Next Page 
రాధ-కుంతి పేజి 1


         ఇందులో...

    రాధ-కుంతి ( 1 to 20 episodes)
    పెళ్ళిచూపులు ( 21 to 24 episodes)
    ఆరూ - తొమ్మిది ( 25 to 27 episodes)
    "ఒరే ఇడియట్" అనుకున్న అరిటాకు కథ ( 28-29 episodes)
    ఉత్థిష్టంతు ( 30-31 episodes)
   
సాధించేనే మనసా  ( 32-33 episodes)
                            రాధ - కుంతి
                                             _ యండమూరి వీరేంద్రనాథ్


    ఇన్ హైప్లేసెస్ లోలా-
    డిసెంబర్ నెల ఇరవై రెండో తారీఖు సాయంత్రం నాలుగున్నరకి మూడు వేర్వేరు ప్రదేశాల్లో మూడు వేర్వేరు ప్రదేశాల్లో మూడు వేర్వేరు సంఘటనలు జరిగాయి.
    ఒకటి రాధ ఇంట్లో-
    ఇంకొకటి ఆల్ ఇండియా రేడియో స్టేషన్ డైరెక్టర్ పార్థసారధి కార్యాలయంలో-
    మూడోది "మాడిజం" సంస్థ ఆన్ రిజిస్టర్డు ఆఫీసులో...
    ఈ మూడు విషయాలకి సంబంధం లేదు పైకి.
    (రాధ -కుంతి నవలలో రేడియోస్టేషన్ ల గురించి వ్రాసిన వివరాలన్నీ దాదాపు 30 ఏళ్ళ క్రితపువి. ఈ రచన కూడా 1980 ప్రాంతాల్లో చేసింది. అప్పటి పరిస్థితులు పాఠకులకి తెలియజేయాలని వాటిని ఈ ఎడిషన్ లో మార్చలేదు.
                                                                   - రచయిత)   

                                                      1
    "చూడమ్మాయ్! నా సహనానికి ఒక హద్దు వుంది. ఇప్పటికి ఆర్నెల్ల అద్దె బాకీ, ఇంక వూరుకొనేది లేదు. ఇన్నాళ్ళూ మొగదక్షత లేనివాళ్ళు కదా అని తటపటాయించాను. రేపు సాయంత్రంలోగా ఇల్లు ఖాళీ చేయకపోతే నేను మీ సామాన్లు బయట పడెయ్యవలసి వస్తుంది" అంటూ లేచాడు.
    రాధ ఆయనవైపు నిస్సహాయంగా చూసింది. లోపల గుమ్మం దగ్గర నిలబడ్డ రాధ బొమ్మ ఒక్కడుగు ముందుకు వేసి ఏదో చెప్పబోయింది. ఆయన వినిపించుకోకుండా వెళ్ళటానికి ఆయత్తమవుతూ "అర్ధమయిందిగా రేపే ఆఖరి రోజు" అని విసవిసా వెళ్ళిపోయాడు.
    రాధ అటువైపే చూస్తూ నిలబడింది. గదంతా మసక చీకటి నెమ్మదిగా అలుముకుంటూంది. కరెంట్ వాడు కనెక్షన్ తీసేసి నాల్గు నెలలయింది. కిరసనాయిలయిపోయి రెండు నెలలయింది.
    రాధ నెమ్మదిగా వెనుదిరిగింది. వెనుక నాయనమ్మ అలాగే గుమ్మం దగ్గర నిలబడివుంది. ఇద్దరి కళ్ళూ కలుసుకున్నాయి. రాధ మొహంమీదకి బలవంతాన నవ్వు తెచ్చుకుని "నాయనమ్మా, ఈ రోజు వర్జమేమన్నా వుందా?" అని అడిగింది.
    బామ్మ నవ్వింది. "ఈ రోజేం ఖర్మమమ్మా, మీ తాతగారు పోయినప్పట్నుంచీ వర్జమే. ఇహ మీ నాన్న పోయినప్పట్నుంచీ అంటావా - అంతా మూఢమే-"   
    కష్టమొచ్చినప్పుడు నవ్వటం రాధ కలవాటు, జోకులెయ్యటం బామ్మకలవాటు. కష్టాలని నవ్వుతో పరిహసించటం వారిద్దరూ పది సంవత్సరాల క్రితమే నేర్చుకున్నారు.
    "నేనలా బైటికెళ్ళొస్తాను బామ్మా" అంది రాధ.
    "చీకటి పడ్తోందమ్మాయ్, తొందరగా వచ్చెయ్యి". లోపలి చీకటికన్నా బయట చీకటే బావుంటుంది అనుకుంటూ- రాధ బయటికి నడిచింది. ఊరిచివర కాబట్టి ఇళ్ళు అక్కడక్కడా విసిరేసినట్టున్నాయి. మైదానం మధ్య ట్రంకురోడ్ నల్లగా, పాములా వుంది. రాధ అటువైపు వెళ్ళకుండా కుడిపక్కకు నడిచింది. వందగజాలు నడిస్తే చెరువు. అక్కడక్కడా పెద్ద పెద్ద బండరాళ్ళు. ఒక రాయిమీద కూర్చొంది.
    సూర్యుడు పశ్చిమంవైపు జారిపోతున్నాడు. శీతాకాలం అవటంవల్ల చీకటి పడకుండానే చలి ప్రారంభం అయింది. దూరంగా ట్రంకురోడ్ మీద ఓ పోలీస్ వ్యాన్ చెరువుకు అటువైపునుంచి పెద్ద శబ్దం చేసుకుంటూ వెళ్లిపోయింది. అప్పుడు జ్ఞాపకం వచ్చింది రాధకి-ప్రధానమంత్రి ఆ రోడ్డువెంటే మరుసటి రోజు వెళ్తారని. 
    రేపే అంధ్రప్రదేశ్ రేడియో స్టేషన్ ప్రారంభోత్సవము. దానికోసమే ప్రధానమంత్రి వస్తూన్నది.
    తనని రేపు ఇంటర్వ్యూలో ఈ విషయం గురించే ప్రశ్నలడుగుతారని రాధకి బాగా నమ్మకం. అందులోనూ ఇంటర్వ్యూకి వెళ్తున్నది కూడా రేడియో స్టేషన్ కే.
    ఆమెకి ఉద్యోగం వస్తుందని నమ్మకంలేదు. అయినా వెళ్ళక తప్పదు.
    చెరువు మీదనుంచి చల్లటిగాలి వీస్తూంది. ఇంకోవైపు మైదానంలో దూరంగా ఓ ఒంటరి గేదె సమస్యల్లేకుండా హాయిగా గడ్డి మేస్తూంది. భూమీ ఆకాశం కలిసే చోటునుండి సంధ్య ఎర్రటి మేలిముసుగు సవరించుకొంటూ వస్తూంది. ఆమెకో ఆలోచన వచ్చింది.
    ఆత్మహత్య చేసుకొంటే?
    ఉహూ.... దానివల్ల సమస్య తీరదు. ఇంటిగలాయన్ని ఏడిపించటం కోసం యితే చేసుకోవచ్చు. ఏ చెడు నక్షత్రమో చూసి చేసుకొంటే ఇల్లు నాల్గు నెలలు పాడుపెట్టాల్సి వస్తుంది. అప్పుడుగాని కసి తీరదు.
    మళ్ళీ అంతలోనే ఆమెకు ఇంటాయనమీద జాలేసింది. ఆయన మాత్రం ఏం చేస్తాడు -ఆర్నెల్ల అద్దె బాకీ! అసలు ఇంత కాలం వుండనిచ్చినందుకే సంతోషించాలి. ఆమెకు నవ్వొచ్చింది.
    కానీ అంతలోనే అకస్మాత్తుగా దుఃఖం వచ్చింది. ఒంటరి తనం ఎంత భయంకరమైనదో చాలామందికి తెలీదు. నిజానికి ఒంటరితనంకన్నా వేదన కలిగించేది మనిషికి ఇంకొకటి లేదు. ఆ మసక చీకట్లో - ఆ నిర్మానుష్యపు మైదానంలో ఆమె అలా ఏడుస్తూ చాలాసేపు వుండిపోయింది. బామ్మ అనే బంధం ఒకటి లేకపోతే ఆ క్షణం ఆ చెరువులో దూకి ఆమె ఆత్మహత్య చేసుకొనేదే.
    కొంచెం సేపయిన తర్వాత ఆమె తేరుకొంది. కానీ అలాగే కదలకుండా మోకాళ్ళ మధ్య తల ఉంచుకుని కాళ్ళ దగ్గిర ఉన్న నీళ్ళకేసి చూస్తూ వుండిపోయింది.
    అప్పుడు వినిపించింది చెరువులో ఎవరోపడినట్టు "దబ్" మన్న చప్పుడు ఆమె చప్పున తలెత్తి చూసింది. అంతా నిర్మానుష్యంగా వుంది. దూరంగా మిలట్రీ వ్యాన్ వెళ్తోంది. ఆమె నీళ్ళకేసి చూసింది. లోపల్నుంచి గాలి బుడగలు బుడగలుగా వస్తూంది. అంతలో ఓ చెయ్యి నీళ్ళలోంచి బైటకొచ్చి పట్టుకోవటానికి ఏమీ దొరక్క మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది. ఆమెకేం చెయ్యాలో తెలియలేదు. ఎక్కడా జనసంచారం లేదు. చుట్టూ చూసి, సహాయానికి ఎవరూ రారని నిశ్చయించుకొని నీటివైపు చూస్తే ఓ తల బయట కొచ్చింది. నీటిగుర్రం లోంచి వచ్చినట్లు నోట్లోంచి నీళ్ళు వస్తుండగా మళ్ళీ ఆ తల మునిగిపోయింది. ఆపైన రెండు చేతులూ పైకి వచ్చి, ఏదైనా గడ్డిపరక దొరుకుతుందేమోనని వెతికి మళ్ళీ మునిగిపోయాయి.
    రాధ చెరువుచుట్టూ చూసింది. చెరువుకి అటువైపు పొలాలు. రెంటికి మధ్య రోడ్డు. చిన్న బ్రిడ్జి, అంతా నిర్మానుష్యం.
    ఆమె దృష్టి చెరువులో, బ్రిడ్జి దగ్గరవున్న వెదురు బొంగుల మీద పడింది. ఉరుకులూ పరుగుల్తో అక్కడకు చేరుకుంది. చెరువులో వెదురు బొంగులు బ్రిడ్జివైపు నిలబెట్టబడి వున్నాయి. ఆమె బురదలో దాదాపు జారిపడబోయి నిలదొక్కుకుంది. ఒక వెదురుని పట్టుకొని లాగబోయింది. ఒక దానికి ఒకటి కట్టి వున్నాయేమో అవి రాలేదు. ఆమె నిస్సహాయంగా మళ్ళీ చూసింది. చెరువులో అలికిడి లేదు. ఆమెకు భయం వేసింది. టెన్షన్ తో కళ్ళ నీళ్ళు తిరిగాయి. మళ్ళీ తను నిలబడిన పూర్వపు స్థానానికి పరుగెత్తింది.
    జాగ్రత్తగా చూస్తే, ఒక్కో గాలిబుడగా బుళుక్ బుళుక్ మని శబ్దం చేస్తూ రావటం కనిపించింది. లోపల జీవి ఇంకా బాల్చీ తన్నేయలేదన్న మాట. చీరెవిప్పి వీరవనితలా అతగాడ్ని పైకి లాగుదామా అనుకొంది. కానీ, తనకున్నదీ ఒకే చీరె అనీ, దానికి రెండు సంవత్సరాల వయసనీ, ఒకవేళ తను అందించినా అది చిరిగి సగం తన చేతిలోనూ సగం నీటిలోనూ మిగిలిపోతుందనీ ఆమె గుర్తించింది. 
    ఏ ప్రాంతంలోనూ ఆ చెరువు నాలుగు అడుగులకన్నా ఎక్కువ లోతుండదని ఆమెకి గన్ షాట్ గా తెలుసు. అయినా ఈ పడినవాడు మూడు చెరువుల నీళ్ళు తాగుతున్నాడంటే, వీడు రెండు గన్ షాట్స్ గా పొట్టివాడూ, మూడున్నర అడుగుల ఎత్తువాడూ అయివుంటాడు. "అటువంటి వాడికోసం చీరె విప్పటం అవసరం" అంటుంది విజయేగానీ తన స్థానంలో వుంటే.
    విజయ తన పరిస్థితిలో వుంటే ఏం చేస్తుందీ అన్న ఆలోచనకి టైమ్ లేదు. చెరువులో అడుగున, ఆ పడినవాడు కాళ్ళూ చేతులూ కొట్టుకుంటున్నాడు.
    ఆమె మరి ఆలోచించకుండా నీళ్ళలో దూకింది. అరనిముషంలో కోటు చేతికి దొరికింది. దాన్ని పట్టుకొని లాగితే, దానితో పాటూ శరీరమూ బయటకొచ్చింది. ఆమె అభిప్రాయం కరక్టే. ఆ చెరువు నాలుగు అడుగుల కన్నా ఎక్కువ లోతుండదు.
    అతను వామనుడే.
    నవల్లో హీరో కాదు. అరవై ఏళ్ళవాడు.
    అతికష్టంమీద అతడిని బయటకు లాగి పడుకోబెట్టింది. కనుచూపుమేరలో జనసంచారం లేదు. అతణ్ణి వెల్లకిలా పడుకోబెట్టి కడుపు నొక్కాలా బోర్లా పడుకోబెట్టి వీపు నొక్కాలా అన్న విషయం- ఆటో క్లాసులోనో, ఏడో క్లాసులోనో చదువుకొన్నది. గుర్తురాక నుదురు కొట్టుకుంది.
    కానీ, ఆమెకు పరిశ్రమ ఇవ్వకుండానే ఆ ముసలివాడు కళ్ళు విప్పేడు.
    "ఎవర్నువు? రంభవా? ఊర్వశివా?"
    "నా పేరు రాధ తాతగారూ!"
    "అయితే ఇది ద్వాపరయుగం అన్నమాట" అంటూ మోచేతిమీద లేచేడు. "స్వర్గానికి రాకుండా కృష్ణ సామ్రాజ్యానికి వచ్చేనేమిటి?" అన్నాడు.
    అప్పుడర్ధమయింది రాధకి జోకు. వళ్ళు మండింది. వయసులో వున్న ఒంటరి ఆడపిల్లని చూస్తే ముసలివాడికి కూడా జోకు వెయ్యాలనిపిస్తుంది. కృష్ణ సామ్రాజ్యమట - కృష్ణసామ్రాజ్యం.
    "వసుదేవుడుగారూ- మీ ఆరోగ్యం బాగానే వుందికదా" అంది నమ్రతగా.
    "నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా! నా ప్రాణాలు రక్షించావు" అన్నాడు అంతే నమ్రతగా అతను.
    రాధ బుగ్గలు ఉక్రోషంతో ఎర్రబడ్డాయి. అయినా ఆ వృద్ధుడి స్పాంటేనియిటీకి ఆనందించింది మనసులోనే.
    ఈ లోపులో ఆ వృద్ధుడు కోటువిప్పి నీళ్ళు పిండసాగాడు- సాలార్ జంగ్ తాతగారి కోటులా వుంది.
    రాధక్కూడా తనచీరె బాగా తడిసిపోయిందని గుర్తొచ్చింది. అక్కడక్కడా నాచుకూడా అంటుకొంది. ఆ మరుసటిరోజు ఇంటర్వ్యూ సంగతి జ్ఞాపకం వచ్చి విచారమేసింది. ఉట్టి నీళ్ళతో ఉతికితే ఈ తామర పోతుందో పోదో తెలీదు. కానీ, బట్టల సబ్బు మాత్రం ఇంట్లోలేదని ఖచ్చితంగా తెలుసు.
    "ఏమిటమ్మాయ్ ఆలోచిస్తున్నావ్?"
    ఆమె పేలవంగా నవ్వి "ఏం లేదు తాతగారూ" అంది. "నీ చీరె" అన్నాడతను. "ఏముందీ- ఇంకో అరగంట వుంటే ఆరిపోతుంది. మా ఇల్లు కూడా దూరం లేదులెండి. అదిగో, ఆ కనబడేదే - దూరంగా".
    "ఈ లోపులో జలుబు చేస్తుంది" అని ఏదో అనబోయి, మళ్ళీ ఏం ఆలోచించుకున్నాడో ఏమో "సరే అయితే" అంటూ లేచాడు. "నన్ను రక్షించినందుకు నీకేం సాయం చేయగల్నో చెప్పు అమ్మాయ్!" అన్నాడు.
    రాధకో క్షణం అర్ధంకాలేదు.
    అయోమయంగా అతడివైపు చూసింది. తైలసంస్కారం లేని జుట్టూ, అస్తవ్యస్తంగా పెరిగిన మీసాలు, పాతకోటు, క్రిందనుంచి కనబడుతున్న చిరిగినా కాలరూ, అతుకుల పంట్లాము - పిట్టలదొరలా వున్నాడు, తనకి సాయం చేస్తానంటున్నాడు. జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలటం అంటే ఇదే. ఆమెకి నవ్వొచ్చింది. దాన్ని బైటకి కనబడనివ్వకుండా, "మీరు నాకు ఏ సాయం చెయ్యగలరు కుచేలుడుగారూ?" అంది.
    "సింహము - చిట్టెలుకా కథ జ్ఞాపకం లేదా?"
    "ఇంకా నయం, రాజకుమార్తె.... ఏడుగురు మరుగుజ్జులూ కథ జ్ఞాపకం తెచ్చుకో మనలేదు" అనేసి వెంటనే బాధపడింది అలా ఎందుకన్నానా అని. అయితే అతను దాన్ని నవ్వుతూనే స్వీకరించేడు. తన ఆకారము విఅపు ఒకసారి చూసుకొని, తలెత్తి ఆమె వైపు చూసి "నువ్వెలా అనుకున్నా ఫర్లేదు. చెప్పు నీకేం సాయం చెయ్యగలను?" అని అడిగాడు. 


Next Page 

  • WRITERS
    PUBLICATIONS