శవం బ్రదర్స్ కాదండి శివం బ్రదర్స్!"
    "శివం బ్రదర్సా?"
    "అవునండీ!"


Next Page 

  • WRITERS
    PUBLICATIONS