Next Page 
రాకోయి అనుకోని అతిథి పేజి 1

           

                                 రాకోయి అనుకోని అతిథి
    
    
                                                      ---కొమ్మనాపల్లి గణపతిరావు
    
    
                                    

 

     "మిత్రమా.....నేనీలోకాన అడుగిడిన తొలిక్షణం నాకు గుర్తులేదు కాని వయసు కలలు కావ్య భాషల్ని నేర్పిన లిప్తలు జ్ఞప్తికున్నాయి. ఆరుబయట పడుకుని ఆకాశంలో వెన్నెల్లో తడిసిపోతూ పెదవులపై పడిన మంచు బిందువులు మరేవో స్మృతుల ద్వారాల్ని తెరుస్తుమ్తే ముద్దరాలినై బిడియంగా పులకించిన ఘడియలు గుర్తుకున్నాయి.
    
    అదిగో.... సరిగ్గా ఆ సమయంలోనే కదూ నువ్వు నా ఎదలోయల అడుగు పెట్టింది. నా స్వప్నాల తపస్సులోకి తంస్సులా వచ్చిన నీకు అనుమతిచ్చిందెవరా" అని నేను అబ్బురపడుతుండగానే బహుమతిలాంటి ఉషస్సు నవ్వులతో నన్ను మైమరపించావు....
    
    "నా చిన్న జీవితపు రంగస్థలాన నేను రాయని నాటకంలో ముఖ్య పాత్రధారిలా అల్పకాలంలోనే చెరగని ముద్రవేసి నా హృదయ దిగంచలంలో అనేక తారల్ని ఉదయింపచేసిన నువ్వు ఆ తర్వాత ఎందుకమ్మా అదృశ్యమయ్యావ్.... విసుగెత్తే ఏకాంతంలోనే విముక్తిలా ప్రత్యక్షమైన నువ్వు అంతలోనే దూరమయ్యావూ అంటే నువ్వు వట్టి అతిథివేనా.... విచ్చిన నా కనురెప్పలపై వెచ్చబడతానన్నావే.....వాలిన నా కళ్ళపై చల్లబడతానన్నావే....చేసిన బాసలన్నీ నీటి రాతలేనా.....నా మనోగగనపు వెన్నెల సితపత్రం మీద నా కనురెప్పల మాటున సిగ్గుతో నిలబడ్డ కన్నెపిల్లల్లా అశ్రువులు రాలిపడుతుంటే.... ఆరని కాష్టంలా..... నా తనువే మండిపోతుంటే చివరి చూపుగానైనా నిన్ను దర్శించే భాగ్యం నాకు లేదా....పోనీయ్ నేస్తం, అగాధ సాగర గర్భంలోకి జారిన నేను ఇక నిన్ను విసిగించను. నాకు మరణమే తప్పనిసరైతె దాన్ని అమరంగా మలుచుకుంటాను..... నీ కనుల ముందు నేను లేకపోయినా ఓ కథగానైనా నీకు వినిపించి బ్రతికిపోతాను."
    
                                              *    *    *
    
    అర్ధరాత్రి దాటి రెండు గంటలు కావస్తూంది.
    
    నగరానికి ఓ మూలనున్న జైలు బ్రతికున్న శవాలుండే స్మశానాన్ని గుర్తు చేస్తూంది. అప్పుడప్పుడూ పరమర్సగా వీచే గాలి నిశీధి విషాద జంత్ర సంగీతాన్ని ఆలపిస్తూ జైలు ఆవరణలోని రావిచెట్టు ఆకుల్ని కదపాలని విఫల ప్రయత్నం చేస్తూంది.
    
    స్త్రీ ఖైదీలకి ప్రత్యేకించబడిన ఆ జైల్లో వుండుండీ వినిపించే గార్డుల బూట్ల చప్పుడు మినహా మరే అలికిడీ లేదు. చుట్టూ వున్న ప్రపంచమంతా ప్రశాంతంగా నిద్రలోకి జారిన ఆ క్షణంలో పన్నెండవ నెంబరు సెల్లో మాత్రం ఓ ఖైదీ మెలకువగా ఓ మూల కూర్చుని వుంది. కారిడార్ లోని ఓ విద్యుద్దీపపు కిరణం ఏటవాలుగా ఇనుప చువ్వల్ని దాటి 'ఏకాంత' మొహంపై పడి పరావర్తనం చెందుతుంటే ఆమె ఇంకా నేలచూపులు చూస్తూనే వుంది. పాతికేళ్ళు నిండని వయసు.....కళ్ళకింద నిద్రలేమితో పేరుకున్న నల్లటి చారలు. అయినా ఆమె మకిలిపట్టిన ఖజురహో శిల్పంలా వుంది.
    
    అదే సెల్లో మరో ఖైదీ అనసూయ ఏ పీడకలనుంచో ఉలికిపడి స్తబ్దంగా కూర్చుని వున్న ఏకాంతని చూసింది "నిద్రపోలేదూ?"
    
    తానడగింది పిచ్చి ప్రశ్నని అనసూయకి తెలుసు.... జైల్లో అడుగుపెట్టిన ఏకాంత మూడేళ్ళ కాలంలోనూ నిద్రపోయింది చాలా తక్కువ. అలా అని ఏకాంత ఏ స్మృతుల్లో తలుచుకుని కంటతడి పెట్టదు. భావరహితంగా ఎటో చూస్తూ వుంటుంది. అనసూయకు తెలిసీ ఏకనాథ కంటతడి పెట్టుకున్నది ఒకే ఒక్కసారి....అది ఆమె తల్లి చనిపోయిందని తెలిసిన రోజు. అదీ ఓ పదినిమిషాలపాటే.... ఆ తర్వాత మామూలు మనిషైపోయింది. ఆ సంఘటన తర్వాతనే అనసూయ ఏకాంతకి చాలా దగ్గరైపోయింది.
    
    "కొత్త కవిత ఆలోచిస్తున్నావా?" జోవియల్ గా అడిగింది అనసూయ. చలం నుంచి విశ్వనాథ దాకా చదివిన ఏకాంతకి తిలక్ కవితలంటే ఎంత ఇష్టమో తెలుసు. అందుకే మనసు అలజడిని అందమైన కవితలతో సమాధిచేసి చివర మృదువుగా నవ్వి వాతావరణాన్ని తేలికపరిచేస్తుంది.... "మాట్లాడు ఏకాంతా!"
    
    అప్పుడు తల తిప్పి చూసింది ఏకాంత. మొహం అణువంత పాలిపోతేనేం మగజాతిని పాదాక్రాంతం చేసుకోగల సాధికారంతో ఆమె చెంపలు మెరుస్తున్నాయి. కనురెప్పలు అలసటగా కాస్త ఒరిగితేనేం అర్ధనిమీలితాలైన ఆమె నేత్రాలు  తలుచుకుంటే ఎలాంటి అనర్ధాన్నయినా సృష్టించేట్టు కనిపిస్తున్నాయి. మాతాహరి మొదలుకుని క్లియోపాత్ర దాకా మాట్లాడగలిగే ఏకాంత ఎంత చదువుకున్నదీ అనసూయకి తెలీదు కానీ ఏదో ఓ రోజు పగిలే అగ్ని పర్వతమనిపించింది చాలాసార్లు.
    
    "మాట్లాడమంటే ఆ చూపులేమిటి?" చిరుకోపంగా అడిగింది అనసూయ.
    
    మృదువుగా అంది ఏకాంత "వారం రోజుల్లో నేను రిలీజ్ కాబోతున్నాను కదూ"
    
    అనసూయ గుండె కలుక్కుమంది. ఈ మూడేళ్ళలో తనకి మానసికంగా చాలా దగ్గరైన వ్యక్తి ఖైదీలందరిలో ఏకాంత ఒక్కర్తే....ఏకాంత గడువు పూర్తవుతుందని ముందే తెలిసినా ఇప్పుడు ఆ నిజం గుర్తుకొచ్చి బాధగా తల వంచుకుంది.
    
    "బాధపడుతున్నావా?" అడిగింది ఏకాంత ఆప్యాయంగా.
    
    ఇంచుమించు ఒకే ఈడు ఇద్దరిదీ.... అందుకే అశ్రుసిక్తంగా చూస్తున్న అనసూయ తల నిమిరింది. "పిచ్చి అనూ! జైలు స్నేహాలు రైలు ప్రయాణీకుల పరిచయాల్లాంటివేనే..... కలుసుకుంటాం.... గమ్యం రాగానే గడువు తీరగానే విడిపోతుంటాం. అయినా...." క్షణం ఆగింది "ఇంత సున్నితమైన మనసున్నదానివి భర్తని ఎలా హత్య చేయగలిగావు?"
    
    అనసూయ చెప్పలేదు. ఏకాంతకీ తెలీని విషయం కాదది. కోటి కలలతో కాపురానికి వచ్చిన ఆడపిల్ల భర్త వ్యాపారం కోసం మరో మగాడితో పడుకోమంటే ఎలా అంగీకరించగలదు....అందుకే ఆ నరకంలో ఇమడలేక అనసూయ భర్తని హతమార్చింది.
    
    "జరిగిందానికి బాధపడుతున్నావా అనూ" లేదని ఏకాంతకి తెలుసు. అయినా అడిగింది. రేపు బయట ప్రపంచంలో అడుగుపెట్టాక తను నిబ్బరంగా బ్రతకటానికి ఈ జవాబులే దివ్యౌషధాలు "చెప్పు అనసూయా?"
    
    "లేదు"
    
    "ఎందుకని?"
    
    "నూరేళ్ళు ఓ రాక్షసుడి పంజరంలో బ్రతకడంకన్నా బ్రతికినంత కాలమూ ఈ జైలు జీవితమే నయమనిపిస్తూంది కాబట్టి"
    
    "కానీ ఇక్కడ నీకు స్వేచ్చలేదు."
    
    "ఈ మాత్రం స్వేచ్చ కూడా లేని దాంపత్య జీవితం నాది."
    
    బడలికగా కళ్ళు మూసుకుంది ఏకాంత.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS