Next Page 
స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్ పేజి 1

 

   ప్రొలోగ్ :        
    ఏ ప్రాణికైనా- పయనించడం జీవన విధానంలో ఒక భాగం!   
    పురుగైతే ఆహారంకోసం, మనిషైతే కడుపుతోపాటు కీర్తికోసం,   
    కుటుంబంకోసం, కాసింత ఆనందంకోసం పరుగెత్తడం అవసరం!!    
    అలాంటి అమాయక క్రిముల్ని- తన గూడులోకి చిక్కుకోగానే    
    చటుక్కున పట్టుకుని మింగడం ఎలాగో సాలెపురుగుకి తెలుసు.    
    సమాజంలోని లొసుగుల్ని వలలా అల్లి, అడ్డొచ్చిన వాళ్ళని    
    చచ్చేవరకూ వేటాడుతూ, తమ కడుపు నింపుకోవడం ఎలాగో    
    సాలెపురుగుల్లాంటి కొందరు మనుష్యులకూ తెలుసు.    
    వాళ్ళు అల్లిన గూళ్ళు-    
    వ్యాపార ఆర్ధిక బంధాలు కావొచ్చు.    
    రక్షణకోసం ఏర్పడిన పోలీసు వ్యవస్థ కావొచ్చు.    
    చివరగా-    
    రాజకీయాలు కావొచ్చు.    

    ఈ మూడూ....సమాజం సాలెగూడుని

    అందంగా పట్టి వుంచే విషపు తాళ్ళు!!!                           
                                         స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్
              
                                      ---యండమూరి వీరేంద్రనాథ్
                                               

   ఆ రోజు ఉగాది!    
    అందుకే ట్రెయిన్ అంత రష్ గా లేదు. రైలు గాలిని చీల్చుకుంటూ వెళుతూంది.    
    అతడు కిటికీలోంచి బయటకు చూస్తున్నాడు. అతడి వయస్సు 25-30 మధ్య వుంటుంది. తీక్షణమైన కళ్ళు, బిగించిన పెదవులు పట్టుదలని సూచిస్తూంటే నుదుటిమీద అల్లరిగా పడే జుట్టు, వంగిన క్రింది పెదవి అల్లరిని సూచిస్తున్నాయి. ఒక మనస్తత్వవేత్తగానీ అతడిని చూస్తే, ఒక మిక్స్ డ్ పర్సనాలిటీ గా అభివర్ణిస్తాడు.    
    ట్రెయిన్ మరింత వేగం అందుకుంది.    
    అతడు జేబులోంచి కాగితం తీసి మరోమారు చదువుకున్నాడు. ట్రాన్స్ ఫర్ ఆర్డర్.    
    అతడి కళ్ళముందు లాఠీలు కదుల్తున్నాయి. రైలు శబ్దానికి బదులు ఆక్రందనలు వినపడుతున్నాయి. అతడు చప్పున కాగితం మూసి జేబులో పెట్టుకున్నాడు.    
    "అంకుల్ ఇదిగో చాక్లెట్".    
    అతడు తలతిప్పి చూశాడు. ఎదురుగా పన్నెండేళ్ళ పాప చిరునవ్వుతో నిల్చుని వుంది. అవతలివైపు కూర్చున్న పాప తల్లి ఇటే చూస్తూంది.
    
    "ఈ రోజు నా పుట్టినరోజు."
    
    "ఓహో! అలాగా!! ఉగాది రోజున పుట్టావన్నమాట. మెనీ రిటర్న్స్ ఆఫ్ ది డే" చాక్లెట్ అందుకుంటూ అన్నాడు. "పుట్టినరోజు ఫ్రెండ్స్ తో ఆడుకోకుండా రైల్లో ప్రయాణం చేస్తున్నావేమిటి?"    
    పాప దానికి సమాధానం చెప్పకుండా "మరి పండుగరోజు నువ్వెందుకు తిరుగుతున్నావ్?" అని తిరుగుప్రశ్న వేసింది అతడు బిగ్గరగా నవ్వి, "మేం ఉద్యోగస్తులం కదా, బంతిలాగా ఎక్కడికి కొడితే అక్కడకు వెళ్ళాలి. ట్రాన్స్ ఫర్ అయింది. వెళ్తున్నాను" అన్నాడు.    
    "నువ్వు చేసేది ఏం ఉద్యోగం అంకుల్?"    
    "నేను పోలీస్ ఇన్ స్పెక్టర్ నమ్మా."    
    చెవులు దద్దరిల్లేల కూతవేస్తూ రైలు సాగిపోతోంది. పాపమొహం మారిపోయింది. అప్రయత్నంగా దూరంగా జరిగిన పాపని చూస్తూ, "ఎందుకంత భయం?" అని అడిగాడు.    
    ఒక కుర్రవాడు మజ్జిగ గ్లాసులు ట్రేలో పెట్టుకుని అమ్ముకుంటూ వస్తున్నాడు.    
    "నాకు పోలీసులంటే భయం" పాప అన్నది. అతడికి బాధేసింది. ఈ పెద్దవాళ్ళు పిల్లల మనసుల్లో చిన్నప్పటి నుంచే భయాన్ని ప్రవేశపెడతారెందుకో అనుకున్నాడు. ఆ పాపవైపు చూస్తూ, "పోలీసులూ మంచి వాళ్ళేనమ్మా దొంగల్ని పట్టుకుని జైల్లో పెడతారు. కావాలంటే మీ నాన్నగార్ని అడుగు".    
    "మా నాన్నగారు జైల్లో వున్నారంకుల్".    
    దాదాపు అతడి కిటికీని రాసుకుని వెళ్తున్నట్టు పక్క ట్రాక్ మీదనుంచి రైలు వేగంగా వెళ్ళిపోయింది. పాప తల్లి తలవంచుకుని కూర్చుని వుంది.    
    "నాన్నగారికి బర్త్ డే చాక్లెట్ ఇవ్వడం కోసం వెళ్తున్నాను. మా నాన్న చాలా మంచాయనంకుల్. మీ పోలీసులే జైల్లో పెట్టారు."    
    అతడు పాప తల్లి వైపు చూశాడు. ఆమె కంటినుంచి నీటి చుక్కరాలి క్రింద పడింది. అతడికేం మాట్లాడాలో తెలియలేదు. 'పుట్టినరోజునాడు ప్రయాణమేమిటమ్మా' అని అడగడం తనకే గిల్టీగా అనిపిస్తోందిప్పుడు.    
    "నీ పేరేమిటి పాపా?"
    "అభిషిక్త".    
    "మీ నాన్నగారు ఏ జైల్లో వున్నారు?"    
    తల్లి కల్పించుకుని "జైల్లో కాదండి. పోలీస్ స్టేషన్ లాకప్ లో వున్నారు. నాల్రోజుల క్రితం అరెస్ట్ చేశారు."    
    అతడు అభిషిక్త వైపుకు తిరిగి, "చూడు పాపా తప్పు చేయని మనిషిని దేవుడు కూడా శిక్షించలేడు. మీ నాన్నగారు ఏ తప్పు చేయకపోతే ఆయన పోలీస్ స్టేషన్ నుంచి బైటకు వస్తారు." అన్నాడు.    
    పాప మొహంలో ఆనందం కనపడింది. బహుశ ఆ మాత్రం ఓదార్పు ఇచ్చినవాళ్ళు ఎవరూ వుండి వుండరు. తల్లికూడా కృతజ్ఞతతో చూసింది.    
    అతడు కళ్ళు మూసుకున్నాడు. రైలు వేగం తగ్గింది. తన మాటలు తనకే వికృతంగా ధ్వనిస్తున్నట్టున్నాయి.    
    - తప్పు చేయని మనిషిని దేవుడు కూడా శిక్షించలేడు.
     -తప్పుచేయని మనిషిని దేవుడు కూడా శిక్షించలేడు.    
    నిజమా? నిజమేనా?    
    దూరంనుంచి గ్లాసులు ట్రేలో పెట్టుకుని "మజ్జిగ" అని అరుచుకుంటూ వస్తున్నాడు కుర్రవాడు. అతడి దృష్టి ఆ గ్లాసులమీద పడింది. తెల్లటి ద్రవం....కిటికీలోంచి పడుతున్న ఎర్రటి సూర్యకాంతికి రుధిర వర్ణంలోకి విశ్లేషణం చెంది, రైలు కుదుపులకి తరంగాలుగా మారుతోంది.    
    సరీగ్గా వారంరోజుల క్రితం ఇలాటి దృశ్యమే అతడి ట్రాన్స్ ఫర్ కు కారణమైంది.                                           
    అతడి తండ్రి దేశభక్తుడు. అందుకేనేమో కొడుక్కి "రాణాప్రతాప్" అని పేరు పెట్టుకున్నాడు. రాణా చిన్నతనం నుంచీ కట్టుదిట్టాల్లో పెరిగాడు. గాంధీగారు ఆ రోజుల్లో దేశాన్ని శాసించినట్టే, రాణా తండ్రి ఆ ఇంటిని శాసించాడు. ఖద్దరే కట్టాలి, ఎవరూ అబద్దం చెప్పకూడదు, మాంసాహారం నిషిద్దం వగైరా.    
    రాణా తన పదహారో ఏట మొట్టమొదటిసారి సిగరెట్ తాగాడు. ఆ విషయం తండ్రికి మరుసటిరోజే తెలిసింది. సాధారణంగా కొడుకులు సిగరెట్ తాగుతున్నారన్న విషయం తండ్రికి కొన్ని నెలలకో, సంవత్సరాలకో తెలుస్తుంది. కానీ రాణా దీన్ని రహస్యంగా వుంచే ప్రయత్నమేమీ చేయలేదు. నడిబజార్లోనే కాల్చాడు. ఈ విషయం నిముషాల్లో అతడి తండ్రి దగ్గరకు ఎవరో మోసుకొచ్చి పడేశారు. ఆయన మండే కొలిమిలా దహించుకుపోతూ కొడుకు రాగానే రెక్క పట్టుకుని "ఏరా? సిగరెట్ తాగావా లేదా?" అని నిలదీశాడు బెల్టు ఝుళిపిస్తూ.    
    "తాగాను" అన్నాడు రాణా. ఆ సమాధానానికి అతడి వీపు ఆ రోజు పగిలిపోవలసిందే. కానీ కొడుకు మొహంలో కనపడుతూన్న నిజాయితీతో కూడిన ధైర్యం తండ్రిని ఆపుచేసింది. అయినా ఆవేశం ఆపుకోలేక "ఓరి త్రాష్టుడా! తప్పు చేసింది చాలక ఆ విషయం సిగ్గులేకుండా చెప్పుకుంటావా?" అని అరిచాడు.
        "నువ్వేగా నాన్నా- ఏ పనిచేసినా ధైర్యంగా చెయ్యాలి అన్నావ్. పైగా గాంధీగారు అసత్యం చెప్పరాదు అన్నారన్నావ్."    
    "అసత్యం చెప్పరాదు అన్నారేగాని సిగరెట్లు తాగమనలేదురా గాంధీ గారు-"
        "తాగాను" అన్నాడు రాణా, ఆ సమాధానానికి అతడి వీపు ఆ రోజు పగిలిపోవలసిందే. కానీ కొడుకు మొహంలో కనపడుతూన్న నిజాయితీతో కూడిన ధైర్యం తండ్రిని ఆపుచేసింది. అయినా ఆవేశం ఆపుకోలేక "ఓరి త్రాష్టుడా! తప్పు చేసింది చాలక ఆ విషయం సిగ్గులేకుండా చెప్పుకుంటావా?" అని అరిచాడు.    
    "నువ్వేగా నాన్నా-ఏ పనిచేసినా ధైర్యంగా చెయ్యాలి అన్నావ్. పైగా గాంధీగారు అసత్యం చెప్పరాదు అన్నారన్నావ్."    
    "అసత్యం చెప్పరాదు అన్నారేగాని సిగరెట్లు తాగమనలేదురా గాంధీగారు-"    
    "తాగమనలేదు- తాగొద్దనలేదు! నిజంగా గాంధీగారికి మనం సిగరెట్లు తాగడం ఇష్టం లేకపోతే విదేశీ సరుకులొద్దు అని సత్యాగ్రహం చేసినట్టే...స్వతంత్రం రాగానే దేశంలో సిగరెట్టు ఫ్యాక్టరీలొద్దు అని సత్యాగ్రహం చేసి వుండేవారు కదా?"    
    కొడుకుది వితండవాదమైనా ఆ క్షణం తండ్రిని నిలదీసింది. ఈ రకమైన వితండవాదమే పెద్దయ్యాక వృత్తిపరంగా రాణాని చాలాసార్లు చిక్కుల్లో పడేసింది.    
    రాణాని ఇంజనీర్ చెయ్యాలని అతడి తండ్రి కోరిక "ఏరా? బి.ఇ. చదువుతావా?" అని అడిగాడు తండ్రి.    
    "ఉహూ. బి.ఏ. చదువుతా!"
     ఆయన ఆశ్చర్యపోయి "బి.ఏనా? ఎందుకు?" అన్నాడు.    
    "ఐ.పి.ఎస్. అవ్వాలని వుంది నాన్నా నాకు" అన్నాడు రాణా.
    ఖాకీ బట్టలేసుకుని ఠీవిగా జీవులోంచి దిగే డియస్పీలని చూస్తూంటే రాణాకి చిన్నతనం నుంచీ ముచ్చటగా వుండేది.
    కొడుకు పట్టుబట్టడంతో తండ్రికి తప్పలేదు. ఆ విధంగా రాణా ఆర్ట్స్ గ్రాడ్యుయేట్ అయ్యాడు. కానీ ఆ తరువాత చదవలేకపోయాడు. చదువనేది ఎటువంటి పదార్ధమో కానీ, ఎంత తోసినా అతడి బుర్రలోకి ప్రవేశించలేకపోయేది. బొటాబొటిగా ప్యాసయిన కొడుకు మార్కులలిస్టు చూసి, "బి.ఏ. ప్యాసవటానికే ఇంత కష్టపడ్డావ్. రేపు ఐ.పి.యస్. ఎలా అవుతావురా?" అని అడిగాడు తండ్రి.
    "అవును నాన్నా అవలేను. ఆ విషయం నాకూ ఇప్పుడే అర్ధమైంది. అందుకే సబ్-ఇన్ స్పెక్టర్ ఉద్యోగానికి దరఖాస్తు పెట్టాను".
    ఆ ముసలాయన పెనం మీద గింజలా పేలిపోయాడు. "ఇంజనీరువి అవుతావనుకున్నాను. లేదా ఐ.పి.యస్. చదువుతావనుకున్నాను. సబ్-ఇన్ స్పెక్టర్ వి అవుతావా?"


Next Page 

  • WRITERS
    PUBLICATIONS