Next Page 
ప్రేమ పురాణం పేజి 1

 

                              ప్రేమ పురాణం
    
                                                               ----మైనంపాటి భాస్కర్
    
                             

 

     జయచంద్ర అంటే మహా ఎలర్జీ సితారకి!
    
    సితార అసలు పేరు సీతామహాలక్ష్మి.
    
    కాలేజీలో ఆ అమ్మాయి పేరు సితారగా మార్చేశాడు జయ్ చెంద్ర.    

 

    తన మారుపేరు సితార అని ఆ అమ్మాయికి ఇవాళే మొట్టమొదటిసారిగా తెలిసింది.
    
    అందుకని జెయ్ చెంద్ర అంటే విపరీతమైన అలర్జీ పెరిగిపోయింది సితారకి. కోపంతో వెయ్యి డిగ్రీల సెంటీగ్రేడుకి పెరిగిపోయినట్లుంది ఒంటివేడి!
    
    'వీడెవడూ నాకు నిక్ నేమ్ పెట్టడానికి.....?' అనుకుంది అప్పటికి వెయ్యోసారి! 'డబ్బున్న వెధవలంతా యింతే!' అని కూడా అనుకుంది వెయ్యిన్నొక్కటోసారి!
    
    'నేను బీదదాన్ని కాబట్టేకదా నాకు నిక్ నేమ్ పెట్టాడు' అని కూడా అనుకుంది తనమీద తనే బోల్డెంత జాలిపడుతూ.
    
    కానీ-    

 

    తను ఈ మధ్య ఏ విషయమైనా సరే డబ్బుతోనే లంకెపెట్టి ఆలోచిస్తోందని, తన బీదరికమే తనకు కాంప్లెక్స్ గా మారిపోయిందనీ గ్రహించలేకపోతోంది సితార ఉరఫ్ సీతారామలక్ష్మి.
    
    పైగా-    
    
    తనకు నిక్ నేమ్ పెట్టకముందు తనని సీతారావమ్మ అని పిలిచేవాట్ట ఈ జెయ్ చెంద్ర. అదింకో అపరాధం గదా!
    
    తను సీతారావమ్మకాదు - సితారానూ కాదు. తనపేరు శుభ్రంగా సీతారామలక్ష్మి. అంతే!
    
    అయినా తన ఊసు వీడికేల!
    
    తల్చుకుంటే తనుమాత్రం వీడికి మారుపేరు పెట్టలేదా?
    
    అసలు జెయ్ చెంద్ర అంటే ఎవరు?
    
    పక్కా దేశద్రోహి గదా...! తనకి హిస్టరీలో ఎప్పుడూ బెస్టు మార్కులే!
    
    రాణాప్రతాపసింహుడికి ద్రోహం చేసిన విదేశీయులతో చేతులు కలిపిన పక్కా దేశద్రోహి జయచంద్రుడంటే!
    
    అతగాడు డబ్బు కోసమే చేసి వుంటాడా వెధవ పని! ష్యూర్...డౌట్ లేదు.
    
    డబ్బున్న వెధవలంతా ఇంతే గదా!
    
    ఆ నిక్ నేమ్ వీడికి మహా బాగా సూటవుతుంది.
    
    దేశద్రోహి! దేశద్రోహం!!! డబ్బున్న వాళ్ళందరూ దేశద్రోహులే! జెయ్ చెంద్రకి 'దేశద్రోహి' అన్న నిక్ నేమ్ అయితే పెట్టేసింది గానీ దాన్నెలా పాపులర్ చేయాలో మాత్రం అంతుపట్టలేదు 'సితార'కి.
    
    అసలు నిక్ నేమ్ ని ఎలా పాపులర్ చేస్తారు?
    
    దానికి కూడా పెద్ద నెట్ వర్క్ వుండాలి కాబోలు.
    
    ఆ నెట్ వర్క్ జెయ్ చెంద్రకి వుంది.
    
    ఆ దేశద్రోహి జెయ్ చెంద్రకి!
    
    అతని చుట్టూ ఎప్పుడూ వందమంది బలగం వుంటారు.
    
    తను వాడికా పేరు పెట్టేసినట్లు తన ఫ్రెండ్స్ తో చెప్పేస్తే చాల్దా ఏం?
    
    సింపుల్ గా నిమ్మీకపూర్ కి, రచనాకి, షీలానాయర్ కి చెప్పేస్తే పోలా?
    
    ఇంతకీ వాళ్ళు తన ఫ్రెండ్సో, అతని ఫ్రెండ్సో తనకిప్పటిదాకా అంతుపట్టలేదు.
    
    ముగ్గురూ కూడా బెల్లానికి పట్టిన చీమల్లా అతని చుట్టూ మూగివుంటారు పగలస్తమానం!
    
    వాళ్ళతో చెబితే తనని కరుస్తారు.
    
    డౌట్ లేదు.
    
    నిక్ నేమ్! నిక్ నేమ్!! నిక్ నేమ్!!!
    
    వెధవగోల!
    
    అందరికీ ఇలా నిక్ నేమ్ లు పెడతాట్ట జెయ్ చెంద్ర.
    
    ఆ శేషుగాడికేమో విశేష్ అని పేరు పెట్టేశాట్ట!
    
    విశేష్! విశేష్!!
    
    నా బొందా, నా బోలేనూ!
    
    విశేష్ ట! విశేష్!!
    
    వెధవపేర్లు! పనీ పంగూ లేకుండా.
    
    అయినా ఈ ముగ్గురు మూర్ఖుణులూ ఇప్పుడెక్కడున్నారూ?
    
    మూర్ఖుణులేమిటీ! గ్రమేటికల్ గా తప్పే అనుకో!
    
    కానీ కోపం తీరడానికి అలా అనక తప్పట్లేదు.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS