Next Page 
అర్ధచంద్ర పేజి 1


                                          అర్ధచంద్ర
    
                                                          --కొమ్మూరి వేణుగోపాలరావు
    

    
                                

 

     టీ.వీలో క్రికెట్ వస్తుంది. బెన్సన్ అండ్ హెడ్జెస్ వన్ డే ఇంటర్నేషనల్ పోటీలు ఆస్ట్రేలియాలో జరుగుతూ ఉండడంవల్ల కొన్ని లక్షలమంది జనం తెల్లవారుజమున నాలుగు గంటలకే లేచి టీవీలు ఆన్ చేసుకుని కూర్చున్నారు. ఆ లక్షలమందిలో ఓ కుంటుంబం రాజాచంద్రది.
    
    అతనికి క్రికెట్ అంటే విపరీతమైన పిచ్చి, ఎన్ని పనుల్లో ఉన్నా, ఎన్ని ఆఫీసు బాధ్యతలున్నా అవకాశాలనుబట్టి ఓ చెవి క్రికెట్ కామెంటరీ మీదో, లేక ఓ కన్ను టీ.వీ మీదో వేసి ఉంచుతాడు. అతని పోలికే అతని పిల్లలకు కూడా వచ్చింది.
    
    అలారం టైమ్ పీస్ పెట్టుకుంటే మోగటం మొదలుపెట్టగానే చేత్తో నొక్కెయ్యాలనిపిస్తుంది. అందుకే టెలిఫోను వాళ్ళకు డయల్ చేసి మూడూ ఏభై కల్లా అలారం రింగు ఇమ్మని కోరాడు.
    
    "క్రికెట్ చూడటం కోసమే కాదు సార్ మీరదృష్టవంతులు సార్ మేమింటికి వెళ్ళేసరికి సగం మేచ్ అయిపోతుంది" అన్నాడు ఆపరేటర్.
    
    అలారం టెలిఫోన్ కాల్ కు అతను లేచి పక్కకు తిరగబోయేసరికి భార్య విశారద కళ్ళు విప్పి అతనివంకే చూస్తోంది.
    
    "మెలకువగానే ఉన్నావా" అంటూ దగ్గరకు లాక్కోబోయాడు ఆమె అతని చేతికందకుండా దూరంగా జరిగింది.
    
    "నేవెళ్ళి పిల్లల్ని లేపి కాఫీ తయారుచేస్తూ ఉంటాను ఈ లోపల" అంటూ విశారద బెడ్ మీద నుంచి లేచి, గదిలోంచి బయటకు వెళ్ళిపోయింది.
    
    అంతా గబగబా లేచి హాల్లో చేరి టీ.వీ ముందు రెడీ అయ్యారు. విశారద చకచకా కాఫీలు తయారుచేసి తనూ ఓ కప్పు తెచ్చుకుని సోఫాలో కూర్చుంది.
    
    టీ.వీ.లో క్రికెట్ మేచ్ మొదలయింది.
    
    కపిల్ దేవ్ టాస్ గెలిచి ఆస్ట్రేలియన్ టీమ్ ని బాటింగ్ కి పంపించాడు.
    
    "వన్ డే ఇంటర్నేషనల్ లో ఇదో ఫ్యాషనయిపోయింది. మొదట్లో లేదు. టాస్ గెలవటం, రెండోవాణ్ణి బాటింగ్ కి పంపించటం" అన్నాడు రాఖేష్.
    
    అతను బి.కామ్. పూర్తి చేసి సి.ఎ. చదువుతున్నాడు. ఇరవై ఒకటో ఏడు నడుస్తుంది. స్మార్ట్ గా ఉంటాడు. ఈ మధ్యనే యమహ ఒకటి తండ్రి కొనిస్తే దానిమీద ఎప్పుడూ అరవై మైళ్ళ స్పీడును తగ్గకుండా తిరుగుతూ ఉంటాడు.
    
    "మనవాళ్ళు అంతకంటే ఏం చేస్తారు? ఒక్క కపిల్ దేవ్ మినహాయించి చెప్పుకోదగ్గ బౌలర్ లేడాయె. అతనికీ ఈ మధ్య వికెట్స్ సరిగ్గా రావటంలేదు. అందుకని అవతలివాడికి బాటింగిచ్చి, కొట్టుకోగలిగినన్ని కొట్టుకోనిచ్చి టార్గెట్ పెట్టుకుని ఛేజ్ చెయ్యటం అంతకు మినహాయించి గత్యంతరంలేదు" అన్నాడు మనోజ్.
    
    బి.ఎ. సెకండియర్ చదువుతున్నాడు. పందొమ్మిదేళ్ళుంటాయి.
    
    "ఒరేయ్ మీరిద్దరూ ఆగండి. కపిల్ దేవ్ బౌల్ చేస్తున్నాడు" అంది వినూత్న. బి.ఎ. ఫస్టియర్ చదువుతుంది. ఆమె కపిల్ దేవ్ ఫ్యాన్.
    
    అందరూ దీక్షగా ఆటని చూస్తున్నారు. పిచ్ వల్లనో, కపిల్ దేవ్ చాకచక్యం వల్లనో బాల్ అద్భుతంగా స్వింగ్ అవుతోంది. కపిల్ దేవ్ ను బూన్ ఎదుర్కొంటున్నాడు.
    
    ఒకటి... రెండు.... మూడుసార్లు బంతులు విసిరాడు. బూన్ ఒక్క పరుగు కూడా తియ్యలేకపోతున్నాడు. నాలుగోసారి బాల్ దూసుకుంటూ వచ్చింది. బూన్ గట్టిగా బూట్ తో కొట్టాడు. సరిగ్గా కనెక్ట్ కాకపోగా, ఎడ్జికి తగిలి స్లిప్స్ లోకి వెళ్ళింది. అక్కడ గవాస్కర్ ఉన్నాడు. ఆత్రంగా చేతులుజాచి బంతిని పట్టుకోబోయాడు. అందరూ కాచ్ పట్టాడనే అనుకున్నారు. కాని ఎక్కడో పొరపాటు జరిగింది. బాల్ గవాస్కర్ చేతిలోంచి జారి పక్కకు పడిపోయింది.
    
    కపిల్ దేవ్ కళ్ళలో నిరసన వ్యక్తం చేస్తూ ఒక్కచూపు చూశాడు. కాని గవాస్కర్ అదేమీ పట్టించుకోవటంలేదు. తన ఎడమచేయి బొటనవేలి దగ్గర బాధగా పట్టుకుని విలవిల్లాడుతున్నాడు.
    
    "దెబ్బ తగిలినట్లుంది" అన్నాడు రాజాచంద్ర.
    
    "ముసలాడు మంచి కాచ్ పాడుచేశాడు" అన్నాడు రాఖేష్ చిరాకుని ప్రదర్శిస్తూ.
    
    "పాపం చాలా ట్రై చేశాడురా వేలు ఫ్రాక్చర్ అయిందేమో పెవిలియన్ లోకి వెళ్ళిపోతున్నాడు" అన్నాడు సానుభూతిగా రాజాచంద్ర.
    
    విశారద ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తోంది.
    
    "ఏమయినా కపిల్ కూ గవాస్కర్ కూ పడటంలేదు. ఇద్దరూ ఒకరిమీద ఒకరు నేస్టీ స్టేట్ మెంట్స్ ఇచ్చుకుంటున్నారు" అన్నాడు రాఖేష్ మళ్ళీ.
    
    "కపిల్ కెప్టెన్సీ అంత బావుండదు. ఎప్పటికైనా మళ్ళీ గవాస్కర్ ను తీసుకొస్తేనేగాని టీమ్ స్పిరిట్ అదీ రాదు" అన్నాడు మనోజ్.
    
    వినూత్నకు కోపమొచ్చింది. "అలా అనకు. వరల్డ్ కప్ గెలిపించింది కపిల్ దేవ్ కాదూ? అంతవరకూ వరల్డ్ కప్ అనేదిమనం చేజిక్కించుకోగలమని కలగన్నామా? టీమ్ లో దమ్ము లేకపోతే కపిల్ ఏం చేస్తాడు? మనదేశంలో ఇంతవరకూ అలాంటి బౌలర్ పుట్టాడా? బెస్ట్ ఆల్ రౌండర్ గా ఇమ్రాన్ ఖాన్ తో, హాడ్లీతో, బోథమ్ తో పోటీపడుతూ వస్తున్నాడంతే సామాన్యమైన విషయమా?" అంది.
    
    "ఇంకా తగ్గవోయ్. గవాస్కర్ సాధించిన విజయాల్లో ఇది ఎన్నో వంతు? ముఫ్ఫైకి పైగా సెంచరీలు, పదివేల పరుగులు పూర్తిచేశాడు.
    
    "గవాస్కర్ రివార్డ్స్ కోసమాడుతాడు. మేచ్ లు గెలవటానికి ఎన్నిసార్లు సాయపడ్డాడో చెప్పు" అంది వినూత్న.
    
    "మీరు మేచ్ చూస్తారా? వాదులాడుకుంటూ ఉంటారా?" అన్నాడు రాజాచంద్ర కొంచెం కసిరినట్లుగా.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS